అంబేడ్కర్ చరిత్ర తెలుసుకోవడం ప్రజల బాధ్యత!
ఒకప్పుడు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వారంతా ఇప్పుడు దానిని నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారు ఒక ప్రక్క రాజ్యాంగాన్ని
ఒకప్పుడు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వారంతా ఇప్పుడు దానిని నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారు ఒక ప్రక్క రాజ్యాంగాన్ని కీర్తిస్తూనే డా.బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠశాలల్లో పాఠ్యాంశంగా పెట్టకపోవడం చూస్తే బుద్ధిపూర్వకంగా ప్రభుత్వాలు ఆయన్ని నిర్లక్ష్యం చేయడమే అని చెప్పక తప్పదు. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే రాజ్యాంగం ఎవరు వ్రాసారు అనేదే కాకుండా ఏ మూలాల నుండి ఏ సిద్ధాంతాల నుండి రాజ్యాంగం రూపొందించబడిందో అర్థమవుతుంది. భారత రాజ్యాంగం సూత్రాలు ‘ప్రియాంబుల్’ వారికి అర్థమయితేనే వారు దేశభక్తిని, జాతీయ భావాలను, వ్యక్తిత్వ నిర్మాణతను కలిగి ఉంటారు.
భారతదేశంలో జాతీయ భావాలు ప్రజాస్వామిక, ప్రవర్తన, లౌకికవాద జీవన వర్తన లోపించుటకు కారణం ప్రియాంబుల్ అంటే ఎమిటన్నది విద్యార్థులకు చిన్న వయస్సులోనే తెలియకపోవడమే. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ కార్యకర్తలు.. నాయకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రాజ్యాంగం అర్థం కాకుండా జాతీయ భావాలను వీరు ప్రచారం చేయలేరు. లౌకికవాద భావజాలం భారతదేశానికి జీవశక్తి.
అదే నిజమైన స్వాతంత్ర్యమని..
లౌకిక ప్రజాస్వామిక సోషలిస్టు దృక్పథంతో రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం అంబేడ్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అంబేడ్కర్ ఉన్నత ఆశయాలతో రాజ్యాంగాన్ని రూపొందిడచమే కాదు. ‘ఆచరణలో బలంగా అన్వయించబడినపుడే ఆ ఆశయాలకు సార్థకం’ వుంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సభ చర్చల సందర్భంలో అంబేడ్కర్ ‘కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలకు తగినట్లుగా రాజ్యాంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండాలి’ అని అన్నారు. అయితే ఆచరణలో పాలకవర్గాలకు మేలు జరిగే సవరణలే ఎక్కువ జరిగాయి.‘ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రభుత్వం కాపాడినపుడే అది నిజమైన స్వాతంత్య్రం’ అని అంబేడ్కర్ పేర్కొన్నాడు. కానీ ప్రజల మీద ఈనాడు పాశవిక దమనకాండ జరుగుతూ ఉంది. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పాలకవర్గం అనేక సందర్భాలలో తమ ప్రయోజనాల కోసం కాలరాస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వం అమలు జరుగుతూ ఉంది. దేశంలో ఉన్న ప్రతి పౌరునికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి సమాన అవకాశాలు ఉండాలన్నారు. కానీ ఆచరణలో ధనిక వర్గాలు అత్యున్నతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పేదవాడు నానాటికీ దుర్భర దారిద్య్య్రపు ఊబిలోకి కూరుకుపోతూ ఉన్నాడు.
అన్ని అంశాలపై అంబేడ్కర్ ముద్ర!
నిజానికి భారత రాజ్యాంగం ఏర్పడిన విధానం అర్థమైతే దేశ ప్రజల్లో ఒక సామాజిక, సాంస్కృతిక, తాత్విక, సామరస్య భావన ఏర్పడుతుంది. అంబేడ్కర్ రాజ్యాంగం మీద విశేషమైన కృషి చేసిన ఆచార్య డా. మహ్మద్ షబ్బిర్ రాజ్యాంగ రూపకల్పన గురించి ‘డా.బి.ఆర్.అంబేడ్కర్ స్టడీయింగ్ ఇన్ లా అండ్ సొసైటీ’ అనే గ్రంథంలో రాజ్యాంగ రూపకల్పన నేపథ్యం గురించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన సిద్ధాంత బలం గురించి ఇలా విశ్లేషించారు. స్వభావరీత్యా అంబేడ్కర్ ఉదారవాది. ప్రభుత్వం సోషలిజంతో పాటుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది పశ్చిమ ప్రభావం అని డా. అంబేడ్కర్ నొక్కి చెప్పారు. అయితే, సమన్యాయం, పౌరుల మధ్య సమానత్వం, శాసన రూపకల్పన, విధాన నిర్ణయంలో రాజకీయ భాగ స్వామ్యం అన్నవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆమోదించాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్తగా, ఆయన దేశానికి తగిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సూచించారు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనను ప్రారంభించినప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు ఆ కాలంలోని రాజ్యాంగ నిపుణులను, సర్ ఐవర్ జెన్నింగ్స్‌ను ఆహ్వానించి, సంప్రదించాలని భావిం చారు. ఈ విషయమై సలహా కోసం వెళ్లినప్పుడు దేశంలోనే న్యాయ, రాజ్యాంగ నిపుణుడు అయిన అంబేడ్కర్ అన్ని అర్హతలను కలిగి ఉన్నప్పుడు, విదేశీ నిపుణుల కోసం చూడటం ఎందుకని గాంధీజీ ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆ పదవికి అత్యంత అర్హుడని అన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ నిర్మాణాత్మక పాత్రను జవహర్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ తదితరులతో సహా దేశంలోని నాయకులందరూ ప్రశంసించారు. కనుక, రాజ్యాంగంలోని దాదాపు అన్ని అంశాలపైనా ఆయన ప్రభావం కనిపిస్తుంది. అయితే రాజ్యాంగం ఎంత మంచిది అయినా, దానిని అమలు చేయాల్సిన వ్యక్తులు మంచివారు కాకపోతే అది మం చిది కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు.
అంబేడ్కర్ పేరు పలకకుండా..
దేశంలో మోడీ పరిపాలనలోకి వచ్చాకే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగ కీర్తనలు ప్రారంభించాయి. కానీ ఇప్పటి వరకు కమ్యూనిస్టులు ‘అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ఏ విధమైన నినాదం, ప్రకటన, డిమాండ్ తీర్మానం చేయలేదు. కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు. కానీ అంబేడ్కర్ చిత్రపటాన్ని కూడా వారు ఇంకా తమ ఆఫీసుల్లో అలంకరించలేదు. ‘నీల్ లాల్’ అనే నినాదం అయితే ఇచ్చారు గాని అంబేడ్కర్ జీవిత చరిత్రను అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన విధానాన్ని వారి కార్యకర్తలకు బోధించడం లేదు. పైగా వారు మొదట్లో అంబేడ్కర్‌ను కోటు, సూటు వేసుకున్నందుకు పెటీ బూర్జువాగా ప్రచారం చేశారు. జీవన వర్తనలో ఆయన బౌద్ధ, జీవన, సిద్ధాంత ఆచరణవాది అని తెలుసుకొనలేకపోయారు. ఆయన ఎక్కువ విద్యాదానం చేశాడు. విద్యాలయాలు నిర్మించారు. అందుకే కమ్యూనిస్టులు ఈ ద్వంద వైఖరిని వదిలిపెట్టాల్సి వుంది. రాజ్యాంగాన్ని, కొనియాడుతూ ‘అంబేడ్కర్’ పేరు లేకుండా వారు మాట్లాడుతారు. వారిలో ద్వైధీకృత ఆచరణపోవాల్సి వుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ కూడా రాజ్యాంగాన్ని గూర్చి ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. కానీ ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ను పాఠ్యాంశంగా పెడతామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టలేదు. అంతేగాక కుల నిర్మూలనా వివాహితులకు ఉద్యోగవసతి కలిగిస్తామని సైతం పెట్టలేదు. అందుకే మహారాష్ట్రలో దళితులు, స్త్రీలు ఉచితాలు ఇస్తామనే వారి వైపు మొగ్గు చూపారు.
ప్రియాంబుల్‌ను ప్రతి స్కూల్‌లో చదివిద్దాం!
భారతీయ సమాజంలో కులం ఎంతగా పాతుకొని పోయిందంటే ప్రతి అంశం కులం ఆధారంగానే వ్యవస్థితమవుతుంది. ఒక భారతీయుడు మరొక భారతీయుడితో కలిసి భోజనం చేయలేదు. వైవాహిక సంబంధాన్ని ఏర్పరచుకోలేడు. ఎందుకంటే వారి మధ్య సంబంధాలను కులం నిర్ణయిస్తుంది. రాజకీయాలలో కూడా కుల ప్రాధాన్యతే దర్శనమిస్తుంది. కులవ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలిస్తున్నప్పటికీ కులవ్యవస్థను ప్రోత్సహిస్తున్నవి రాజకీయ పార్టీలే..! అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు సమాజ హితమైనవి. సమసమాజ భావనతో కూడుకున్నవే, నిజాయితీతో, నీతితో కూడుకున్నవే! ఆయన రాజనీతిజ్ఞుడు ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం దేశ ప్రజల బాధ్యత. అందుకే రాజ్యాంగ ప్రియాంబుల్‌ను ప్రతి హైస్కూల్‌లో అసెంబ్లీలో చదివించడం, మన కర్తవ్యం. నేటికి ఆయన పరినిర్వాణం చెంది 68 ఏళ్లు. వచ్చే ఏప్రిల్ 14కు ఆయన జన్మించి 133 ఏళ్లు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రకటించాలనే బాధ్యతను గుర్తించాలి. రాజ్యాంగమే కాదు ఆయన ‘జీవిత చరిత్ర’ కూడా రాజ్యాంగ బద్ధమైనదే. అందుకే అన్ని పార్టీల వాళ్లు ఏకకంఠంతో అంబేడ్కర్ జీవన గాధను అభ్యసించి రాజ్యాంగ పరిరక్షణకు నిజంగా పాటుపడవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
(నేడు డా.బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా)
డాక్టర్. కత్తి పద్మారావు
98497 41695