పరకాల నాగన్నను కాపాడుకోవడం మనందరి బాధ్యత!

రాజ్యానికి అడవిపోరుకు యుద్ధం జరిగిన ప్రతిసారీ పచ్చని అడవిలో వెచ్చని నెత్తురు ఏరులైన పారిన ఘటనలు అనేకం.ఇలా చనిపోయిన వారి

Update: 2024-06-21 00:45 GMT

రాజ్యానికి అడవిపోరుకు యుద్ధం జరిగిన ప్రతిసారీ పచ్చని అడవిలో వెచ్చని నెత్తురు ఏరులైన పారిన ఘటనలు అనేకం.ఇలా చనిపోయిన వారి అమరత్వాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేయడమే కాకుండా కొత్త నెత్తుటికి ఉప్పెనోలే స్వాగతం పలికింది కూడా పాటనే. ఇలా పాడిన గొంతుకల్లో పరకాల నాగన్నది పదునైన గొంతు. ఆయన పాటల నాగన్న లేదా అరుణోదయ నాగన్న అంటే సిక్కోలు నుండి ఆదిలాబాద్ అడవి వరకు గుండాల నుండి చిత్తూరు వరకు ఆయన పాటలకు దాసోహమవ్వని తెలుగు హృదయాలు లేవని అంటే అతిశయోక్తి కాదు.

పాట లేకుండా తెలంగాణ సమాజాన్ని ఊహించుకోలేము. పోరాట పాటలకు పుట్టినిల్లు తెలంగాణనే అనేంత మట్టిబాసల బాణీలు ఇక్కడ పురుడుపోసుకున్నాయి. భూస్వామ్య కౌర్యానికి, దొరల దౌర్జన్యానికి పాట జనం గోసను, యాసను, ఆయుధాలుగా మల్సుకోని పల్లె నుండి పట్నం వరకు అడవి నుండి కారడవి దాకా జంగు సైరన్ ఊదిన చరిత్ర ఈనేలకుంది. పీడిత, తాడిత ప్రజల పక్షాన పాటెప్పుడు అండగనే నిలబడింది. నాల్గు దశాబ్దాల కిందట యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ప్రజాపోరాలు అనేక దారులను ఎంచుకున్నది. ఈ సమయంలోనే కొన్ని సంఘాలు అనేక నిర్బంధాలను ఎదుర్కొనాయి. తెలంగాణ ప్రాంతంలో చైతన్యానికి ప్రతీకగా ఆనాడు ఏదో ఒక వామపక్ష సంఘంలో పనిచేయడమే కేరాఫ్‌గా ఉండేది. ఇలాంటి సందర్భంలోనే ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనార్టీ వర్గాలకు చెందిన ఎందరో యువతీయువకులు అడవిబాటనే ఎంచుకున్నారు.

రామనర్సయ్య పాటకు ప్రాణం పోసి..

గుంటూరు జిల్లా వాసి అంగడి చెన్నయ్య రాసిన"అన్నా అమరుడురా మన రామనర్సయ్య" అనే పాటకు నేటికీ మరణం లేకుండా గానం చేసిన వ్యక్తి అరుణోదయ నాగన్న. నాగన్న గానం చేసిన ఎన్నెన్నో పాటలు ప్రజల నాల్కలపై నేటికీ కూనిరాగాలై మెదులుతున్నాయి."ఎక్కడున్నారో అన్నలు యాడవున్నారో" అనే పాటకు దాసోహమవ్వని తెలుగు పాటల ప్రియులు లేరు. సికాగో నగరాన చిందిన రకంలో తడిసిన ఎర్రగుడ్డ, అడవితల్లి తల్లడిల్లె అన్నా నినుదలచి ఎల్లన్న నిను తలచి, ఓ..అరుణాపతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్ అంటూ వందలాది విప్లవపాటలకు పాణం పోసి పాడిన ఘనత నాగన్నకే దక్కుతుంది. రాజ్యాహింసపైన పాడిన గొంతుపైన తుపాకి గొట్టం ఎక్కుపెట్టినా అలుపెరుగక పాటల ప్రవాహమై పోరు సంద్రానికి బాటలేసిన వారిలో నాగన్న ఒకరు. గోదావరి లోయ పోరాటాలను నువ్వు గొంతెత్తితే అంటూ రాసిన పాటకు జీవం పోసింది ఈ గొంతుకనే.

ప్రజల పాటకు కూడు, గూడు లేదు

నలభై ఏండ్ల కిందట ఖమ్మం జిల్లా వామపక్ష పార్టీలకు ఎర్రని ఖిల్లాగా ఉండేది. ఇదే జిల్లాలోని తిరుమలాయపాళెంలో, రాజారం గ్రామంలో గౌడ ఇంట జన్మించిండు నాగన్న. తండ్రి పాపయ్య కళాకారుడు కావడంతో కళను ఒంటబట్టించుకున్న నాగన్న పాడుతూనే ఎదిగి ప్రజల పాటగా అనేక సామాజిక ఉద్యమాల్లో భాగమైయ్యిండు. తెలుగు నేలపైన జరిగిన అనేకమైన ప్రజాపోరాటాల్లో పాటలవూటగా ప్రత్యక్షమయ్యిండు. కార్మిక ,కర్షక ,మహిళ చైతన్య వేదికల్లో నాయకుడిగా, గాయకుడిగా పనిచేసిన సందర్భాలు అనేకం.

తెలంగాణోద్యమ సమయంలో పల్లె-పల్లెకు పాటలరూపంలో పయనించి నలభైయేండ్లకుపైగా ప్రజల పాటగా బ్రతుకుతున్న వ్యక్తికి కూడు, గూడు, ఆదరణ లేకపోవడమే ఇవ్వాల తెలుగు సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇల్లు లేని నాగన్న మణుగూరు, పిండిప్రోలు, బుగ్గ బంజర, తెట్టెపాడు, కూసుమంచి, వైరా వంటి గ్రామాల్లో సంచారజీవనమే సాగించిండని చెప్పుకోవాలి. ఎక్కడ గుడిసెలు వేసుకున్నా సరే రోడ్డు విస్తరణలో అవి ప్రభుత్వాలు కూల్చేయడం పరిపాటిగానే మారిపోయింది తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇలా గత ప్రభుత్వం ఖమ్మం పట్టణంలో మమతా రోడ్డులో వేసుకున్న గుడిసెలు తీసివేసిన ఘటన అందరికీ సుపరిచితమే.

ఆయనకు దిక్కెవరు?

క్రీడాకారులకు, సినిమా కళాకారులకు ఇచ్చే పారితోషికాలేవీ ప్రజాకళాకారులకు ఇవ్వకపోవడమే మన తెలుగు సమాజంలో ఉన్నటువంటి అతి పెద్ద లోటు. ప్రజల పాటగా అనేక ఉద్యమాలకు ఊపిరిగా బతికిన అనేకమంది కూడా చివరి దశలో సరైన వైద్య సదుపాయం లేకనే కనుమరుగైన సంఘటనలు అనేకమంది వాగ్గేయకారుల నిజజీవితంలో చూశాం. జీవితమంతా ప్రజల పక్షమే వహించిన నాగన్న ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నడు. ఈ పాటకు దిక్కెవరు? ఈ గొంతు కూడా మూగపోవల్సిందేనా? పాటలను ఓన్ చేసుకున్న ప్రభుత్వాలు కావొచ్చు ప్రజలు కావచ్చు పాటగాడిని ఆదుకునేందుకు ఎందుకని ముందుకు రావడం లేదో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన క్లిష్టమైన పరిస్థితి నేడు నాగన్న రూపాన మన ముందు ఉన్నది.

ప్రజా గాయకులను కాపాడుకోలేమా?

కళాకారులను ప్రజల ఆస్తిగానే ప్రభుత్వాలు భావించినపుడు అనామకపు చావు ప్రజా పాటగాళ్లకు దాపురించదు. నాగన్న వంటి గొప్ప కళాకారుడిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇంతకంటే మరింత బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవలసి ఉన్నది. నిలువ నీడలేని నాగన్నకు ప్రభుత్వమే తక్షణ సహాయం కింద ఒక ఇంటిని ఐదెకరాల వ్యవసాయ భూమిని మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అరుణోదయ నాగన్న ఇన్నాళ్లు ఆడిపాడిన పార్టీ సైతం ఎందుకు మౌనం వహిస్తున్నదో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల పాటకు శాశ్వత పరిష్కారముండాలి. సమాజంలో సముచిత స్థానం అంతకంటే ముందుండాలి. ప్రజాకళలు నిత్యం వర్ధిల్లాలి. ప్రజల గొంతుకలు నిత్యం వర్ధిల్లాలి. వీరగాథలను ఆలపించి ఇప్పుడు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న అరుణోదయ నాగన్నను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

వర కుమార్ గుండెపంగు

99485 41711

Tags:    

Similar News