మేథో మధనం.. ఈ అనుసంధానం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 60 నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరం ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.
స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో ప్రథమ ప్రయత్నంలోనే విజయం సాధించింది. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కీలక ఘట్టాలకు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ తొలి సోపానంగా మారనుంది.
జంట శాటిలైట్ల ప్రయోగం విజయవతం
పీఎస్ఎల్వీ-సీ60 ఉపగ్రహ వాహకనౌక రెండు 220 కిలోల ఉపగ్రహాలను భూమి నుండి 470 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. ఆపై, స్పేస్ డాకింగ్ మెకానిజం ద్వారా ఉపగ్రహాలను డాక్ చేస్తుంది. ఇస్రో డాకింగ్ మెకానిజానికి ఇప్పటికే పేటెంట్ పొందింది. రెండు ఉపగ్రహాలు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. స్పెషల్ సెన్సార్ల సాయంతో వాటి సాపేక్ష వేగాన్ని సున్నాకి సమీపంగా తగ్గిస్తారు. ‘ఛేజర్’ మరియు ‘టార్గెట్’ అనే ఉపగ్రహాలు కలిసి ఒకటి అవుతాయి. ఈ మిషన్ దశాబ్ద కాలం పాటు బెంగళూరులో అభివృద్ధి చెందింది. ఇస్రో స్వతంత్రంగా ‘భారతీయ డాకింగ్ సిస్టమ్’ను రూపొందించింది, ఇది నాసా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది భారత అంతరిక్ష అభివృద్ధిలో ముందడుగు. భారతీయ డాకింగ్ సిస్టమ్‌లో 24 మోటార్లకు బదులుగా కేవలం రెండు మోటార్లను ఉపయోగిస్తుంది. గగన్‌యాన్ మిషన్‌ల కోసం 800 మిల్లీమీటర్ల డాకింగ్ పోర్ట్ కూడా అభివృద్ధి జరుగుతోంది.
విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం
ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు.. ఈ పరిశోధనల ద్వారా ఇస్రోకు విలువైన సమాచారం రావడమే కాకుండా స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపకరణాల్లో ఇస్రోకు చెందినవి 14 కాగా.. మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు, విశ్వ విద్యాలయాలకు చెందినవి. ఇందులో తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ వారు ఇస్రో సహకారంలో యుహెచ్‌ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్‌కు సంబంధించిన ‘స్వేచ్ఛశాట్-వీ.0’ని పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ముంబైకి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇది అంతరిక్షంలో ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరగుతాయనే దానిపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడనుంది.
భారతీయ ప్రగతి పతాక
రీలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్. దీనిని వాకింగ్ రోబోటిక్ ఆర్మ్ అని కూడా పిలుస్తారు. రోబోటిక్ టెక్నాలజీలకు ఈ ప్రయోగం పూర్వగామి సాంకేతిక ప్రదర్శనగా ఉపయోగపడుతుంది. డెబ్రిస్ క్యాప్చర్ రోబోటిక్ మానిప్యులేటర్ అభివృద్ధి చేయబడింది, ఈ ప్రయోగం అంతరిక్ష వాతావరణంలో శిథిలాలను సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. రోబోటిక్ మానిప్యులేటర్ భవిష్యత్తులో ఫోఏం మిషన్‌లలో ఫ్రీ-ఫ్లోటింగ్ శిధిలాలను సంగ్రహించగలదు. టెథర్డ్ మరియు ఫ్రీ-ఫ్లోటింగ్ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఇంధనం నింపగలదు. ఈ ప్రయోగం ఆంతరిక్షంలో ఉపగ్రహాల పనితీరును మెరుగుపరచి సోలార్ ప్యానల్, కెమెరాలను సరిచేయడానికి రోబోటిక్ టెక్నాలజీలకు ఉపయోగపడుతుంది. ఆత్మనిర్బరంతో, వైజ్ఞానిక స్వావలంబనతో స్వయం సమృద్ధి సాధించి విజ్ఞాన వాణిజ్య పరంగా అంతరిక్ష రంగలో శరవేగంగా ఎదుగుతోంది భారత్. ఇస్రో కేవలం ఒక వైజ్ఞానిక లేదా సాంకేతిక సంస్థ కాదు. ఇప్పుడది భారత దేశ ప్రగతి పతాక.
- వాడవల్లి శ్రీధర్
99898 55445