యుద్ధకాంక్ష తీరని ఇజ్రాయెల్

పశ్చిమాసియా అగ్నిగుండంలా మారటానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత

Update: 2024-10-03 00:30 GMT

పశ్చిమాసియా అగ్నిగుండంలా మారటానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఇజ్రాయెల్ 41 వేల మందిని అంతం చేసింది. అయినా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధ కాంక్ష తీరలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన నెతన్యాహు అక్కడ నుంచే నస్రల్లా హత్యకు తమ దళాలకు ఆదేశాలు ఇవ్వడం ఆయన పొగరుబోతు తనానికి నిదర్శనం.

హింసను ఆపాలని చెబుతున్నా..

ఈ దారుణ హింసకు ఇకనైనా స్వస్తి పలకాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చెబుతున్నా నెతన్యాహూ అసలు ఖాతరు చేయడం లేదు. ఇజ్రాయెల్ దుందుడుకు ధోరణి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. హమాస్- ఇజ్రాయెల్ మధ్య పోరులో వెనక నుంచి ఆర్థిక సహాయం, దారుణమైన ఆయుధాలు సమకూర్చి ఇజ్రాయెల్‌ను ముందుకు తోసిందే అమెరికా. ఇప్పుడు తాజాగా బీరుట్‌పై దాడులను అమెరికా సమర్ధిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ హెజ్బొల్లా దళాలపై వైమానిక దళంతో బాంబులు కురిపిస్తుంటే, మరోవైపు సిరియాలో ఉన్న అమెరికా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 37 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.

చావుదెబ్బ కొట్టిన ఇరాన్

నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇరాన్ అన్నంత పనీ చేసింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. గత రాత్రి వందలకొద్దీ బాలిస్టిక్‌ క్షిపణులను ఇరాన్‌ శత్రు దేశంపై ప్రయోగించింది. వీటిలో ఒకటి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లోని మొస్సాద్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో పడి ప్రాంతంలో భారీ గుంత ఏర్పడింది. హిజ్బొల్లాలోని కీలక ప్రాంతాల్లో ఐడీఎఫ్‌ దళాలు భీకర దాడులు చేసిన తర్వాత.. ఆ దేశంపై ఇరాన్‌ ప్రత్యక్ష దాడికి దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్ దాడితో అలర్ట్ అయిన ఇజ్రాయెల్‌.. దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తొలిసారిగా సైరన్ల మోత మోగింది. ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దిగితే ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో పరిస్థితులు బాగా దిగజారాయి. దాని ప్రభావం చమురు మార్కెట్లపై పడింది. హమాస్, హెజ్బొల్లా, హూతీలపై ఏకపక్షంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసివేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే చమురు ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. ఈ నేపథ్యంలో లెబనాన్‌ను మరో గాజాలా మార్చకముందే. నెతన్యాహు నియంతను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాల నేతలంతా ఉమ్మడిగా కృషి చేయాలి. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలక తప్పదు.

డా.కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Tags:    

Similar News