మగవాళ్ళకేనా ట్రెక్కింగ్!
మగవాళ్ళకేనా ట్రెక్కింగ్!... is Trekking is only for men
నిజమైన ట్రెక్కర్లకు లింగ వివక్ష ఉండదు కాక ఉండదు. అందరూ సమానమే, ట్రెక్కింగ్‌కు ఆంక్షలు లేవు. అయితే, మహిళలు ఎందుకు రావడం లేదు? వస్తున్నారు కానీ, చాలా తక్కువ సంఖ్యలో. అసలది లెక్క పెట్టదగ్గ సంఖ్య కూడా కాదు. ఇల్లాళ్ళకు వంటిల్లు జీవితకాలపు గుదిబండ. అందుకే వాళ్ళని గంప కింద కోడి పిల్లల్లా ఇళ్లలో దాచేస్తున్నారు. వంటింటికి పరిమితం చేస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇది పురుషాధిక్య సమాజం కదా! ట్రెక్కింగ్‌కు మహిళలు రావడం లేదు. వాళ్ళకసలు తీసుకురావడం లేదు. చెన్నైకి చెందిన వనతి దీనికి పూర్తి భిన్నం. వసతికి సాధారణ ట్రెక్కింగ్ అంటే చాలా చప్పటి కూడులా ఉంటుంది. సాహసోపేతమైన ట్రెక్కింగ్ ఉండాలి. అంటే అడవిలోని కాలి బాటలో నడుచుకుంటూ వెళ్లడం కాదు. ఏటవాలుగా ఉన్న లోయలోకి, చెట్ల కొమ్మలు పట్టుకునో, తాడు పట్టుకునో దిగేయడం. నిట్ట నిలువుగా ఉన్న కొండను అలవోకగా ఎక్కేయడం. దారి తెన్నూ లేకపోయినా చెట్లలో, పుట్టల్లో పడి దారి చేసుకుని వెళ్ళిపోవడం. లోతైన నీటి గుండాలలో దభీలున దూకడం. ప్రవాహంలో ఈదడం.
అడవికెళ్ళేది ఒక్క మగవాళ్లేనా! లోతైన లోయల్లోకి దిగడం, నీటి గుండాల్లోకి దూకడం, కొండ కోనల్లో తిరుగాడడం, ప్రకృతితో మమేకమవ్వడం.. ఒక్క మగవాళ్ళకేనా సొంతం! ఒక్క మగవాళ్ళకేనా సాధ్యం! ఈ సాహసాలు మహిళలు చేయలేరా! ఇళ్ళలో పిల్ల రాక్షసులకు ఇవి పనికి రావా! మహిళలు శక్తి స్వరూపిణులంటారే! ట్రెక్కింగ్‌కు మేమెందుకు పనికి రాము!”
ఇవి కొందరు ఇల్లాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు. నిజమే.. ఇవ్వన్నీ పురుష ప్రపంచం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. నిజమైన ట్రెక్కర్లకు లింగ వివక్ష ఉండదు కాక ఉండదు. అందరూ సమానమే, ట్రెక్కింగ్‌కు ఆంక్షలు లేవు. అయితే, మహిళలు ఎందుకు రావడం లేదు వస్తున్నారు కానీ, చాలా తక్కువ సంఖ్యలో. అసలది లెక్క పెట్టదగ్గ సంఖ్య కూడా కాదు. ఇల్లాళ్ళకు వంటిల్లు జీవితకాలపు గుదిబండ. అందుకే వాళ్ళని గంప కింద కోడి పిల్లల్లా ఇళ్ళలో దాచేస్తున్నారు. వంటింటికి పరిమితం చేస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇది పురుషాధిక్య సమాజం కదా!
ఆదివారం మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు వారికి ఫోన్ వస్తుంది. 'మేడం పనిలో ఉంది. ఏం మాట్లాడతారో చెప్పమ్మా' అంటూ భర్త ప్రశ్న. ‘వచ్చే వారం ...మీటింగ్‌లో మేడం మాట్లాడాలి' అని అభ్యర్థన. ' ఊహూ, మేడంకు వీలు కాదు. అయినా నన్ను పిలవకుండా మేడంను పిలుస్తారా' అంటూ మనసులో గొణుక్కొని ఠపీమని సెల్ ఆఫ్ చేస్తాడు. ఫోన్ ఎత్తుకుంది ఆమె పతి దేవుడు! ఇలా ఉంటుంది చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళల స్వేచ్ఛ. ట్రెక్కింగ్ స్ఫూర్తి గురించి ఇలాంటి వారు ఏం మాట్లాడతారు!
మహిళలు, పిల్లల ట్రెక్కింగ్
దీన్ని అధిగమించడానికి నెలకొకసారి కుటుంబాలతో ట్రెక్కింగ్ వేస్తున్నారు. ఈ ట్రెక్కింగ్‌కు మహిళలు, పిల్లలు వస్తున్నారు. ఆ ఒక్క రోజు వారి ఆనందానికి అవధులు ఉండవు. నెలకొక రోజు అడవికి వచ్చినా, పాపం వారి ధ్యాసంతా వంట పైనే. 'అడవిలో భోజనాలు ఎట్లా అక్కా' అంటుంది ఒక ఇల్లాలు. 'ఆడ కూడా మనమే చేయాలా' మరో ఇల్లాలి సందేహం. 'వంట చేయబడిలే. వాళ్ళే చేస్తారులే' ఇంకో ఇల్లాలి ధీమా. అడవిలో నలభీములు నడుం బిగిస్తారు. చెట్ల కింద వేడి వేడి భోజనాలను వాళ్ళే వండి వారుస్తారు. తొలుత మగవాళ్ళు, పిల్లలు నీటి గుండాలలోకి దూకుతారు. మగవాళ్ళు పైకి వచ్చేశాక మహిళలు కూడా నీళ్ళలోకి దూకేస్తారు.
బిడ్డల తల్లులు కూడా పిల్లలైపోతారు. నీళ్ళలో కూడా ఎక్కడ లేని కబుర్లు.
'హెూం వర్క్ చేయాలి లే నాయనా' అంటే పిల్లలు లేవరు. పక్కపైనే నిర్ర నీలుగుతారు. 'స్కూలుకు టైమైందిరా కన్నా' అన్నా లేవరు. ట్రెక్కింగ్ అంటే చాలు తెల్లవారు జామునే టకీమని లేచి కూర్చుంటారు.
వారానికి ఒక్క రోజు ట్రెక్కింగ్‌కు తీసుకెళితే చాలు, చెప్పిన మాట వింటారు. చెప్పిన హెూం వర్క్ చేసేస్తారు. సీతాకోక చిలుకల్లా ఎగిరిపోతుంటారు. లేడిపిల్లల్లా పరుగులు తీస్తారు. పిట్టల్లా రెక్కలు తెరుచుకుని స్వేచ్ఛగా అడవిలో సాగిపోతుంటారు. కొన్ని వారాల పాటు ఆ అనుభూతి వారి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే చాలు మొండికేయరు, మారాం చేయరు. మిగతా పిల్లల మధ్య హీరోలైపోతారు. ఆ అనుభూతులు జీవిత కాలం వారిని వెంటాడుతూనే ఉంటాయి. 'నా చిన్నప్పుడు..' అంటూ పెద్దయ్యాక చెప్పుకోవడానికి ఎన్ని కబుర్లుంటాయో!
సాహస వనిత వనతి
ట్రెక్కింగ్‌కు మహిళలు రావడం లేదు. వాళ్ళనసలు తీసుకురావడం లేదు. చెన్నైకి చెందిన వనతి దీనికి పూర్తి భిన్నం. వనతికి సాధారణ ట్రెక్కింగ్ అంటే చాలా చప్పటి కూడులా ఉంటుంది. సాహసోపేతమైన ట్రెక్కింగ్ ఉండాలి. అంటే అడవిలోని కాలి బాటలో నడుచుకుంటూ వెళ్ళడం కాదు. ఏటవాలుగా ఉన్న లోయలోకి, చెట్ల కొమ్మలు పట్టుకునో, తాడు పట్టుకునో దిగేయడం. నిట్ట నిలువుగా ఉన్న కొండను అలవోకగా ఎక్కేయడం. దారి తెన్నూ లేకపోయినా చెట్లలో, పుట్టల్లో పడి దారి చేసుకుని వెళ్ళిపోవడం. లోతైన నీటి గుండాలలో ధబీలున దూకడం. ప్రవాహంలో ఈదడం.
సాహసోపేతమైన ట్రెక్కింగ్ అంటే చాలు వనతికి ఎక్కడలేని ఆనందం. 'బుల్లెట్ బండెక్కి వచ్చేత పా.. వచ్చేత పా..' అంటుంది. చెన్నై నుంచి భర్త శంకర్‌తో పాటు బుల్లెట్ ఎక్కి వచ్చేస్తుంది. మూడు గంటలపాటు చెన్నై నుంచే అలా వచ్చినా అలుపు సొలుపు ఉండదు. ట్రెక్కింగ్‌లో మగవాళ్ళకు ఏమాత్రం తీసిపోదు. శంకర్, వనతి దంపతులు మా కంటే ఒకడుగు ముందే ఉంటారు. శేష తీర్థం నుంచి రెండు కొండల మధ్య పారే ఏరులో మా నడక. ఇరవై అడుగుల ఎత్తునుంచి ఏరులోకి దూకి సాగాలి. సామాన్లు తడిసిపోతాయి. ఆపసోపాలు పడుతున్నాం. ఇరువైపులా కొండ అంచు నిటారుగా ఉంది.
దేశాన్నే కాదు. భర్తనూ ఎత్తేస్తాం!
నిటారుగా ఉన్న కొండ అంచు నుంచి వనతి స్పైడర్ మాన్‍లా ఎక్కేసింది. భర్త శంకర్ కూడా ఆమెను అనుసరించాడు. ఇంతవరకు ఆ దారిలో వెళ్ళినవారు లేరు. మాకందరికీ ఆశ్చర్యం. కానీ, అదే దారి అయ్యింది.
ఏమి సాహసం! ఎవరీ వనతి! మూడు పదుల వయసు లేని వనతి చెన్నైలో యోగా, ఫిట్నెస్ శిక్షకురాలు. మహిళా ట్రెక్కర్లకు మార్గదర్శకురాలు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశాన్నే ఎత్తినంత పనిచేస్తే దేశం దేశమే ఉర్రూతలూగిపోయింది అప్పట్లో. అలాగే మన వనతి తన భర్తనే ఒక సందర్భంగా అవలీలగా ఎత్తి అబలను కాదు సబలను అని నిరూపించుకుంది. సాహసానికి, చొరవకు మారుపేరుగా నిలబడిన మహిళా ట్రెక్కర్ వనతికి మహిళా దినోత్సవం సందర్భంగా నిండు నమస్కారాలూ, అభినందనలూనూ...
(మహిళల సాహసానికి మార్చి 8 ప్రేరణ)
- రాఘవ శర్మ
సీనియర్ జర్నలిస్టు
94932 26180