టాలీవుడ్... టూ... ఇండియన్ సినిమా

టాలీవుడ్... టూ... ఇండియన్ సినిమా... Is Tollywood cinema replacing Bollywood as India’s favorite film industry

Update: 2023-04-01 00:30 GMT

1990ల్లో దూరదర్శన్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు టెలికాస్ట్ అయ్యేవి. అయితే అప్పటికీ సాయంత్రం తెలుగు చిత్రాలకోసమే సగటు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కానీ అప్పుడు భాషలకు అతీతంగా ఆ ప్రాంతీయ భాషా చిత్రాల్నీ చూసేవారి సంఖ్య 1 కంటే తక్కువ శాతమనే చెప్పొచ్చు. ఆ చిత్రాలకు సబ్ టైటిల్స్ కూడా ఉన్నట్లు గుర్తులేదు.

క్రమంగా ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో విడుదల చేయడం. అలాగే బాలీవుడ్ చిత్రాలు వాటి గ్రాండియర్ పట్ల దక్షిణాది ప్రజలకు అభిరుచి పెరుగుతూ వచ్చింది. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని హిందీ చిత్ర పరిశ్రమతో పాటు దేశంలోని మిగతా ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలను నమ్మించగలిగింది. భారత్ బయటి ప్రపంచం కూడా అదే నమ్మింది, అక్కడి భారతీయులతో సహా. బాలీవుడ్‌లో బడా హీరోలకి సరైన హిట్లు లేనప్పుడు సౌత్ రీమేకులే వాళ్లకు మళ్లీ హిట్లిచ్చి వారి స్టార్ డమ్‌ని నిలబెట్టాయి. ఇక అప్పటి నుంచి సౌత్ సినిమాలను అవహేళన చేయడం కొంచెం తగ్గింది. కానీ అప్పటికీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే భ్రమ మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.

కానీ దశాబ్దం క్రితం నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. సౌత్ యాక్షన్ సీన్స్‌ను అవహేళన చేసే హిందీ చిత్ర వర్గాలు హిందీ సహా ఇతర ఉత్తర భారతీయ ప్రేక్షకుల్లో తమకు తెలియకుండానే ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. సెట్ మ్యాక్స్, జీ వంటి చానెళ్లలో సౌత్ లో హిట్ అయిన చిత్రాలన్నింటినీ డబ్ చేసి టెలికాస్ట్ చేసేవారు. అలాగే యూట్యూబ్‌లో సినిమాలు లభిస్తున్నాయి. మొదట్లో కామెడీగా అనిపించినా రొటీన్ లవ్, యాక్షన్ హిందీ చిత్రాలతో విసిగిపోయిన హిందీ ప్రేక్షకులు ఈ సౌత్ కంటెంట్‌ని ఇష్టపడటం ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సెలూన్లు, దుకాణాలు, ఇళ్లలో ఈ సినిమాలు చూడటం కామన్ అయిపోయింది. హీరోల పేర్లను గుర్తుపెట్టుకోవడం దగ్గర్నుంచి సౌత్‌లో నాకా హీరో ఇష్టం అనే స్థితి వచ్చింది.

భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆస్వాదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ వృద్ధి ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కరోనాతో ఒక్కసారిగా కంటెంట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో కొత్త సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఒక్కసారిగా ఓటీటీల్లో కంటెంట్ చూడడం విపరీతంగా పెరిగిపోయింది. పరభాషా చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉంటే చాలు చూసేస్తున్నారు. ఫ్రెష్, ఇన్నోవేటివ్, క్రియేటివ్ కంటెంట్‌ని ఆస్వాదించడం మొదలైంది. లాక్ డౌన్ తర్వాత సినిమాకి భాష అనే సరిహద్దు పూర్తిగా చెరిగిపోయింది. ఓ సినిమా, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ, స్టాండప్ కామెడీ ఏదైనా సరే కొత్తగా ఉంది, క్రియేటివ్‌గా ఉందీ అంటే చాలు... తమ మాతృభాష తో సంబంధం లేకుండా చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

క్రియేటివ్ లిబర్టీ పేరుతో వేరే భాషల్లోంచి కాపీ కొట్టి తీస్తే చూడడానికి ఇష్టపడటం లేదు. కొంచెం కష్టమైనా సబ్ టైటిల్స్ సాయంతో నేరుగా ఒరిజినల్ మూవీనే చూసేస్తున్నారు. స్పానిష్‌లో తీసిన మనీ హైస్ట్, కొరియన్ భాషలో ఉండే స్క్విడ్ గేమ్, ఇంగ్లీషులోని గేమ్ ఆఫ్ థ్రోన్స్, హిందీలో తీసిన ఫ్యామిలీ మ్యాన్ ఇలా ప్రపంచంలోని ఏ భాషలో కంటెంట్ ఉన్నా కొత్తగా ఉంటే చాలు.. సగటు సినీ ప్రియుడు దాన్ని ఆదరిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు.

2016లో సైరత్ అనే చిన్న సినిమా దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఇది మరాఠీ అని, ఆ భాష మనకు రాదు అని సగటు ప్రేక్షకుడికి గుర్తే ఉండదంటే అతిశయోక్తి కాదు. అది సినిమాకున్న శక్తి. 2015లో మలయాళంలో వచ్చిన ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి, అప్పటివరకు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అన్న నిర్వచనాన్ని మార్చేసింది. ఆ తర్వాతే ఆమెకు మొత్తం దక్షిణాది భాషల్లో అవకాశాలు, గుర్తింపు, గౌరవం లభించాయి. అనుపమ పరమేశ్వరన్‌కి ఆతర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయి. తమిళంలో ధనుష్ అసురన్‌తో మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీనే ఆకర్షించాడు. దక్షిణాదిలోనే కాస్త గుర్తింపు తక్కువ ఉన్న కన్నడ సినీ రంగానికి గడిచిన ఐదేళ్లలో ఒక్కసారిగా పేరు రావడానికి కారణం అక్కడి దర్శకుల నూతన ఆలోచనలు కథలు, కథనాలే.

వీటన్నింటికీ మించి 2017లో వచ్చిన బాహుబలితో ఒక్కసారిగా ప్రాంతీయ సినిమా కాస్తా దేశ సినిమాగా అవతరించింది. దాని వెనుకాల మార్కెటింగ్ స్ట్రాటజీ, బాలీవుడ్ పెద్దల అండదండలు ఉండటం అనేది మరో చర్చనీయాంశం. అడపాదడపా వచ్చిన ఇటువంటి చిత్రాలను ఇష్టపడే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అదే సమయంలో కరోనా లాక్ డౌన్ రావడంతో ఓటీటీల్లో కంటెంట్ వరదలా వచ్చి పడింది.

ఇక గడిచిన రెండు మూడేళ్లలో కన్నడ కేజీఎఫ్, కాంతారా, తెలుగు ఆర్ఆర్ఆర్, పుష్పతో భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని తేటతెల్లమైంది. ప్రపంచ వేదికపై ప్రాంతీయ భాషా చిత్రాలను భారతీయ చిత్రాలుగా ఆ సదరు బాలీవుడ్ బడాబాబులే చెప్పుకునే స్థితి వచ్చింది. దానివెనుక ఉన్న బిజినెస్, మార్కెటింగ్ కారణాలు వేరే ఉన్నాయి. కానీ ఇన్నేళ్లుగా ప్రాంతీయ భాషా చిత్రాలుగా విడివిడిగా ఉన్న సినిమా ఇప్పుడు ఒకే భాషగా రూపాంతరం చెందింది. ఇప్పుడు సినిమాయే ఓ భాష.

దండు కిరణ్‌కుమార్

8106512340

Tags:    

Similar News