లేఖ:లాభపడేందుకే రాజకీయమా?

లేఖ

Update: 2022-03-18 18:45 GMT

రాజకీయం ఒకప్పుడు నిస్వార్థమైన ప్రజాసేవ. నేడు అది సంపాదన మార్గం గా మారిపోయింది. ఆనాటి తరం నాయకులు తమ జీవితాలను త్యాగం చేసి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడితే, నేటి తరం నాయకులు రాజకీయాలలోకి ప్రవేశించి తరతరాలకు తరగని ఆస్తిపాస్తుల కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా స్వార్థంతో సంపాదనే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. పదవులు పొంది హోదాతో దర్జాగా బతకాలని, తమ వారసులను రాజకీయాలలోకి తీసుకురావాలని కొందరు ఆరాటపడుతుంటే, మరికొంత మంది ఎన్నికలలో గెలిచి అందినకాడికి దోచుకోవాలనే తాపత్రయపడుతున్నారు.

ఇంకొందరిది అయితే అధికారం అండతో అన్ని రకాల పథకాల ద్వారా తామే లబ్ది పొంది వేగంగా బాగుపడాలనుకునే మనస్తత్వం. ఇలా ఎంతసేపు సంపాదన ధ్యాస, స్వార్థపు ఆలోచనలు తప్ప ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేసే నాయకులు నేడు మచ్చుకైనా కనిపించడం లేదనేది యదార్థం. అందుకే జనం కూడా నాయకులను స్వార్థం కలిగిన సంపాదనపరులుగానే చూస్తున్నారు. అందుకే వారి పట్ల ప్రజలు చులకనగా చూడటానికి ఇది ఓ కారణమే.

తప్పెవరిది?

నేడు ఎన్నికలు అంటే ధన ప్రవాహంలా మారిపోయినవి. సొసైటీ డైరెక్టర్, పంచాయతీ వార్డు మెంబర్ వంటి చిన్న చిన్న పదవులకు కూడా లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికలలో ఖర్చు పెట్టేది తిరిగి అంతకు రెట్టింపు రాబట్టుకోడానికే అనే సూత్రం నేడు దర్జాగా అమలవుతోంది. ప్రజాధనం కొల్లగొట్టడంతో గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదు. ఇందులో అందరి పాత్ర ఉందనేది నిజం. ఎన్నికలలో డబ్బు అడగకుండా ఓటు వేసే వారు కొద్దిమంది మాత్రమే. ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారనే వంకతో లీడర్లు, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులు మధ్యలోనే సగం నొక్కేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికలు ఎంతో ఖరీదైనవిగా మారిపోయినవి. సామాన్యులు నేడు ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితులు లేవు. ఒకవేళ పోటీచేసినా గెలిచే చాన్స్‌ లేదు. డబ్బు ఖర్చు పెట్టే స్తోమత కలిగినవారికే సీట్లు దక్కుతున్నాయి. పేద వర్గాలు క్రమేపీ పోటీకి దూరమవుతున్నారు. భారీగా ఖర్చుపెట్టి గెలిచాక ఆ ఖర్చు వడ్డీతో సహా రెట్టింపు చేసి రాబట్టుకునేందుకు అడ్డదారులు. ఇది నేటి ఎన్నికల ముఖచిత్రం. ఇందులో తప్పెవరిది? ఓటు కోసం నోటు అడిగే ఓటర్లదా లేక తిరిగి సంపాదించగలమనే ధీమాతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అభ్యర్థులదా? లేక అధికారం కోసం అడ్డదారిలో పయనిస్తున్న రాజకీయ పార్టీల నాయకులదా?

కొంగూరు రమణారావు

96184 01968

Tags:    

Similar News