ఇదేనా దోపిడీ పీడన లేని తెలంగాణ!

Is this the progress of 9 years of Telangana, why these Telangana decade celebrations for?

Update: 2023-06-14 00:30 GMT

నేక త్యాగాల, పోరాటాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే తొమ్మిదేండ్లు అయింది. ఆవిర్భవించిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా విధానాలు ఉంటాయని తెలంగాణ సమాజం కళలు కనింది. అదే పోరాట స్ఫూర్తి కొనసాగుతుందని ఆశించింది. పాలనలోను, పైసలోను ప్రతి పౌరునికి వాటా దక్కుతుందని ఆకాంక్షించింది. దోపిడీ, పీడన, వివక్షతలు లేని తెలంగాణ నవ నిర్మాణం జరుగుతుందని భావించింది. అంతిమంగా ప్రజాస్వామిక ఆకాంక్షల వెలుగులో రాజ్యాంగబద్ద పాలనకు విశాలమైన స్థానం దొరుకుతుందని అవధులు లేని సంతోషాన్ని తెలంగాణ సమాజం వ్యక్తపరిచింది. కానీ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు దశల వారిగా, ప్రణాళికాబద్దంగా బిన్న రూపాలలో ప్రజాస్వామిక విలువలని కాల రాశారు. వ్యక్తి కేంద్రీకృత అనాలోచిత నిర్ణయాలతో 'అణచివేతను' ఆయుధంగా చేసుకొని తమ పీఠాన్ని పదిలపర్చుకోవడానికి నిర్బంధ విధానాలను అమలు చేస్తూ వస్తున్నారు. సంక్షేమ విధానాల అమలులో కొంత మేలు జరిగినా, సంక్షేమం ఏనాటికి రాష్ట్ర అభివృద్ధి కాదు. ఈ అరాకొరా పథకాలనే అభివృద్ధి అని చెప్పుకోవడానికి, దశాబ్దకాలం పూర్తికాకుండానే దశాబ్ధి ఉత్సవాలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంలో తొమ్మిదేండ్ల అపరిపక్వత పాలనను, ప్రజాస్వామిక బావాలను, అణచివేస్తున్న తీరును రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

బేడీలు వేస్తూ.. రైతు రాజ్యమా!?

రైతే ఈ దేశానికి వెన్నెముకని అనేక ప్రగల్భాలు పలికిన వారికి 'రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే గిట్టదా.! వరి వేయోద్దొన్నారు, పత్తి వేయోద్దొన్నారు, మిర్చి వేయమన్నారు. కష్టపడి మీరు వేయమన్న పంట పండించినప్పుడు సరైన ధర పెట్టకపోతే రైతు కడుపు మండదా.! కానీ గిట్టుబాటు ధర కోసం రోడ్డు ఎక్కితే వారితో చర్చించాల్సింది పోయి..పరిష్కారం చూపించాల్సింది పోయి..రైతులకు బేడీలు వేస్తారా..! అని పౌర సమాజం, ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తే ముఖ్యమంత్రి పోలీసులు తొందరపడ్డారని దానిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. మీకు వారిపై అంత చిత్తశుద్ధి ఉంటే, రైతు తెచ్చిన ధాన్యం నెలల తరబడి ఐకేపీ సెంటర్లలో ఎందుకు ఉంటుంది.? రైతుకు లాభసాటి ధర ఎందుకు దక్కడం లేదు.? అకాల వర్షాలతో ఆగమైతున్న రైతును ఆదుకుంది ఎక్కడ.? ఏ ప్రజా ప్రతినిధి ఐనా వారికి భరోసా ఇచ్చిరా.! ఒకవైపు పండించిన పంటను అమ్ముడుపోక..మరొకవైపు ‘ధరణి’ తో నిరంతరం జీవన్మరణ సమస్యలతో రైతు అట్టుడికిపోతున్నాడు. రైతు సంక్షేమం అంటే ఇలానే ఉంటదా.!'అప్కీ బార్ కిసాన్ సర్కార్' అంటే ఇదేనా.! ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర వెలకట్టలేనిది. ఇక్కడి ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడల్లా ఉద్యమానికి ప్రాణం పోసింది పౌర సమాజమే. అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికెల్లినా అరెస్ట్‌లు చేసి నిర్భంధించడం భావ్యమా? ఇలానే పౌర హక్కులను కాలరాస్తూ ఉత్సవాలు చేసుకుంటారా.! తెలంగాణ సమాజం కోరుకున్నది ఇదేనా.!

నాడు వారి తలవంచి, నేడు తలదించి..

తెలంగాణ వస్తే ఆదివాసీ గిరిజనులను గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి, ఆదివాసీ గిరిజన తండాలను పంచాయితీలు చేసి, నేడు నిధుల లేమితో వెలవెలబోతున్న తండాల సంగతేంటి? 1/70 చట్టాన్ని అమలు చేసి గిరిజనేతరుల చేతుల్లో ఉన్న భూములను గిరిజనులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పోడు కొట్టుకుంటున్న ఆదివాసీలకు పట్టాలిస్తామన్నారు. కానీ ఆ చర్యలు తీసుకున్నారా? ఆదివాసీ ప్రాంతాలు అలజడులతో అశాంతితో హోరెత్తుతున్నాయి. అనాదిగా పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు రక్షణ కల్పించకుండా వారి భూములకు పట్టాలు ఇవ్వకుండా వారిపై దాడులు చేయడం ఆదివాసీ సంక్షేమానికి నిదర్శనమా.! తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా.! అలాగే ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. స్వరాష్ట్రం సిద్ధించాక, మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయమని అడిగిన పాపానికి పంతానికి పోయి అనేకమంది కార్మికుల చావులకు కారణమైంది. అలాగే తన పంతం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నిర్వీర్యం చేసింది. ఏనాడైనా తెలంగాణ సమాజంలో సంఘాలు నిర్వీర్యం చేయబడతాయని ఊహించామా.! అలాగే స్వరాష్ట్రం వస్తే దళిత, బహుజన వర్గాలకు ఆ వ్యవస్థలలో భాగం దొరుకుతుందని భావిస్తే, వారికి పాలనలో సరైన భాగస్వామ్యం దక్కకపోగా పై నుంచి కింది వరకు అడుగడుగునా అవమానాలకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 77 పరువు హత్యలు జరిగాయి వీటి సంగతేంటి? పైగా దళిత ప్రజా ప్రతినిధులను స్వయంగా ముఖ్యమంత్రే హేళన చేస్తున్నారు. వారి భూములను అధికార బలంతో ఆధిపత్య వర్గాలు లాక్కుంటుంది నిజం కాదా? దళిత బంధులో కమీషన్‌లు తీసుకుంటుంది నిజం కాదా? అలాగే ఉద్యమ సమయంలో తమ ప్రభుత్వ ఉద్యోగాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వ ఉద్యోగస్తులు తమకు రావాల్సిన న్యాయబద్ధమైన డిమాండ్ల గురించి అడిగితే కేసీఆర్ కనికరించడం లేదు. తమకు ఒకటో తారీఖున జీతం వేయండని విజ్ఞప్తి చేసే కాడికి ఉద్యోగస్తులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. సమైక్య పాలకులను తల వంచిన ఉద్యోగస్థులు, స్వయం పాలనలో తలదించుకునే పరిస్థితి నెలకొన్నది.

డెమోక్రసీ పేరుతో మోనోపలి..

ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ స్వరాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపకపోగా, వారిపై విరుచుకుపడుతున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు హేళన తో కూడిన సమాధానాలు చెబుతూ సభ్యసమాజం తలదించుకునేలా భాషా పదజాలాన్ని అధికారపక్షం వారు వాడుతున్నారు. స్వరాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అసలు తెలంగాణ కావాలని మెజారీటి శాతం కొట్లాడిందే ఉద్యోగాల కోసం కదా! ఆ వైపు ఆలోచించి ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కేవలం అరాకొరా పోలీసు ఉద్యోగాలు వేసి చేతులు దులుపుకుంది. ఎన్నో ఉద్యమాలు చేస్తే అరాకొరా నోటిఫికేషన్లు వేసి పరీక్షలు నిర్వహించి వాటిని ప్రశ్న పత్రాల లీకేజీ పేరుతో ఆగం పట్టించారు. దీనిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. కేవలం కొద్దిమంది ఉద్యోగస్తులను బలిపశువులను చేసి తిమింగలాన్ని వదిపెట్టారని అపవాదు ఉంది. ఇందుకోసమేనా.!ఉత్సవాలు చేసుకుంటున్నదని తెలంగాణ బుద్దిజీవులు నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నిర్బంధాలకు తావుండదని నమ్మితే అందుకు విరుద్ధంగా ధర్నాచౌక్ ఎత్తివేయడం మొదలుకొని నిరంతరం తెలంగాణ అక్రమ నిర్బంధాలతో అట్టుడుకిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటించినా, మంత్రులు పర్యటించినా అక్కడి ప్రతిపక్ష నేతలను, ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకొని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. పైగా వ్యక్తుల ప్రైవసీలతో జోక్యం చేసుకొని ప్రజాప్రతినిధుల ఫోన్లను టాప్ చేస్తున్నారనే అపవాదు ఉంది. ఏదైనా సమస్య గురించి ప్రజాప్రతినిధులకు విన్నవించుకుందామంటే అరెస్టులు, కలిసి వినతిపత్రం ఇస్తే దిక్కుమాలిన వినతి పత్రాలు తప్ప మీకు మరో పని ఉండదా అని ఈసడింపులు. మరి ప్రజావాణికి దిక్కేది?

ప్రజాస్వామిక ఆకాంక్షలు వర్ధిల్లుతాయని ఆశించిన తెలంగాణలో రోజురోజుకు నియంతృత్వం బలపడి డెమోక్రసీ పేరు మీద మోనోపలి అమలవుతుంది. వ్యక్తి కేంద్రీకృత విధాన నిర్ణయాలు మాత్రమే జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలలో ప్రజాప్రతినిధుల, ప్రజల భాగస్వామ్యం ఏడా కానరాదు. ఇలాంటి నియంతృత్వాన్ని తెలంగాణ సమాజం ఏనాడు అంగీకరించలేదు. నైజాం నుండి మొదలుకొని సమైక్య పాలకుల వరకు తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఎంతటి పాలకులనైనా మెడలు వంచినారు. ప్రజా ఆకాంక్షను ఉల్లంఘించిన ఏ పాలనైనా సరే కొద్దికాలం మాత్రమే. అంతిమంగా ప్రజాక్షేత్రంలో ప్రజలదే విజయం. ఇన్ని దురాగతాలకు పాల్పడినవారు నేడు ఉత్సవాల వేషధారణకు సిద్ధమైనారు. ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రపంచానికే పోరాట స్ఫూర్తి నేర్పిన తెలంగాణలో ఇలాంటి విధానాలకు తావు లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే వారికి మాత్రమే తెలంగాణ సమాజం ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తుందనేది చారిత్రక సత్యం.

పి. సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

94416 61192

Tags:    

Similar News