ప్రేమంటే ఇదేనా...?!
ప్రేమంటే ఇదేనా...?!.... Is this love meaning of real love
మనసుకు నచ్చిన అమ్మాయి ప్రేమను నిరాకరించిందని గొంతుకోసే ప్రేమికుడు ఒకడు, తనకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదనే పైశాచికంగా ప్రేయసి ముఖంపైన యాసిడ్ చల్లేవాడు మరొకడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో సాన్నిహిత్యంగా ఉంటుందని ఉసురు తీసేవాడు ఒకడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోయి ప్రాణాన్ని తీసుకునేవాడు ఇంకొకడు. ప్రేమంటే ఇదేనా..!
తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన కులం కాని వాడిని, తన స్థాయి కాని వాడిని ప్రేమించిందని, కన్న ప్రేమను లెక్కచేయక కూతురునే కిరాతకంగా చంపుకునే తండ్రులు కొందరు, లేదా తన కూతురిని ప్రేమించాడనే కారణంతో మరొక తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను చంపేవారు మరొక తండ్రులు. ఇది తండ్రి ప్రేమా! ప్రేమంటే ఇదేనా..! తన సోదరి వేరే వ్యక్తిని ప్రేమించిందనో లేక సాన్నిహిత్యంగా మెలుగుతుందనో ఆ యువకుడిని చంపేస్తాడు మరో సోదరుడు. ఇది సోదర ప్రేమా?
భార్య కట్నం తక్కువ తెచ్చిందనో, అందంగా లేదనో, ప్రేమ పంచడంలో విఫలమయ్యిందనో ఏవేవో కారణాలను చెబుతూ పరాయి స్త్రీ ప్రేమను కోరుకునే వారు ఒకరు. పరాయి స్త్రీ పట్ల వ్యామోహానికి గురై తానే సర్వస్వంగా జీవించే భార్యని అడ్డు తొలగించుకోవడానికి రకరకాల వ్యూహాలను అల్లుతూ ప్రేయసితో కలిసి భార్యను కడతేరుస్తాడు భర్త. ఇదీ భర్త ప్రేమ? ప్రేమంటే ఇదేనా!
భర్త సంపాదన తక్కువగా ఉందనీ, చీరలు నగలు కొనిపెట్టలేదని బహుమతుల మోజులో పడి పరాయి మగాడితో అవివాహిత సంబంధం పెట్టుకున్న స్త్రీ, తన సంతోషాలకు, సంబరాలకు భర్త అడ్డుగా భావించి పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి కన్నబిడ్డలను అనాథలుగా చిత్రీకరిస్తున్న స్త్రీలు ఎందరో ఇదీ భార్య ప్రేమా? ప్రేమంటే ఇదేనా!..
తన బర్త్‌డేకి బుల్లెటు బైకు బహుమతిగా ఇవ్వలేదని, అడగగానే ఐ-ఫోన్ కొనిపెట్టలేదని, స్థోమత లేని తల్లిదండ్రులను తమ జల్సాల కోసం పీడిస్తూ, రక్తాన్ని జలగలుగా తాగేస్తూ వారి వ్యసనాల కొరకు తల్లిదండ్రులను బలిచేస్తూ హత్య చేసి పుత్రులు ఎందరో ఇదీ పుత్ర ప్రేమా? ప్రేమంటే ఇదేనా!...
కన్నబిడ్డలు తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనీ తమ సుఖం కోసం ముక్కు పచ్చలు ఆరని పసిబిడ్డలకు అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపుతున్న తల్లులెందరో! కన్న బిడ్డలను గాలికి వదిలేసి కుటుంబ గౌరవ మర్యాదాలను లెక్క చేయకుండా సమాజ విలువలను వదిలేసి పసిబిడ్డలను అనాధలుగా చేసి ప్రియుడితో వెళ్లిపోయిన స్త్రీ మాతృమూర్తులెందరో ఇదీ తల్లి ప్రేమా? తండ్రి చనిపోయి ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధ తల్లికి మరో తల్లి అయి చంటిబిడ్డలా, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతుర్లు. తల్లి చనిపోతే వచ్చే ఆస్థి కొరకు బ్రతికి ఉండగానే తల్లుల్ని కడతేరుస్తున్న కన్నబిడ్డలు కూతుర్లు ఎందరో ఇదీ కూతురి ప్రేమా? ప్రేమంటే ఇదేనా!
అందం కాదు గొప్ప, ఆస్తి కాదు ముఖ్యం అంటూ వేదాంతాలను వల్లిస్తున్న నేటి యువతరం ప్రేమించిన అబ్బాయి తన పుట్టిన రోజు మర్చిపోయాడనో, బహుమతి ఇవ్వలేదనో, ఏవేవో కారణాలతో బ్రేకప్ చెప్పేసి ఆర్థికంగా బాగున్న అబ్బాయి బహుమతులు ఇస్తాడని షాపింగ్‌లు చేయిస్తాడని వ్యామోహంలో పడి యువకుల మనసులను విరిచేసి హత్యలకు కారణం అవుతున్న అమ్మాయిలు ఎందరో. ఇది ప్రేయసి ప్రేమా? ప్రేమంటే ఇదేనా!
ఏది ప్రేమా? ప్రేమంటే సంతోషాన్ని శాంతిని పంచాలి. ఎదుటివారిని సంతోషాన్ని కోరుకోవాలి. ప్రేమించిన వారి బాగోగుల్లో సంతోషాన్ని వెతుక్కోవాలి. బాధ్యతలు తెలియజేయాలి. ఇది కదా ప్రేమంటే! మరి నేటి యువతరం ప్రేమ, ప్రేమ అంటూ పద్దెనిమిది ఏళ్ళ వయస్సు దాటక ముందే వ్యామోహాల మోజులో పడి తమని కన్న తల్లిదండ్రుల కలల్ని మొగ్గలోనే త్రుంచి వేస్తున్నారు. ప్రేమ మైకంలో పడి, అదీ ప్రేమ అవునా, కాదా తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకుని ప్రాణాల్ని పోగోట్టుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు.
చరిత్రలో ఎందరో ప్రేమికులు వారికంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రేమలో నిజాయితీ, ప్రేమించిన వారి పట్ల గౌరవం, బాధ్యత ఉన్నప్పుడే అది ప్రేమ అనిపించుకుంటుంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి నేటి యువతరం ప్రేమ ప్రేమ అంటూ నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ విద్యని ప్రేమించండి. మీ కలలను ప్రేమించండి. జీవితాన్ని ప్రేమించండి. ఇలా ప్రేమ దక్కని రోజున మీకు కావాల్సిన ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి ప్రేమ బ్రతుకుని ఇస్తుంది. బ్రతుకుకి ఒక అర్ధాన్ని ఇస్తుంది. యువతరమా మేలుకో! నీ జీవితాన్ని కాపాడుకో!
- నూనె శివాని
ఇంగ్లీష్ లెక్చరర్
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672