సినిమా ఇండస్ట్రీలో ఇంకా వివక్షేనా?

సినిమా ఇండస్ట్రీలో కులం ఉన్నదా.? తెలంగాణపై ఇంకా వివక్ష ఉన్నదా? అంటే ఖచ్చితంగా ఉన్నదనే తెలుస్తోంది. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నామని..

Update: 2024-08-04 01:15 GMT

సినిమా ఇండస్ట్రీలో కులం ఉన్నదా.? తెలంగాణపై ఇంకా వివక్ష ఉన్నదా? అంటే ఖచ్చితంగా ఉన్నదనే తెలుస్తోంది. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నామని.. దీనిపై సలహాలు, సూచనలు చేయాలని సీఎం రేవంత్ ఎప్పుడో విజ్ఞప్తి చేసినా.. ఇండస్ట్రీ పెద్దల నుంచి మొదలు కిందిస్థాయి వరకు ఎవరూ స్పందించలేదు. దీనికి కారణం కులం..ప్రాంతీయ అస్తిత్వవాదమే.

తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో ఇక నుంచి గద్దర్ అవార్డులను ఇస్తుందని ప్రకటించడంతో కొన్ని పెదవి విరుపులు మొదలయ్యాయి.. గద్దర్‌కు సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం..? ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం ఏంటని కొందరు సినీ పరిశ్రమ నుంచి భిన్నాభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు..

గద్దర్ చిన్న.. నంది గొప్పనా?

ఇక్కడే గద్దర్‌పై, తెలంగాణపై వలసాంధ్ర కమ్మ, కాపు కులాల ఆధిపత్య వైఖరి ప్రస్పుటం అవుతుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు తీసుకున్నరు. .మరి, నందికి సినిమాకు ఏం సంబంధం.. ? ఈ మౌలిక ప్రశ్నకు గద్దర్ అవార్డుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న సినీ ఇండస్ట్రీ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.

అవార్డుపై వ్యతిరేకత వెనక..

సామాజిక అంశాలతో నాలుగైదు సినిమాలు తీసి.. సమాజాన్ని ఉద్దరించామని సినీ పరిశ్రమ అనుకుంటున్నది. అసలు ప్రజల కోసమే జీవితం ధారపోసిన గద్దర్, నిత్యచైతన్య స్రవంతిలా వెలిగిపోయిన ఆయనతో పోలిస్తే సినిమాలు ఎక్కడ? సినీ ఇండస్ట్రీ ఆలోచించాలి. గద్దర్ పేరిట అవార్డు వ్యతిరేకత వెనక పెట్టుబడిదారుల కుట్ర కూడా ఉన్నది. ఉలకని పలకని నంది అవార్డు కన్నా, గద్దర్ అవార్డు ఓ ఆలోచనను రేకెత్తించగలదు. సామాజిక కర్తవ్యాన్ని నిర్దేశించగలదు. అదే జరిగితే ఇన్నాళ్లుగా తాము తీసిన తమ సినిమాల కన్నా గద్దర్ పోరాటమే మిన్న అని భవిష్యత్ తరాలు అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు తమ ప్రతిభ గద్దర్ ముందు బోసిపోతుందన్న కుట్రపూరిత ఆలోచన కూడా ఉన్నది. ఇది తమ వ్యాపారంపై ప్రభావం చూపిస్తుంది అని ఇండస్ట్రీ నమ్ముతోంది. అందుకే గద్దర్ అవార్డును అగ్రవర్ణ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది.

అట్టడుగు కులం వాడు కాబట్టే...

అయినా..గద్దర్ పేరిట అవార్డులు తీసుకునేందుకు అగ్రవర్ణ తెలుగు ఇండస్ట్రీకి మనసెలా ఒప్పుతుంది..? ఓ అట్టడుగు కులం నుంచి వచ్చిన వ్యక్తి పేరిట అవార్డులు ఇస్తే అగ్రవర్ణ కమ్మ, కాపు కులాలు అంగీకరిస్తాయా..? కమ్మల దాష్టీకానికి వ్యతిరేకంగా.. కారంచేడులో కలదొక పల్లె, ఆ పల్లె పేరురా మాదిగ పల్లె.. దళిత పులులమ్మా.. అని కారంచేడు ఘటనపై తిరుగుబాటు పాటను పాడిన గద్దర్‌ను కమ్మ అధిపత్య ఇండస్ట్రీ ఎలా అంగీకరిస్తుంది..? అందుకే ఇండస్ట్రీకి పెద్దలుగా చెలామణి అవుతోన్న పెద్దలంతా సీఎం రేవంత్ విజ్ఞప్తిపై మౌనంగానే ఉన్నారు తప్పితే.. గద్దర్ పేరిట అవార్డులను ఎవరూ స్వాగతించలేదు.

గద్దర్ పేరిట అవార్డు పొందటమంటే...!

తన జీవితమంతా తెలంగాణ కోసం పోరాడినవా డు..ఆంధ్ర ఆధిపత్య వైఖరిని ఎత్తిచూపినవాడు గద్దర్. అందుకే ఆయన మీద ఏనాడూ సినీ ఇండస్ట్రీ సానుకూలత వ్యక్తం చేయలేదు. ఆంధ్రా మూలాలు ఉన్న సినీ ఇండస్ట్రీ సహజంగానే.. సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతించలేదు. గద్దర్ పేరిట అవార్డు పొందటమంటే..తెలంగాణ వాదాన్ని ఎత్తిపట్టినట్లే.. అంతేకాదు కులాన్ని త్యజించి కులరహిత సమాజాన్ని కాంక్షించడమే. అందుకే తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేసిన ఈ సినీ ఇండస్ట్రీ గద్దర్‌ పేరిట ఎందుకు అవార్డును ఆహ్వానిస్తుంది..? సీఎం గారు రేవంత్ ఈ చిన్న లాజిక్‌ను ఎలా మరిచిపోయారు..?

కులం + వివక్ష = ఫిలిం ఇండస్ట్రీ

ఓ నిట్టాడు కుటుంబంలో పుట్టి.. పాటను నింగిని తాకేలా చేసిన ఆత్మగౌరవ కేతనాన్ని, ఆంధ్ర ఆధిపత్య కుల ఇండస్ట్రీతో వేళ్లూనుకుపోయిన చిత్ర పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఒకవేళ అంగీకరించి సలహాలు, సూచనలు చేసినా అవి మనస్ఫూర్తిగా చేసిన సూచనలు కావు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనూ, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణ యాసపై దాడి పరంపరను కొనసాగిస్తున్న ఇండస్ట్రీ.. తెలంగాణ పాటను విశ్వవ్యాప్తితం చేసిన గద్దర్‌ను ఎలా అంగీకరిస్తుంది..? ఎవరూ అంగీకరించినా, అంగీకరించకపోయినా సినీ ఇండస్ట్రీకి కులం ఉన్నది. తెలంగాణపై ఇంకా వివక్ష ఉన్నది. అందుకే తనువెల్లా తెలంగాణ గేయమై మాట్లాడిన, పాడిన గద్దర్ అంటే నిలువెల్లా విషమే.

ప్రశాంత్ పగిళ్ల

ఓయూ సమాజ శాస్త్ర విద్యార్థి

95812 62429

Tags:    

Similar News