వీఆర్ఓలకు ఇంకెన్నాళ్లు.. ఈ కన్నీళ్లు?
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముందుగా కుదుపులకు లోనవుతున్నది రెవెన్యూ శాఖలోని గ్రామ స్థాయి రెవెన్యూ పరిపాలన వ్యవస్థ
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముందుగా కుదుపులకు లోనవుతున్నది రెవెన్యూ శాఖలోని గ్రామ స్థాయి రెవెన్యూ పరిపాలన వ్యవస్థ. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎంలు ఎన్టీఆర్ మొదలుకొని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, తాజాగా కేసీఆర్ పాలనలో వేర్వేరు పేర్లతో కొనసాగిన గ్రామ కరణాలు, పటేల్ పట్వారీలు, వీఆర్వో వ్యవస్థలను రద్దు చేయడంతో ప్రజలు, సంబంధిత ఉద్యోగులకు కూడా తీవ్ర అన్యాయం చేశారు. అయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసిన ప్రతీ ప్రభుత్వం కూడా వెంటనే తర్వాతి ఎన్నికల్లో తీవ్ర పరాజయం చవి చూడటం ఒక ఆనవాయితీగా మారింది.
గత కేసీఆర్ ప్రభుత్వం ఏకకాలంలో తహశీల్దార్ కార్యాలయంలోనే “ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడి (మ్యుటేషన్)” సేవల కోసం 2020 అక్టోబర్ 29 నాడు ‘ధరణి’ పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చినా ఆశించిన సత్ఫలితాలు రాలేదు. అధికారాలు మొత్తం హైదరాబాద్ సీసీఎల్ఏ స్థాయిలో కేంద్రీకృతం చేసి గుప్పిట బిగించడం, దానికి తోడు గ్రామ స్థాయిలో రెవెన్యూ పాలనకి వెన్నెముకగా ఉన్న “గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చట్టం, 2020” ద్వారా అందులోని ఉద్యోగులు అందరినీ ఏకపక్షంగా రద్దు చేయడంతో మరిన్ని సమస్యలకు ఆజ్యం పోసినట్లయింది.
56 రకాల విధులు చేసేదెవరు?
ఒకవైపు గ్రామ స్థాయిలో తలెత్తే సమస్యలను తహశీల్దార్ సాయంతో స్థానికంగా పరిష్కరించాల్సి ఉండగా.. ఇప్పుడు ధరణి పోర్టల్ వారి అధికారాలకు మొత్తం కోత వేయడంతో ప్రతి చిన్న సమస్యకి కూడా మీసేవ ద్వారా ప్రతీసారి రూ.1000 + అదనపు ఛార్జీలు చెల్లించి ఆన్లైన్లో అర్జీ చేసుకుంటే హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ విభాగం ప్రతీ అర్జీని ఆమోదిస్తే గానీ సరి చేయలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాల కలెక్టర్లు సైతం సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టలేని దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికలకు ముందే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసి, కొన్ని మాడ్యూళ్ళ అధికారాలు తహశీల్దార్, కలెక్టర్లకే అప్పగించినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి ప్రధాన కారణం సుమారు 56 రకాల విధులు నిర్వర్తించే గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు లేకపోవడమే అనే అభిప్రాయం అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజల్లోనూ వినవస్తున్నది.
స్వార్థపూరిత ప్రయోజనాల కోసం..
రెవెన్యూ శాఖలో 6-24 ఏళ్ల ఉద్యోగ అనుభవం కలిగి, ప్రతీ సందర్భంలో ఎన్నో కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసలకి ఓర్చి, 24 గంటలూ ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా ఉన్న పూర్వ వీఆర్వోలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ఏకపక్షంగా, నియంతృత్వంగా రెవెన్యూ శాఖ నుంచి తప్పించింది. తత్ఫలితంగా సుమారు 7,000 పైచిలుకు పోస్టులు రద్దవడమే కాకుండా.. 5,138 మంది పూర్వ వీఆర్వోల ఉద్యోగ జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగుల హక్కులు కాల రాయబడ్డాయి. పలు సవాళ్ళ మధ్య పనిచేసిన వీఆర్వోలు సమాజంలో అత్యంత అవమానానికి గురయ్యారు. అలాగే ఆ చట్టంలోని సబ్-సెక్షన్ 4(1)కి వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు... ఆర్థిక శాఖ G.O.Ms.No.121, తేదీ 23.07.2022 తీసుకొచ్చి, 2022 ఆగస్టు 01న “రీడెప్లాయిమెంట్” పేరుతో “లాటరీ విధానం”లో ఇతర శాఖల్లోకి బలవంతంగా బదిలీ చేస్తూ... అర్థరాత్రి సమయంలో ఆర్డర్లు చేతిలో పెట్టి, మా ఉద్యోగ జీవితాలకు ఉరి వేసి, కుటుంబాలను భయకంపితులను చేసి కుంగదీశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ శాఖ ఉద్యోగీ ఇంతగా వేదన అనుభవించి ఉండరు. గత BRS ప్రభుత్వం వారి స్వార్థపూరిత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ధరణి, రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి, మా ఉద్యోగ హక్కులు నిరంకుశంగా కాలరాసింది.. దీర్ఘకాలిక సమస్యల కారణంగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులమైన మా పూర్వ వీఆర్వోలం... వ్యవస్థ రద్దు కారణంగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగా ఆర్థికంగా, సర్వీస్ పరంగా తీవ్రంగా నష్టపోయి, మానసికంగా తీవ్ర సంఘర్షణకు లోనవుతూ, ఆరోగ్యం దెబ్బతింటుంది.
భూపరిపాలన పటిష్టంగా లేకుంటే...
మరోవైపు భూపరిపాలన పటిష్టంగా ఉంటేనే, సాధారణ పరిపాలన సవ్యంగా సాగుతుందన్న విషయాన్ని గత 70 ఏళ్లుగా పాలకులు విస్మరించడం, BRS ప్రభుత్వం కూడా గత పదేళ్ళలో సమగ్ర భూ సర్వే నిర్వహించకపోవడం, 2018 తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్దేశాలతో కనీస పరిశీలన చేయనీయకుండా హడావుడిగా 100 రోజుల్లోనే రికార్డులను మాత్రమే కంప్యూటరీకరించడంతో భూ సమస్యలు ఇంకా జఠిలమైన, ఆ నెపాన్ని కుట్రపూరితంగా మా పూర్వ వీఆర్వోలపై మోపి, అవినీతిపరులుగా ముద్రవేసి బలిపశువులని చేసింది. తదనంతరం ధరణి పోర్టలు పేరుతో రెవెన్యూ రికార్డుని అస్తవ్యస్తం చేసింది ఇప్పుడు ఆ తప్పులను సరి చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ లాగే సమగ్ర భూ సర్వే నిర్వహించి ప్రజలకు సమగ్ర భూపరిపాలన అందించాలంటే మళ్ళా సుమారు 25,000 మంది నిపుణులైన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది అవసరం ఉన్నదని తెలుస్తున్నది.
సత్వర పరిష్కారం కావాలె!
కావున ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేబినెట్ సబ్-కమిటీ సభ్యులు, ధరణి కమిటీలోని ప్రముఖ న్యాయ నిపుణులు భూమి సునీల్, తదితర అధికారులు ఒకసారి దృష్టి సారించి మా సమస్యల పట్ల సానుకూIs the new government doing VRVs who have been waiting for justice for many years?ల సత్వర పరిష్కారం చూపగలరని ఆర్థిస్తున్నాం. రెవెన్యూ శాఖలోని మా గత 6-24 ఏళ్ల ఉద్యోగ అనుభవాన్ని పరిగణించి మా మాతృ శాఖ రెవెన్యూ లోకి “ఆప్షన్లు కౌన్సిలింగ్” ద్వారా వెనక్కి రప్పించి, సర్వీస్-పే ప్రొటెక్షన్ కల్పించి, కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడంతో పాటు... మా సర్వీస్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగా దీర్ఘకాలికంగా నష్టపోయిన మా ఉద్యోగ జీవితాలకు ప్రస్తుత కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ద్వారా తగు సత్వర న్యాయం చేయించి అండగా నిలవగలరని ధరణి కమిటీ బాధ్యులను సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాము.
గరికె ఉపేంద్ర రావు
(అధ్యక్షులు, తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ
99088 25191