మనసులో మాట:అధికారమే పరమావధా?
తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోవడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక పోతోందా?
ఎక్స్‌పోర్ట్ పెరగాలంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలు పోను మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం, మిల్లర్లు, ఎగుమతిదారులు భరించేలా ఓ అంగీకారానికి రావాలి. 'మీ రాష్ట్రం, మీ ధాన్యం, ఏమి చేసుకుంటారో మీ ఇష్టమని' కేంద్రం చేతులెలా దులుపుకోగలదు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏడేండ్లుగా ధాన్యం సేకరణకు, రేషన్ బియ్యానికి సబ్సిడీ కోసం రూ. మూడు వేల కోట్లు భరిస్తూ వస్తున్నది. మరి కేంద్రం ఏం చేస్తున్నది? అధికారమే పరమావధిగా తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోవడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక పోతోందా? రైతును రాజును చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై కక్షగట్టి, బాధ్యత మరచి బీజేపీ రైతు జీవితంతో రాజకీయం చేస్తున్నది. ధాన్యం కొనుగోలు మీద రభస చేస్తున్నది. రాజకీయ లబ్ధి కోసం అన్నదాతలను తప్పుదారి పట్టించేలా ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడడంతో రైతాంగం అయోమయానికి గురవుతున్నది. యాసంగి వడ్ల కొనుగోలుతోపాటు ఎంఎస్‌పీ చట్టబద్ధతను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీస్తుంటే 'నిమ్మకు నీరెత్తినట్టు' వ్యవహరించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలడం విడ్డూరంగా ఉంది.
కేంద్రం తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం సాక్షిగా ఎంపీలు బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. పెడచెవిన పెట్టిన బీజేపీ పొంతనలేని ప్రకటనలతో తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన ఉద్యమం చేయాల్సిన దుస్థితి కల్పించింది. యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని ఎవరూ తినరు గనుక కొనబోమని కేంద్రం వితండ వాదన చేస్తున్నది. ఉప్పుడు బియ్యానికి తమిళనాడు, కేరళ, బంగ్లాదేశ్, మలేసియాల నుంచి 30 లక్షల టన్నుల డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. వారు తినేదే ఉప్పుడు బియ్యం. ఇప్పటికే తమ వద్ద తగినంత స్టాక్ ఉందని కేంద్రం అంటున్నది. అలాంటప్పుడు బఫర్ స్టాక్‌గానైనా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌పై తిరుగుబాటకు కూడా ఇదే కారణమైందన్న అభిప్రాయం నెలకొంది.
అమీతుమీ తేల్చుకునేందుకు
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది, సరికొత్త ఆలోచనలను రంగరించి దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు శరాఘాతంగా మారుతున్నాయి. నాడు సాగు చేద్దామంటే నీరు లేక, కరెంట్ రాక వ్యవసాయం దండగ అన్న భావం ఉండేది. స్వరాష్ట్రంలో 24గంటల కరెంట్, కాళేశ్వరం జలధార రాకతో ఒక్కసారిగా వరి దిగుబడులు పెరిగాయి. రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పండుగలా చేస్తున్నారు.
ఏండ్ల తరబడి కాలం కోసం ఎదురుచూసిన రైతుల కండ్లలో ఆనందం పట్టుమని మూడేండ్లైనా గడవక ముందే వరి సాగు వద్దంటే ఎలా? అని రగిలిపోతున్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు ద్వారా ఏరులై పుష్కలంగా పారుతున్న మెట్ట భూములన్నీ వరి సాగుకు అనుకూలంగా మల్చుకున్నామని, ఇప్పుడు వద్దంటే ఏమై పోవాలని ప్రశ్నిస్తున్నారు. రైతులకు జరుగుచున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ ఏకంగా మహాధర్నాకు దిగే పరిస్థితి బీజేపీ తెచ్చింది, అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సిద్దమైంది. బీజేపీ అసలు రంగు బట్టబయలు చేసేందుకు దీక్షలతో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మోడీ దిగివచ్చేలా ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో దీక్ష చేసేందుకు కంకణం కట్టుకుంది.
రెండు సీజన్లలో వరి పంట
రాష్ట్రంలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తున్నది. కేసీఆర్ అనేకసార్లు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఖరాకండిగా చెప్పినప్పటికీ, బీజేపీ అధ్యక్షుడు వరి వేయాలని పదే పదే చెప్పారు. తామే కొంటామని నమ్మబలికిన బండి సంజయ్ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతుంటే ముఖం చాటేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ సర్కారు 6,735 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోళ్లకు రూ. 20 వేల కోట్ల పెట్టుబడిని సమకూర్చింది.
రైతుల నుంచి ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తుంది. తెలంగాణ నుంచే కాదు, ఏ రాష్ట్రం నుంచి కూడా తాము యాసంగి వరి ధాన్యాన్ని కొనబోమన్నది కేంద్రం వాదన. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో యాసంగిలో వరి వేయరు. వాన కాలంలో వరి పండించి, యాసంగిలో గోధుమలు పండిస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణలో అలా కాదు, వానకాలంలో, యాసంగిలో పండించేది వరి ధాన్యాన్నే. పంజాబ్, హర్యానాతో తెలంగాణ రాష్ట్రానికి లంకె పెట్ట లేరనేది నిజం.
కేంద్రం ఎంత చేయవచ్చు
ధాన్యం కొనుగోలు రాజకీయ వివాదంగా మారితే ప్రయోజనం ఉండదు. ఏపీలో ధాన్యం కొనుగోలు విషయంలో సమస్య లేకపోవడానికి కారణం వానాకాలం పంట తక్కువ టెంపరేచర్‌లో వస్తుంది. గట్టితనం ఉండడం మూలాన నూకరాదు. మిల్లర్లకు కూడా సమస్య ఉండదు. తెలంగాణ యాసంగి వడ్లలో నూకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మిల్లర్లు నష్టపోకుండా ప్రభుత్వాలు ఆ నష్టాన్ని భరించాలి. ఎగుమతులు పెంచేందుకు అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మన బియ్యం ఎగుమతులు జరగాలంటే క్వింటాల్ కు రూ.1600 మించి కొనుగోలు చేయలేం. వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల మార్కెట్లతో పోటీ పడడంతో మన దగ్గర కనీస మద్దతు ధరగా నిర్ణయించిన రూ.1960 చెల్లించలేము. ఎక్స్‌పోర్ట్ పెరగాలంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలు పోను మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం, మిల్లర్లు, ఎగుమతిదారులు భరించేలా ఓ అంగీకారానికి రావాలి. 'మీ రాష్ట్రం, మీ ధాన్యం, ఏమి చేసుకుంటారో మీ ఇష్టమని' కేంద్రం చేతులెలా దులుపుకోగలదు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏడేండ్లుగా ధాన్యం సేకరణకు, రేషన్ బియ్యానికి సబ్సిడీ కోసం రూ. మూడు వేల కోట్లు భరిస్తూ వస్తున్నది. మరి కేంద్రం ఏం చేస్తున్నది? అధికారమే పరమావధిగా తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.
డా. సంగని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి
కేయూ, వరంగల్
98662 55355