నిమ్స్‌లో ఫార్మసీకి విలువే లేదా?

Is pharmacist not worth in Nims

Update: 2023-10-19 01:00 GMT

నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరున్న వైద్య విశ్వవిద్యాలయం. రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యశాల దీని సొంతం. మొదట ఇది నిజామ్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. నిజామ్ బొక్కల దవాఖాన అనేవారు. దీనిని నిజామ్ చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో 23 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించింది. 1961 జూలై 26న దీని శంకుస్థాపన జరగగా, 1964 డిసెంబర్ 22 నాడు ప్రారంభించింది. ఆర్థోపెడిక్ సర్జన్ ఎం. రంగారెడ్డి అభ్యర్థన మేరకు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన వితరణ ఫలితమే ఈ దవాఖాన. నిజామ్ చారిటబుల్ ట్రస్ట్ దీనిని విస్తృత ప్రజా ప్రయోజనార్థం 1976 ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున నామమాత్రపు అద్దెకు 99 సంవత్సరాల కాలానికి కౌలుకు ఇచ్చింది. దీనిని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ స్పెషాలిటీస్‌గా పేరు మార్చి 1976 మార్చి 31న ప్రారంభం చేసిండ్రు. ప్రభుత్వం 1980 మార్చ్ 11న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐఎంఎస్) అనే స్వతంత్ర సంస్థను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత 1986 మార్చ్ 25న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఐఎంఎస్) అనే పేరు పెట్టిండ్రు. దానిని యూనివర్సిటీగా చట్టం చేశారు. ఇది ప్రస్తుతం నిమ్స్ విద్యార్థులకు ఉన్నత స్థాయి వైద్య, వైద్యానుబంధ కోర్స్‌లు, ప్రజలకు ప్రత్యేక చికిత్సా సేవలు అందిస్తున్నది.

ఫార్మసీ విభాగం ఎక్కడ?

అయితే, నిమ్స్‌లో 34 విభాగాలు పని చేస్తున్నట్టు వెబ్ సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం తెలుస్తున్నది. ఇందులో విచారం కలిగించే అంశం ఏమిటంటే, ఔషధాలు అందించే, ఔషధాల వినియోగం పర్యవేక్షించే హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ లేదా ఫార్మసీ డిపార్ట్మెంట్ పేరు ఎక్కడా కనిపించకపోవడం. ఇతర నిపుణుల వలె ఫార్మసిస్ట్‌లు కూడా కృషి చేస్తున్నప్పటికీ వారికి సముచితమైన గుర్తింపును ఇవ్వకపోవటం, ఫార్మసీకి ఒక విభాగం హోదా కల్పించకపోవడం బాధాకరం. బొక్కల దవాఖానలో అప్పుడు 12 మంది రెగ్యులర్ ఫార్మసిస్ట్‌లు ఉండేది. ఇప్పుడు రెగ్యులర్ ఫార్మసిస్ట్‌ల సంఖ్య 6 మాత్రమే! మరో 21 మంది ఫార్మసిస్ట్‌లను రోజుకు రూ. 946ల దినసరి వేతనంతో పొరుగు సేవల ద్వారా తీసికొన్నరు. కానీ, వారి గుర్తింపు బిళ్ల మీద శానిటేషన్ అండ్ ఇన్సిడెంటల్ ఎంప్లాయి - సెమి స్కిల్డ్ అని ఉంటది. వీరు మెడికల్ స్టోర్స్, సర్జికల్ స్టోర్, లాబొరేటరీ స్టోర్, నర్సింగ్ స్టోర్ అని నాలుగు రకాల స్టోర్‌లు నిర్వహిస్తరు. మెడికల్ స్టోర్స్‌లో మెయిన్ పర్చేజ్ స్టోర్, మెయిన్ సబ్ స్టోర్, స్పెషాలిటీ బ్లాక్ స్టోర్‌కు 3 డ్రగ్ లైసెన్స్ లు ఉన్నయి. మొత్తం స్టోర్‌లు అన్నీ ఇన్ పేషెంట్స్ కోసమే. రోజూ కనీసం 1500 మంచాలు నిండి ఉంటయి. కరోనా సమయంలోనైతే మంచాలు చాలక పోయేది. అయితే, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రమాణాల ప్రకారం 40 బెడ్స్‌కు 1 ఫార్మసిస్ట్ ఉండాలె. కానీ లేరు! ఉన్న కొద్ది మంది ఫార్మసిస్ట్‌లు పని ఒత్తిడితో నలిగి పోతున్నరు. స్టోర్స్ అన్నిటి మీద పర్యవేక్షణకు ఫార్మసిస్టేతరులను నియమించింది నిమ్స్ యాజమాన్యం. వారు ఫార్మసిస్ట్‌లను హీనంగ చూస్తున్నరు. రోజుకు 1500 మంది ఔట్ పేషంట్స్ వచ్చే ఔట్ పేషెంట్ ఫార్మసీ సేవలను బయటి వ్యక్తులకు గుత్తకు ఇచ్చిన్రు. అయితే, వీటి నాణ్యత విషయంలో నిమ్స్ ఎటువంటి బాధ్యత వహించదు.

ఇంత వివక్ష ఎందుకు?

నిమ్స్ వ్యవస్థాపన సమయంలో అమెరికాలో స్థిరపడ్డ ఒక రేడియాలజిస్ట్‌ను ప్రత్యేకంగా రప్పించి డైరెక్టర్ పదవి ఇచ్చిండ్రు. మిగతా డిపార్ట్మెంట్‌లను అమెరికా నమూనాలో ఏర్పాటు చేయించి కీర్తి గడించిన ఆయన గుండెకాయ వంటి ఫార్మసీ డిపార్ట్మెంట్‌ను నెలకొల్పలేదు. ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్‌కు ఇతర డిపార్ట్మెంట్‌ల అధ్యక్షులతో సమాన హోదా ఉంటది. డిప్లొమా నుంచి పిఎచ్ డి అర్హతలున్న ఫార్మసిస్ట్‌లు విధులు నిర్వహిస్తరు. ఈ డిపార్ట్మెంట్ కింద ఫార్మసీ అండ్ తెరప్యూటిక్ కమిటి (పి టి సి) ఉంటది. ఔషధ జనిత అవాంతరాలు నివారించటానికి, ఔషధ చికిత్సతో సత్ఫలితాలు సాధించటానికి పిటిసి ప్రధాన బాధ్యత వహిస్తది. ఇది సహేతుక ఔషధ వినియోగం, యాంటీబయోటిక్ పాలసీ రూపకల్పన చేస్తది. హాస్పిటల్ ఫార్మసీ కక్ష్య ఔషధశాల నిర్వహణకు సంబంధించిన లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, నాణ్యత, చట్టపరమైన, ఆర్థికపరమైన వ్యవహారాలు చూసుకుంటది. క్లినికల్ ఫార్మసీ కక్ష్య వైద్య బృందం వెంట ఉండి ప్రిస్క్రిప్షన్‌ను సరిచూచి రోగులకు ప్రత్యక్ష ఔషధ సేవలు అందిస్తది. డ్రగ్ తెరపీ మానిటరింగ్, పేరెంటరల్ న్యూట్రిషన్, విషాక్తత, ఔషధ ప్రతిచర్యల నిర్వహణ, అత్యవసర చికిత్స, రోగులకు సలహాలు, దీర్ఘ వ్యాధుల నిర్వహణ, స్పెషాలిటీ చికిత్సల పర్యవేక్షణ, సెకండరీ ప్రిస్క్రైబింగ్, ఫార్మకో విజిలెన్స్, క్లినికల్ స్టడీస్ వంటి చాలా విషయాలు క్లినికల్ ఫార్మసీ చూసుకుంటుంది. రాష్ట్రంలో ఎంతోమంది ఎం ఫార్మ్, ఫార్మ్ డి పట్టభద్రులు ఉండగా, ఆవశ్యకమైన ఫార్మసీ డిపార్ట్మెంట్ ఏర్పాటును విస్మరించడం వల్ల నిరుద్యోగులు ఎక్కువయ్యారు, ఇది వారి పట్ల వివక్ష కాకపోతే మరేమిటి?

ఫార్మసీ ఓ స్టోర్ కాదు...

నిమ్స్ పీఎచ్‌డి తాజా ప్రవేశ ప్రకటన చూసినా ఫార్మసిస్టుల పట్ల ఉన్న చులకన వైఖరిని అర్థం చేసుకోవచ్చు. చాలా స్పెషాలిటీలకు ఎం ఎస్ సి అభ్యర్థులను అర్హులుగా పేర్కొన్నారు. కానీ, ఎం ఫార్మ్ అర్హత ఎందులోనూ చేర్చలేదు. నిమ్స్‌లో పలు మెడికల్, నర్సింగ్, అలైడ్ హెల్త్ కోర్స్‌లు నిర్వహిస్తున్నరు. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన ఫార్మసీ సేవలు అందుతాయి. అదే విధంగా నిమ్స్‌లో చదువుకోవాలని ఆశ పడే ఫార్మసిస్ట్‌లకు ఎం ఫార్మ్ - ఫార్మకాలజీ ఫార్మసీ ప్రాక్టీస్ క్లినికల్ ఫార్మసీ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఫార్మసీ ఫార్మసీ మానేజ్మెంట్; ఫెలోషిప్ ఇన్ - న్యూరాలజి, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, ఇంకా పరిశోధన ఆసక్తి ఉన్నవారికి పీహెచ్‌డీ కోర్స్‌లు ప్రారంభించ వచ్చు. ఫార్మసీని ఇతర వైద్య నిపుణులు, ఉన్నతాధికారులు కేవలం ఒక స్టోర్‌గా చూస్తున్నరు. ఫార్మసీ కూడా ఒక మెడికల్ స్పెషాలిటీ. నిమ్స్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి చైర్మన్, ఆరోగ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొంటున్నది. కనుక, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం అదే స్ఫూర్తితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలె.

డా. రాపోలు సత్యనారాయణ

ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ సభ్యుడు

94401 63211

Tags:    

Similar News