మోడీ మాటల్లో నిజమెంత?

మోడీ మాటల్లో నిజమెంత?... is modi words true on economy

Update: 2022-11-24 18:45 GMT

దేశ జీడీపీ గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలోనే భారత్ విశ్వ గురువుగా మారుతుంది' అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ, ఇప్పటికి దేశంలో 69 శాతం జనాభా ఆర్థిక అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. రేపటి రోజు ఎలా ఉంటుందోననే బెంగ సామాన్యులను వెంటాడుతూనే ఉంది. నిశ్చింతగా, నిబ్బరంగా 69 శాతం ప్రజలు బతకలేకపోతున్నారు. పెరిగిన ధరలతో గత ఐదేండ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రజల సేవింగ్స్ కరిగిపోతున్నాయి. అందుకే బ్యాంకులలో వ్యక్తిగత డిపాజిట్లు తగ్గుతున్నాయి. దేశంలో 20 శాతం జనాభా సంపాదన ఖర్చులకే సరిపోక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అపత్కాలంలో ఆదుకోవడానికి చిల్లి గవ్వ ఉండదనే భయం ఆత్మనిర్బర్ భారత్‌లో సర్వసాధారణమైంది.

ఫలితం రావడం లేదు

దేశ పారిశ్రామిక వాటాను 25 శాతానికి పెంచేలా మేక్ ఇన్ ఇండియా(make in india) పథకాన్ని 2014 మోడీ ప్రారంభించారు. దీనికి గాను యేటా 12-14 శాతం వృద్ధి ఈ రంగంలో సాధిస్తామని చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ లక్ష్యాన్ని 2025 కు పెంచారు. ఈ పథకం పెట్టుబడుల కోసం నరేంద్ర మోడీ ఎన్నో విదేశీ పర్యటనలు చేసినా ఫలితం కనిపించడం లేదు. అంతిమంగా ప్రపంచ బ్యాంకు సూచిలో మన స్థానం 2014లో 134 ఉండగా, 2019 నాటికి 63 వ స్థానానికి దిగజారింది. జీడీపీలో పారిశ్రామిక రంగం 25 శాతానికి చేరకపోగా 14.3 శాతానికి దిగజారింది. దీనికి కారణం కరోనా అని బుకాయిస్తున్నారు.

కానీ, కరోనా ముందు ఏమైనా పెరిగిందా? దేశ ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (purchasing power parity) లెక్కల ప్రకారం దేశం 3.36 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆదాయంతో ప్రపంచంలో నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. డాలర్ మార్ ద్రవ్య విలువలను బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో రెండవ స్థానంలో ఉంది. ఐతే భారీ జనాభా వలన తలసరి ఆదాయం మాత్రం 3100 డాలర్లతో కొంచెం తక్కువగా ఉంది.

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది

నిజానికి భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం, హస్తకళలు, పరిశ్రమలు, సేవల వంటి రంగాలతో విభిన్నమై ఉంది. నేటి ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో సేవల రంగం ఎక్కువగా దోహదపడుతుంది. పనిచేసే జనాభాలో మూడింట రెండొంతుల వారు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని ఆంగ్ల భాషా ప్రవీణులైన విద్యావంతుల సంఖ్య వలన భారత్ సాఫ్ట్‌వేర్ సేవలు, వాణిజ్య సేవలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఎగుమతిలో ముందంజలో ఉంది. ఇవేవీ పాలకులు పట్టించుకోవడం లేదు. జీడీపీ పడిపోతుంటే పట్టించుకోకుండా యువతని మూఢులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశం వంద సంవత్సరాలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందని ఆర్థికవేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు.


ఆలేటి రమేశ్

99487 98982

Tags:    

Similar News