'ప్రైవేట్' రిజర్వేషన్లపై పోరు తప్పదా?

సర్వీస్.. సంపద... పన్నుల విషయంలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు, ఫలాలు పదుల సంఖ్యలో కులాలలో కొంతమందికే పరిమితమైతే

Update: 2024-08-13 00:45 GMT

సర్వీస్.. సంపద... పన్నుల విషయంలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు, ఫలాలు పదుల సంఖ్యలో కులాలలో కొంతమందికే పరిమితమైతే... అభివృద్ధి లెక్కలు అన్నీ అబద్దమేగా! ఆ అబద్దాన్ని నిజం చేసిన ధర్మం పోరాటమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం...మూడు దశాబ్దాల యుద్ధం.. ఆ యుద్ధం గెలుపును ముద్దాడింది. మాదిగల ఆత్మగౌరవం పెంచుకుంది.. ఈ తీర్పును స్వాగతించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనీయులు. కమిషన్లు కమిటీలు బాలగోపాల్ లాంటి ఎందరో మేధావులు ఏక కంఠంతో సమర్థించినా మూడు దశాబ్దాలు అంటరానిదిగా ఒంటరి అయినా... ధర్మం గెలిచింది.. పడి లేచి గెలిచిన కెరటంలా నిటారుగా నిలబడింది.

బుద్ధం శరణం గచ్చామీగా ప్రారంభం అయిన వర్గీకరణ పోరాటం దశాబ్దాలుగా కష్టపడి యుద్ధం శరణం గచ్చామీగా తీర్చిదిద్ది దేశాన్ని ఆకర్షించారు కృష్ణ మాదిగ అందుకోసం ఎక్కని మెట్టులేదు తొక్కని గడపలేదు.. అన్ని పాలక పార్టీలకు మద్దతు ఇచ్చారు... చివరకు న్యాయపోరాటంలో గెలిచారు. పదిమంది యువకులతో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం మొన్నటి సుప్రీంకోర్ట్ తీర్పుతో వర్గీకరణ మూడు దశాబ్దాల ఉద్యమానికి ఉద్యమానికి ముగింపు పలికినట్లే...

ప్రైవేట్ రంగంలో కోటా కోసం పోరాటం!

1994 లో జులై 7న ప్రారంభం అయిన వర్గీకరణ ఉద్యమం చదువురాని పంచకట్టు వారితో ప్రారంభం అయ్యి నేడు వాళ్ల పిల్లలు విద్యావంతులై ఉద్యమంలో పాల్గొనే దాకా వచ్చింది.. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు నేటి కంటే ఎక్కువగా ఉండేవి... నేడు అంతంత మాత్రమే ఉన్నాయి. అయినా ఏబీసీడీ వర్గీకరణ ఎంఆర్‌పీఎస్ ఉద్యమానికి సెంటిమెంటుగా మారి ఫలితాన్ని సాధించింది. ఓ జీవిత కాలం వర్గీకరణ కోసం పోరాడిన కృష్ణ మాదిగ వర్గీకరణ తీర్పు తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 95 శాతం ప్రైవేటు సెక్టార్ కార్పొరేట్ రంగం ఊహించనంత వ్యాప్తి చెంది ఉద్యోగ ఉపాధి రంగాలలో కార్పొరేట్ రంగం ప్రధానంగా ఉంది.. ఈ గాలి..ఈ నీళ్లు లోకల్ మానవ వనరులను ఉపయోగించుకొని... మేము పెట్టుబడిదారులం అనే అహంతో మా ఉద్యోగాలు మాయిష్టం అనే చందంగా తయారైంది... ఈ స్థితిని మార్చకపోతే బలహీనవర్గాల మనుగడే తిరోగమానంగా మారే పరిస్థితి ఉంది.. ఇది కూడా కృష్ణ మాదిగతోనే మారుతుందనే గురి ప్రజలకు ఉంది.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఉద్యమానికి కృష్ణ మాదిగ శ్రీకారం చుడతారని ఆశిద్దాం.

(నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ)

సాదం వెంకట్

93953 15326

Tags:    

Similar News