విద్యే జీవితమా?

విద్య అంటే జీవితం నేర్పేది. జీవితసూత్రాలు నేర్పేది. విద్య గాలిలో సాము చేయకుండా, నిత్యజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి.

Update: 2024-07-13 01:00 GMT

విద్య అంటే జీవితం నేర్పేది. జీవితసూత్రాలు నేర్పేది. విద్య గాలిలో సాము చేయకుండా, నిత్యజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్య ఏదైనా అవ్వచ్చు. గణితం కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, వ్యవసాయం, వంటావార్పు కావచ్చు. ఉపయోగకరమైనది ఏదైనా కావచ్చు. అందుకే విద్య అన్నది అందరూ నేర్చుకోవలసినది, పాటించవలసినది. విద్య అందరి ప్రాథమిక హక్కు. జీవితాన్ని నేర్పించేది విద్య అయినప్పుడు, విద్య మీద మన కృషి కేంద్రీకృతం కావడం హేతుబద్ధమే కదా!

జీవితం గడపడానికి అన్ని విద్యలు ఎప్పుడో ఒకప్పుడు అవసరం అవుతాయి. కానీ అన్ని విద్యలు నేర్చుకోవడం అసాధ్యం, అసంభవం! కానీ జీవితం సజావుగా సాగడానికి కొన్ని కనీస విద్యలు కనీస స్థాయి జ్ఞానం అవసరం. కనీస స్థాయి గణితం, భాషాజ్ఞానం, పరిసర జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం అధ్యయనం అవసరం. ఇవి సక్రమంగా నేర్పితే విద్య. అలా కాక, తప్పుల తడకగా, నేర్పితే అదే విషం అవుతుంది.

విద్య ముసుగులో మోసం

అందుకే విద్య ముసుగులో జీవితాల్ని అధఃపాతాళానికి తోసే పనుల్ని మనం వ్యతిరేకించాలి. నివారించే ప్రతి ప్రయత్నం చేయాలి. విద్యకి సంబంధించిన గంభీరత, ఖచ్చితనం ఉండాలి. గణితం కనీస స్థాయి అంటే ఎంత దీనిలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దానికి సంబంధించి ఒక అంగీకారానికి వచ్చినాక, దాని అమలులో అలసత్వం సరికాదు. విద్యలో వెసులుబాటు, నిర్లక్ష్యం, అలసత్వం జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.

జీవితం సులభ సూత్రం - చెప్పింది చెయ్యి. చేసేది చెప్పు. ఇలా కాకుండా, ఎవరికి వారు తమకు తాము తెలివైన వారిగా ఊహించుకుని, ఇతరులను తప్పు దోవ పట్టించి తాము పబ్బం గడుపు కుందామని భావిస్తే, అది తిరిగి వారికే దెబ్బ అవుతుంది. లోకం అందరి మనసులను చదవగలదు. వారి ఉద్దేశాలను, పథకాలను, కుట్రలను పసిగట్టగలదు. అందుకే సూటి ప్రవర్తన సర్వత్రా సర్వదా క్షేమకరం.

విద్యార్థుల్లో నిజాయితీ లేకపోతే...

మన విద్యావ్యవస్థలో మూల సమస్య - ఈ సూటితనం లోపించడమే. చెప్పేదొకటి. చేసేది వేరొకటి. పదో తరగతి పిల్లలు ఐదో తరగతి విషయ పరిజ్ఞానం లేకపోయినా మెండుగా మార్కులు సంపాదించుకుంటారు. వీళ్లు పై తరగతులకు వెళ్ళినప్పుడు ఎలా నేర్చుకుంటారు, ఏమి నేర్చుకుంటారు అన్నది చిక్కు ముడే. ఉత్తీర్ణత శాతం కొరకు, ఉత్తమ స్థానాల కొరకు, పాఠశాలలే అక్రమ పద్దతులను అవలంబిస్తే, ప్రోత్సహిస్తే ఇంకేమని చెప్పగలం. కంచే చేను మేస్తే ఇక సమాజానికి దిక్కేది. ఇంజనీరింగ్ విద్యార్థులు చివరి సంవత్సర పరియోజన కొరకు కొన్ని సంస్థలను ఆశ్రయిస్తారు. వారికి కొంత సొమ్ము అప్పజెప్పి, పరియోజనను అరువు తెచ్చుకుంటారు. ఇందులో అందరూ తోడుదొంగలే. ఆ సంస్థ దానిని వేరే విద్యార్థులకు చక్రీయంగా తిప్పుతుంది. తరువాతి సంవత్సరాలలో కూడా అదే ఉపయోగిస్తుంది. ఇంత నాటకాల చదువుల నిలయం నుంచి వచ్చిన విద్యార్థి తరువాతి జీవితంలో నిజాయితీగా ఎలా ఉండగలడు? ఇలా విద్యార్థులు, విద్యావేత్తలు ఎవరికి వారే స్వలాభం చూసుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ ఎవరి గోతి వాళ్లు తవ్వుకుంటున్నారని అర్థం చేసుకోవడం లేదు.

-ప్రొ. సీతారామరాజు సనపల,

రక్షణ శాఖ పూర్వ శాస్త్రజ్ఞులు.

72595 20872

Tags:    

Similar News