బీజేపీ హుజురాబాద్ ఉపఎన్నిక వ్యూహం ఇక్కడ ఫలిస్తుందా!?
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల జోరు నడుస్తున్నది. హుజురాబాద్ ఉప ఎన్నికను రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రతిష్టాత్మకంగా చూశారు. ఆ ఉప
నిజంగా వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపీలతో రాజీనామా చేయించి, వారి పరిధిలో అభివృద్ధికి కారకులు కావచ్చు కదా! కానీ అలా చెయ్యరు. ఎందుకంటే, అభివృద్ధికి రాజీనామాలకు ముడిపెట్టి, అసలు విషయం తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది బీజేపీ. హుజురాబాద్ ఫలితమే మునుగోడులో ఉంటుందని రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ఊహించుకుంటున్నారు. ఒక ఎన్నికకు, మరొక ఎన్నికకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. రెండు భిన్నమైన రాజకీయ అస్తిత్వాలు కలిగిన రెండు ప్రాంతాల మధ్య అసలు పోలిక ఉండదు. ఉత్తర తెలంగాణ ఫలితం దక్షిణ తెలంగాణలో పునరావృతం అవుతుందనుకుంటే పొరపాటే.
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల జోరు నడుస్తున్నది. హుజురాబాద్ ఉప ఎన్నికను రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రతిష్టాత్మకంగా చూశారు. ఆ ఉప ఎన్నిక రావడానికి కారణం మాజీ మంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్‌తోనే ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఆ పార్టీలో 20 యేళ్లపాటు కొనసాగింది. తన నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాయకుడు. రాజకీయంగా వచ్చిన ఆరోపణల కారణంగా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికలో విజయం సాధించారు. ఆయనకు అక్కడి ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఉద్యమ నేపథ్యం, సౌమ్యుడిగా, స్నేహశీలిగా, అసహనాన్ని దరిచేరనీయనివారుగా ఉన్న పేరు, నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉండి క్యాడర్‌ను రూపొందించుకోవడం తదితర కారణాలతో గెలుపు సాధ్యమైంది.
రాజకీయ కుట్రతోనే
హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ కుట్ర రాజకీయాలకు తెర లేపింది. ఒక కొలనులో విరిసిన కమలంతోనే రాష్ట్రమంతా దానిని వికసింపజేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వారు చేస్తున్న సంక్షేమం ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బీజేపీ రాజకీయ కుట్రతో మరో ఉప ఎన్నికను తెచ్చింది. మునుగోడు శాసనసభ్యుడుగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత ఆ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, తమ పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికకు సిద్ధం చేసింది. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసమే రాజీనామా చేశానని ఆయన తెలంగాణ ప్రజలకు హితబోధ చేస్తున్నారు.
ఆయన నిజంగా అభివృద్ధి కోరుకుంటే కేవలం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ బి-ఫామ్ మీదనే తిరిగి పోటీ చేసి ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేయవచ్చు. తన కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీలో చేరారనే విషయం మునుగోడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తాను రాజకీయాలలోకి వచ్చి 13 సంవత్సరాలే అయినా, 30 యేళ్ల రాజకీయ అనుభవం ఉందని ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి ఆయన మునుగోడులో గెలిచాక నియోజక అభివృద్ధి పట్టించుకోలేదు. కనీసం ప్రజలకు సరిగా అందుబాటులో ఉండేవారు కాదు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అక్కడ అభివృద్ధి చేయవచ్చు కదా?
రాష్ట్రమంతా కమలం వికసిస్తుందని, కుటుంబ నియంత పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. హుజురాబాద్ తరహా ఫలితం రాబోతుందని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వారు గమనించవలసింది ఏమిటంటే, హుజురాబాద్ పరిస్థితి వేరు, మునుగోడు పరిస్థితి వేరు. హుజురాబాద్‌లో ఇరవై సంవత్సరాలుగా గెలుస్తున్న ఈటల రాజేందర్ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. టీఆర్ఎస్ తనను బలవంతంగా పంపించారని ప్రజలకు చెప్పి సఫలీకృతులయ్యారు. ప్రజలు సానుభూతితో అక్కడ రాజేందర్‌ను గెలిపించుకున్నారు. మునుగోడు అలా కాదు కదా? అది కామ్రేడ్స్ కంచుకోట. అక్కడి ప్రజలు విప్లవ రాజకీయ అవగాహనతో ఉంటారు.
బీజేపీ అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నది.నిజంగా వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపీలతో రాజీనామా చేయించి, వారి పరిధిలో అభివృద్ధికి కారకులు కావచ్చు కదా! కానీ అలా చెయ్యరు. ఎందుకంటే, అభివృద్ధికి రాజీనామాలకు ముడిపెట్టి, అసలు విషయం తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది బీజేపీ. హుజురాబాద్ ఫలితమే మునుగోడులో ఉంటుందని రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ఊహించుకుంటున్నారు. ఒక ఎన్నికకు, మరొక ఎన్నికకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. రెండు భిన్నమైన రాజకీయ అస్తిత్వాలు కలిగిన రెండు ప్రాంతాల మధ్య అసలు పోలిక ఉండదు. ఉత్తర తెలంగాణ ఫలితం దక్షిణ తెలంగాణలో పునరావృతం అవుతుందనుకుంటే పొరపాటే.
ఆవాల హరిబాబు
ఓయూ పరిశోధక విద్యార్థి
టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి