అంతర్జాల వలయంలో యువత!

Internet Impact on Youth

Update: 2023-10-03 00:30 GMT

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కరోనా సమయంలో పిల్లలు, కౌమార యువత చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లిదండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. వీరికి పట్టిన ఇంటర్నెట్‌ పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని వాపోతున్నారు. వారి నుంచి ఫోన్ తీసుకుంటే మారాం చేస్తున్నారని, ఎంత బుజ్జగించినా వినడం లేదని, ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని వాపోతున్నారు.

రోజుకు 6 గంటలకు పైగా..

పట్టణ ప్రాంతాల్లో బాలలు 61 శాతం స్మార్ట్‌ఫోన్‌ తెరలకు అతుక్కుపోతున్నారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు డిజిటల్‌ తెరల దురలవాటుకు లోనవుతున్నారు. ఈ వ్యసనం కారణంగా ఆవేశం, దూకుడు పెరగడం, నీరసపడడం, నిరాశల విష వలయంలో చిక్కుకొని తమ భవితను నాశనం చేసుకునే స్థాయికి చేరుతున్నారు. అందుకే పట్టణ ప్రాంతాల్లోని 18 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా (ఓటిటి, వీడియో, ఆన్‌లైన్‌ గేమ్, పోర్న్‌ ప్లాట్‌ఫామ్స్‌ లాంటివి) వాడడానికి పరిమితులు, అనుమతులు తీసుకునేలా ప్రభుత్వాలు ‘డిజిటల్‌ ప్రైవేట్‌ డాటా ప్రొటెక్షన్‌ లా’ లాంటి చట్టం తీసువచ్చేలా చర్యలు చేపట్టాలని 73 శాతం మంది తల్లిదండ్రులు కోరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

అంతర్జాల తెరల్లో మునకలు వేస్తున్న 9 - 17 ఏండ్ల పిల్లలు 15 శాతం వరకు రోజుకు 6 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌, లాప్‌టాప్‌‌ లేదా ఇతర డివైజెస్‌ వాడుతున్నట్లు, 46 శాతం పిల్లలు రోజుకు 3 - 6 గంటలు, 39 శాతం బాలలు 1 - 3 గంటల పాటు ఈ డివైజెస్ వాడుతున్నట్టు ఇటీవల ‘లోకల్‌సర్కిల్స్‌’ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్‌ సైట్లలో గంటల తరబడి గడుపుతున్న 39 శాతం బాలలు దూకుడుగా (అగ్రెసివ్‌గా), 37 శాతం మంది అసహనంగా, 22 శాతం నీరసంగా, 25 శాతం అతి చురుకుదనంగా(హైపర్‌ఆక్టివ్‌గా), 27 శాతం నిరాశగా ఉంటున్నట్లు అధ్యయనం తేల్చింది. ఇంటర్‌నెట్‌ వాడే పిల్లల్లో 8 శాతం సంతోషంగా, 10 శాతం కలివిడిగా ఉంటున్నారని తెలుస్తున్నది. ఈ వయసు పిల్లల్లో 35 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, స్నాప్‌షాట్‌ వేదికలను వాడుతున్నారని, 37 శాతం మంది వీడియో, యూట్యూబ్‌, ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ లాంటి వేదికల్లో గంటల తరబడి కాలం గడుపుతున్నారని తేలింది. 33 శాతం ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎక్కువగా ఆడుతున్నారని విశ్లేషించింది. అలాగే ఈ నివేదికలో 18 ఏండ్ల లోపు పిల్లలు, కౌమార యువత అంతర్జాల వేదికలను వాడడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని 73 శాతం మంది పేరెంట్స్‌ భావిస్తుండగా, 13 శాతం మంది పేరెంట్స్‌ మాత్రం 15 ఏండ్లు దాటిన కౌమార యువతకు ఎలాంటి ఆంక్షలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్‌ దుష్ప్రభావాలు

స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను రోజుకు పలు గంటలు వాడుతున్న 9 - 18 ఏండ్ల పిల్లల్లో తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. నెట్టింట్లో అనేక గంటలపాటు తెరలకు అత్తుకుపోతున్న పిల్లలలో ఓపిక లేకపోవడం, ఆవేశపడడం, ఉద్రేకపడడం, ఏకాగ్రతను కోల్పోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి సమస్యలు, కంటి జబ్బులు, వెన్నునొప్పి, ఒత్తిడి, ఆందోళన, సంభాషణ సమస్యలు, సోమరితనం, నిరాశ లాంటి అవలక్షణాల పాలవుతున్నారని అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.

ఈ సంస్థ ‌నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 296 జిల్లాలో నుంచి 46,000 మంది పట్టణ ప్రజల అభిప్రాయాలను, అందులో 38 శాతం మహిళల అంతరంగాన్ని రికార్డు చేశారు. అంతర్జాల విషవలయంలో చిక్కకుండా కేవలం 8 శాతం మంది బాలలు మాత్రమే ఆన్‌లైన్‌ను వినియోగిస్తున్నారని తేల్చింది. మిగిలిన 92 శాతం మంది మాత్రం ఇంకా అంతర్జాల వలయంలో ఉన్నారని తేల్చింది. ఒకప్పుడు జూదం, తాగుడు, పొగాకు లాంటి దురలవాట్లకు అలవాటు పడిన జనులు ఉండేవారు. నేడు యువత ముంగిట డ్రగ్స్‌, ఇంటర్నెట్‌, పబ్స్‌, రేవ్‌ పార్టీలు లాంటి ఆధునిక హంగులు వండి వార్చే కల్చర్‌ పెరగడంతో డిజిటల్‌ యుగపు బాలలు, కౌమార యువత, యువతీయువతకులు సరికొత్త దురలవాట్లకు బానిసలై రేపటి భవితను బుగ్గిపాలు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ పరిస్థితులను గమనిస్తూ తల్లిదండ్రులు, సమస్త సమాజం, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో నేటి బాలలు టెక్నాలజీ దుర్వినియోగ ఊబిలో పడకుండా వారిని సంరక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే నేటి దురలవాట్ల యువతే రేపటి అనారోగ్య భారతం అవుతుందని తెలుసుకోవాలి.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Tags:    

Similar News