జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సింది మనమే!

సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే! ప్రతీది ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి.

Update: 2024-05-22 01:00 GMT

సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే! ప్రతీది ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి సైతం తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను వివరించారు. భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం.

నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో మన దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికి పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్త మైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలు అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

గిరిజనులున్న చోట..

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు అపార జీవ జాతులు అంతరించిపోయాయి. మన దేశంలో ఆదివాసులు (గిరిజనులు, కొండ జాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగానూ ఉంది. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

జీవ వైవిధ్య రక్షణ కోసం..

సుందర్‌లాల్‌ బహుగుణ నిర్వహించిన చిప్కో ఉద్యమం, పర్యావరణ పరిరక్షణకు సాగిన ఉద్యమాలన్నింటికీ తలమానికమైనది. స్వీడన్‌ బాలిక గ్రేటా తంబెర్గ్‌ ‘వాయిస్‌ ఫర్‌ ది ప్లానెట్‌ అండ్‌ ది స్ట్రెక్‌ ఫర్‌ క్లెమెట్‌’ నినాదంతో నిర్వహించిన జీవ వైవిధ్య రక్షణ ఉద్యమం ఆ దేశంలో పర్యావరణ అనుకూల విధానాలు అమలయ్యేలా చేసింది. గ్రెటా తంబెర్గ్‌, వందనా శివ, మేథాపాట్కర్‌, వనజీవి రామయ్య దారిలో పౌర సమాజం జీవ వైవిధ్య రక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచమంతటా ఏటా 10 వేల జాతులు లేదా రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయనేది యదార్థం. ఐక్యరాజ్యసమితి ఏటా మే 22న నిర్వహిస్తున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో ఒక కొత్త థీమ్‌తో కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. ఆ కోవలోనే 2024లో ప్రణాళికలో భాగమవ్వండి అనే నినాదం జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలలో చురుకుగా పాల్గొనడానికి వ్యక్తులను, సంఘాలను, దేశాలను కోరుతున్నది.

(నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం)

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

9000674747

Tags:    

Similar News