మళ్ళీ పెరిగిన వడ్డీ రేటు
మళ్ళీ పెరిగిన వడ్డీ రేటు... Interest rate increased again
భారత రిజర్వు బ్యాంకు సంవత్సరం తిరక్కుండానే ఆరోసారి రెపో రేటు పెంచింది. ప్రస్తుతం 25 బేస్ పాయింట్స్ పెరిగి వడ్డీ 6.5 శాతానికి చేరుకుంది. దీనివల్ల బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర తీసుకునే అప్పులకు కట్టాల్సిన వడ్డీలు పెరుగుతాయి. ఆ వడ్డీలను రుణం తీసుకునే ఖాతాదారుల జేబు నుండి కక్కిస్తాయి. వెరసి ఇంటి రుణం వాయిదాలతో సహా కొత్త రుణాలూ, పాతవీ అన్నీ ప్రియమౌతాయి.
తద్వారా నగదు చలామణి కట్టడి జరిగి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆశ. ద్రవ్యోల్బణం అదుపు చెయ్యడానికి ఇది శాస్త్రీయ మార్గమే అయినప్పటికీ, ప్రజల్ని బాధే ఈ మార్గమే ఏకైక మార్గంగా కనబడడం బాధాకరం. రిజర్వు బ్యాంకు దాని లెక్కల్లో అది ఉన్నా ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అందుబాటులో ఉన్న మిగతా మార్గాల్ని ప్రభుత్వం చూడాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, ఉపాధి పెంచడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ద్రవ్యోల్బణం పెరుగుతూపోవడానికి డిమాండ్ పెరగడమే కాకుండా సరఫరా తగ్గడమూ పెద్ద కారణమే. చేతిలో లేని అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా వాటిని దిద్దడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చు. ముడిచమురు ధరలు, మార్కెట్ ఒడిదుడుకులు ఇంకా పెరిగి భారం కావొచ్చు. అయితే ఉన్నంతలో ప్రభుత్వం ఎంత చెయ్యగలిగిందన్నదే ప్రధానం. మొన్న బడ్జెట్ ప్రసంగంలో మిగతా దేశాల ఆర్థికంలో కరోనాతో కుదేలైతే, మనదేశం మాత్రం నిలిచి కోలుకుందని ఆర్థిక మంత్రి చెప్పారు. వైద్య, విద్యా రంగాలకు పెద్దగా కేటాయింపులు లేవు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత. ఇప్పుడు బ్యాంకుల వడ్డీలు పెరిగి చేతిలో డబ్బు ఆడడం ఇంకొంచెం కష్టం కాబోతుంది. ద్రవ్యోల్బణం 6. 5 శాతంకి కట్టడి చెయ్యగలం అంటున్నారు. చూడాలి మరి.
డా. డి.వి.జి.శంకరరావు
94408 36931