‘కథ’ విడిచి సాము చేస్తున్న సినిమాలు

indian films that leave story aside

Update: 2023-07-29 00:00 GMT

సినిమాకి కథ ఎందుకు. అరటిపండు తొక్క చాలని ఆ మధ్యకాలంలో ఓ ప్రముఖ దర్శకుడు చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యానం చాలు వర్తమానంలో వస్తున్న చిత్రాల తీరు తెన్నులు చెప్పటానికి. కేవలం ఒక సంఘటన ఆధారంగా కథ అల్లుకోవడం వేరు. ‘కథ’ చుట్టూ సంఘటనలను పేర్చుకుంటూ వెళ్ళటం వేరు. ఒకటి అస్థిపంజరం, రెండోది ‘ప్రాణమున్న దృశ్యం’. చిత్రాలు నిర్మించడానికి ‘కథ’ అవసరం లేకపోవచ్చు (నిర్మాత ఉంటే చాలు). కానీ చిత్రం చూడటానికి మాత్రం అవసరమే. అరువు కథలు, అనుసరణ కథలు, అనువాద కథలలో తెలుగుదనాన్ని తీసుకురాలేం. ఆ ‘కథ’ ఆత్మను తెరపైకి తీసుకు రాగలిగితేనే విజయం లభిస్తుందని ఆరు దశాబ్దాల క్రితం ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ గారు వివరణ ఇచ్చారు. యాభై, అరవైల దశకంలో శరత్ నవలలను దర్శకులు, నిర్మాతలూ చిత్రాలుగా నిర్మించారు. కొంతవరకూ విజయాలు సాధించారు. అర్ధాంగి, దేవదాసు, చిరంజీవులు, కులదైవం ఇలా మరికొన్ని ఉన్నాయి. ఆ తర్వాత దశకాలలో కూడా తమిళ, హిందీ, మరాఠీ సినిమా కథలతో చిత్రాలు నిర్మించారు. కథలేని చిత్రం శవానికి చేసిన అలంకారమని ఆనాటి (నేటికీ కొందరి) నమ్మకం. అసలు సినిమాకి కథ అవసరమా అని ప్రశ్నించే వారున్నారు.

ఆ ప్రయోగాలు చేస్తే వికటించడమే!

‘కథ’ అనేది సమాజంలోని వ్యక్తుల జీవితాల నుంచి పుడుతుంది. చిత్రమనేది ఊహ కావచ్చు. కానీ... ఆ ఊహకు కూడా ఆలంబన వ్యక్తే! మరి అటువంటి సమాజాన్ని, వ్యక్తులను విడదీసి, విస్మరించి కథలను వదిలేసిన చిత్రాలు ఎలా విజయవంతమవుతాయి. కథలు సందేశాత్మకం కానవసరం లేదు. కానీ ఆలోచింపజేసేవిగా ఉండాలి కదా. చిత్రమన్నాక సందేశాలు ఎందుకు. అందుకోసం లక్షల ఖర్చు ఎందుకు. అయినా వినోదం కోసం ‘కథ’ల ఎంపిక అవసరం అంటారు చక్రపాణిగారు. వారి చిత్రాలు చూస్తే ఈ వ్యాఖ్యానం ఆయన అనుభవసారమనిపిస్తుంది. ‘షావుకారు’ దగ్గరి నుండి ‘విజయ’ వరకు వారి సినిమాలు గమనిస్తే అంతర్లీనంగా కథ ప్రాధాన్యతను వారెంతగా విశ్వసించారో గమనించవచ్చు. ‘వాహిని’ ‘రేవతి’ ‘భరణి’ ‘వినోద’ ‘సురేష్’ వంటి సంస్థలు, తరువాత కాలంలో వచ్చిన ‘పూర్ణోదయ’ ‘కౌముది’ ‘ఎం.ఎస్. ఆర్ట్స్ (మల్లెమాల గారి) వంటి సంస్థలు ‘కథ’ కోసమే సినిమాలు తీసేవారు. శంకరాభరణం, కోడెనాగు, అమ్మోరు, అంకుశం వంటి సినిమాలు కేవలం కథతోనే ప్రయాణం చేశాయి. వీటిని వారు ప్రయోగాలుగా భావించలేదు. అటువంటి కథలను గురించి ప్రేక్షకులు ఆలోచించాలని, ఆ కోవకు చెందిన పాత్రల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని తీశారు. ఇది సందేశమే కథ. సస్పెన్స్, పౌరాణికం, థ్రిల్లర్, హారర్ ఇలా ఏదైనా కథ ఉంటే, దానిని ఆసక్తికరంగా ఆరోగ్య ప్రదంగా తెరకెక్కిస్తే, చూసేవారికి ‘ఆసక్తి’ కలుగుతుంది. కథ లేకుండా ప్రయోగాలు చేసినా వికటిస్తాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక చిత్రాలు ఇందుకు ఉదాహరణ ఆరు నెలల కాలంలో 155 చిత్రాలు వస్తే కేవలం పది చిత్రాలు కూడా ప్రేక్షకుల మన్ననలందుకోలేదు.

కారణం కథను పక్కన పెట్టి సమీకరణాలతో చిత్రాలు నిర్మిస్తే నష్టపోయేది ఎవరు. ఓటీటీ ప్లాట్ ఫారం పైన నిరంతరం కొత్త కథలతో కొత్త తరం దూసుకువస్తుంటే, చిత్రాలు తీసేవారు మాత్రం ఇంకా పురాతన రాజులు, జమీందారులు ఆత్మలు దగ్గరే ఆగిపోతున్నారు. కుటుంబంలోని వారసులను హీరోలుగా చూపించడం కోసం తపిస్తున్నారు. డబ్బు మాది, మా ఇష్టం అని భావించవచ్చు. కానీ... పరిశ్రమ మనుగడ కోసం కూడా ఆలోచించాలి కదా. ఒక చిత్రం నిర్మాణానికి 24 విభాగాలు అవసరం. ఆయా విభాగాలలో పనిచేసే వారి ‘జీవనం’ అవసరం.

జయాపజయాలు వారిపైన ప్రభావం చూపుతాయి. కనుకనే పాతతరం కథ కోసం తపించేవారు. తమకోసం ప్రత్యేకంగా కథా విభాగాన్ని ఏర్పాటు చేసుకునే వారు. అంత జాగ్రత్తగా ఉన్నా సరే అపజయాలు తప్పలేదు. ‘రాజ మకుటం’ వంటి చిత్రాలు ఈ కోవకే చెందుతాయి. కథ సినిమాకి ప్రాణం అని విశ్వసించే వారి ఫలితాలే ఇలా ఉంటే అసలు కథే అవసరం లేదు అనేవారు తరువాతకాలంలో ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే.

సినిమాకు.. హీరో, హీరోయిన్లు చాలా?

గతించిన కాలంలో నవల చిత్రాలు ఎన్నో వచ్చాయి. జనాదరణ పొందిన యద్దనపూడి, అరికపూడి, రామలక్ష్మి, జలంధర, వసుంధర, మాదిరెడ్డి, కొమ్మాది, యండమూరి వంటి వారి నవలలు చిత్రాలుగా వచ్చాయి. చక్రవాకం, ప్రేమ్ నగర్, ప్రేమ నక్షత్రం, జాగృతి, జీవన తరంగాలు, రెండు కుటుంబాల కథ, అభిలాష, చాలెంజ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ విజయవంతం అవ్వడానికి కారణం ఆ రచనలోని కథ. ముఖ్యంగా కుటుంబ పరమైన అంశాలు సమాజపరమైన వ్యక్తుల ఆలోచనలు కథనం వంటివి చిత్రానికి అవసరమని నమ్మే దశకాలలో ఇటువంటి నవలలు ప్రేక్షకాదరణ, పాటకాదరణలను పొందాయి. నిర్మాతలకు లాభాలను తీసుకువచ్చాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన త్రివిక్రమ్ ‘అ..ఆ..’ చిత్రం యద్దనపూడి గారి మీనా (ఇదే పేరుతో గతంలో విజయనిర్మల గారి దర్శకత్వంలో వచ్చింది) రచన ప్రేరణతో తయారై విజయాన్నందుకుంది. అంటే పటిష్టమైన కథనానికి ‘కమర్షియల్ ఎలిమెంట్స్’ జోడిస్తే నిర్మాత ‘సేఫ్ జోన్’ లోనే ఉంటాడని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన బలగం, విరూపాక్ష తదితరాలు కూడా కథా బలానికి మానవ ఆకర్షిత అనుబంధాలు, ప్రేమ, ఆచార సంప్రదాయాలు వంటి సెంటిమెంట్స్ వేదిక కావడం విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాలు నిరూపించాయి.

వర్తమానంలో ఓ నవల చదివి దానిని చిత్రంగా మలిచే స్క్రీన్ ప్లే బాధ్యతను తలకి ఎత్తుకొని ఓ చక్కని బ్యాండ్‌గా చేసుకునే నిర్మాత, దర్శక కథకులు కరువయ్యారు. హీరో, హీరోయిన్స్ ఉంటే చాలు. సినిమాను ఎవరైనా తీయవచ్చు. ఎలాగైనా తీయవచ్చు. డబ్బు పెట్టే పెట్టుబడిదారుడు ఉంటే చాలు. నిర్మాత అవసరం లేదు. అందుకే కాలక్రమేణా సీనియర్ నిర్మాతలు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండిపోయారు. దుక్కిపాటి మధుసూదనరావు, నవత కృష్ణంరాజు తదితరులు వేరు. కానీ నేటికీ ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారు ఉదాహరణ. దిల్ రాజు లాంటివారు ఆధునికతను అనుసరిస్తూనే ‘సీతమ్మ వాకిట్లో…’ ‘శతమానం భవతి’ వంటి ఆరోగ్యవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే చూసేవారికి ప్రతి విజయవంతమైన చిత్రం వెనుక ఓ బలమైన కథ ఉంటుందని అర్థమవుతుంది. కానీ గమనించేవారు తక్కువైపోయారు. ‘ఆది పురుష్’ వంటి పౌరాణికాలకు కథ అవసరం లేదు అనే దశకు కొంతమంది ఎదిగిపోయారు. మరి విజయాలు ఎలా వస్తాయి, లాభాలు ఎలా తెస్తాయి! కథ విడిచి సాము సినిమాలకు మంచిది కాదనే పాఠం గతంలో పరిశ్రమ నేర్పించినా.. ఆ తోవలోనే ఎక్కువ శాతం చిత్రాలు రావడం ఆశ్చర్యకరం. మనం చేయాల్సిందల్లా మార్పు కోసం వేచి చూడడమే..

భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Tags:    

Similar News