బీమ్ స్టెక్ దేశాలు పరస్పర సహకారంతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధి సాధించాలి. రాజకీయ సుస్థిరత సాధించుకోవాలి. వారి వారి దేశాల్లో తయారుకాగల వస్తువులైనా ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేసుకోవాలి. ఎగుమతులు పెంచుకోవాలి . దిగుమతులు తగ్గించుకోవాలి. విద్య వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఇతర దేశాల పై అన్ని రంగాలలో ఆధారపడి ఉండుట మంచిది కాదు అని గ్రహించాలి. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకూడదు. స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా అడుగులు వేయాలి. ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తు పరిస్థితులు, అవసరాలు తీర్చుకోవడానికి ఈ దేశాలు అన్నియు సమన్వయంతో పనిచేయాలి.
'ది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్'(బీమ్ స్టెక్) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. బంగాళాఖాతం సముద్రం వెంబడి ఉన్న వివిధ దేశాలు బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక, భూటాన్, థాయ్ లాండ్ సమన్వయం చేసుకుంటూ పరస్పర అభివృద్ధి కోసం 1997లో బీమ్ స్టెక్ ఏర్పాటు చేశారు. ఐదవ సమావేశం ఇటీవల శ్రీలంకలో జరిగిన సందర్భంగా 'ప్రాంతీయ శాంతి, ఆర్థిక సహకారం, ప్రజారోగ్యం'అనే థీమ్‌తో ప్రయాణం ప్రారంభించారు. బంగాళాఖాతం సముద్రం చుట్టునున్న దేశాలకు భౌగోళికంగా, రాజకీయ, ఆర్థిక,సాంస్కృతిక పరంగా చాలా కీలకమైనది. అదే విధంగా రవాణా, వ్యాపార వాణిజ్య పరంగా పూర్వ కాలం నుంచి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని కాపాడుకోవడం ఈ దేశాల తక్షణ కర్తవ్యం అని గ్రహించాలి.
నాలుగో వంతు వ్యాపారం
ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు జనాభా ఈ ఏడు దేశాలలో ఉన్నది. సుమారు 50 లక్షల మంది (హాఫ్ బిలియన్) ఈ తీరం వెంబడి నివసిస్తున్నారు. ఈ తీరం వెంబడి అనేక రకాల సహజ వనరులు గ్యాస్, మత్స్య సంపద, సముద్ర సంపద కలిగి ఉండటంతో వీటి ఆధారంగా ఈ దేశాలు ఆర్థిక పరిపుష్టత సాధించాలి. ప్రతీ సంవత్సరం ఈ బంగాళాఖాతం- పసిఫిక్ మహాసముద్రం ద్వారా సుమారు నాలుగో వంతు వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. వాయు సేన (ఎయిర్ ఫోర్స్) సేవలకు, సరిహద్దుల రక్షణకు, వాయి విన్యాసాలకు వేదికగా ఈ తీరం పూర్వ కాలం నుంచి ఉన్నది. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో వ్యాపార వాణిజ్యానికి, ఆర్థిక సహకారానికి వెన్నెముకగా విరాజిల్లుతున్నది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో ఈ దేశాలు అన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది , తదుపరి సరిహద్దులు నిర్ణయించుకున్నవే. ఈ దేశాలు అన్ని కోవిడ్‌తో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవే. ప్రస్తుత రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బీమ్ స్టెక్ దేశాలు ఆచితూచి అడుగులు వేయాలి. పరస్పర సహకారం, అవగాహనతో ముందుకు సాగాలి.
నదులతో సరిహద్దులు
ఈ బంగాళాఖాతం సరిహద్దు తో పాటు, నేపాల్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్ 'గంగా-బ్రహ్మపుత్ర'నదులతో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఇవి మరింత సఖ్యత, సహకారంతో ప్రయాణం చేయాలి. ఇండియా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్ మెరైన్ బౌండరీ కలిగి ఉన్నాయి. వాణిజ్య, రక్షణ పరంగా ముందుకు సాగాలి.ప్రపంచానికి 'ఆర్థిక ఇంజన్ల'వలే ఉండాలి. ఇటువంటి పరిస్థితులలో అతిపెద్ద దేశంగా ఉన్న మన భారతదేశం ముందుచూపుతో, ఏ ఇతర అభివృద్ధి చెందిన దేశాలు, పెట్టబడీదారి దేశాల ఒత్తిడులకు లోనుకాకుండా ఈ ప్రాంత దేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుస్తూ అభివృద్ధికి బాటలు వేసేలా కీలక పాత్ర పోషించాలి. విశ్వగురు స్థానం కంటే ముందు స్థానిక గురుగా ఆవిర్భించుటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పూర్వకాలం నుంచి ఈ దేశాలతో సంస్కృతి సాంప్రదాయాలతో అనాదిగా ముడిపడి ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం, గౌరవించడం మన బాధ్యత అని అన్ని దేశాలు తలచాలి.
ఒకరినొకరు గౌరవించుకోవాలి
దీనిలో భాగంగా మన భారతదేశం 'సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ అలెన్ టు రీజియన్'(సాగర్) ప్రాజెక్టు పకడ్బందీగా అమలు చేయాలి. సాగరమాల, భారతమాల, 'ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్'(ఐడబ్ల్యూటీ) వంటి పథకాలను వేగంగా, సక్రమంగా అమలు చేయాలి. ఒకరి సార్వభౌమత్వం ఇంకొకరు గౌరవించడం, సరిహద్దులలో ఉద్రిక్తతలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు. అవసరమైతే అంగీకారంతో మధ్యవర్తిత్వం వహించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. ఇటువంటి పరిస్థితులలో భారత్ పాత్ర కీలకం.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా మనదేశ విదేశాంగ విధానం అందరి మన్ననలు పొందుతోంది. గంగా బ్రహ్మపుత్ర నీళ్ల వాడుకలో సరియైన అవగాహన, విశ్లేషణతో ఉండాలి. ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే సరైన 'హైడ్రో గ్రాఫిక్ సర్వే'చేయించాలి. సరైన వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉండేటట్లు చూసుకోవాలి. దీని ద్వారా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. వాటర్ లభ్యత, నాణ్యత, వాడకం జాగ్రత్తగా చూసుకోవాలి.
స్వయం సమృద్ధి సాధించాలి
ఇప్పటివరకూ 20 శాతం ఫ్రెష్ వాటర్ ఉండటంతో కరువు వల్ల ఈ ప్రాంతాలు సతమతం అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నదీ జలాలు, సముద్ర జలాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. 'నీటి అడుగున వెలువడే శబ్దం'అండర్ వాటర్ రేడియేటర్ నాజ్ (యూఆర్ఎన్) నియంత్రణకు చర్యలు చేపట్టాలి. గంగా బ్రహ్మపుత్ర, కాయ్ ఫుల్ రివర్ సుందర్ బన్ డెల్టా మంచినీటికి డాల్ఫిన్ లకు ఆవాసంగా ఉంది. ఈ డాల్ఫిన్స్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. జీవవైవిధ్యం కాపాడబడుతుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెద్ద పెద్ద ఓడలు,జల రవాణా, కాలుష్యం కారణంగా వేల్స్ కనుమరుగు అవుతున్నాయి.
ఇటువంటి పరిస్థితులలో బీమ్ స్టెక్ దేశాలు పరస్పర సహకారంతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధి సాధించాలి. రాజకీయ సుస్థిరత సాధించుకోవాలి. వారి వారి దేశాల్లో తయారుకాగల వస్తువులైనా ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేసుకోవాలి. ఎగుమతులు పెంచుకోవాలి . దిగుమతులు తగ్గించుకోవాలి. విద్య వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఇతర దేశాల పై అన్ని రంగాలలో ఆధారపడి ఉండుట మంచిది కాదు అని గ్రహించాలి. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయకూడదు. స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా అడుగులు వేయాలి. ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తు పరిస్థితులు, అవసరాలు తీర్చుకోవడానికి ఈ దేశాలు అన్నియు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా మన భారతదేశం ముందుచూపుతో అన్ని దేశాలను ఐక్యం చేస్తూ స్వయం సమృద్ధి సాధించుటకు నడుంబిగించాలి. అప్పుడు మాత్రమే ఈ బీమ్ స్టెక్ ఏర్పాటు ఆశయాలు సాకారమవుతాయి.
ఐ.ప్రసాదరావు
63056 82733