పెరిగిన విద్యారంగ కేటాయింపులు

Increased allocation for education sector in Telangana budget

Update: 2024-02-11 05:37 GMT

తెలంగాణ 2024-2025 బడ్జెట్ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సమగ్ర అభివృద్ధికి బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. స్కిల్ యూనివర్శిటీల స్థాపనకు, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ స్థాపనకు గణనీయమైన నిధులను కేటాయించడం ద్వారా, అభ్యసన మరియు ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం, పార్లమెంట్ ఎన్నికల క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 సంవత్సరానికి రూ.2 లక్షల 75 వేల 891 కోట్లుగా చూపించారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి కీలక చోదకశక్తిగా ఉన్న విద్యకు ప్రాధాన్యమివ్వడాన్ని చూస్తే గత సంవత్సరం కన్నా కొద్ది శాతం కేటాయింపులు పెంచడం గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన నిబద్ధతను ప్రతిబింబించిందని చెప్పవచ్చు.

విద్య ఉపాధి అంతరాన్ని తగ్గించాలని..

రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ని పరిశీలిస్తే… ఇందులో విద్యారంగానికి 21,389 కోట్లు కేటాయించారు. అలాగే యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ 500 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌లో విద్య రంగం వాటా 7.6% ఉండగా ఈసారి 7.745% నిధులను కేటాయించడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా తెలంగాణ తన మొత్తం బడ్జెట్లో 6.24% విద్యకు ఖర్చు చేసింది. అఖిల భారత సగటు కేటాయింపు 15.2% కంటే తెలంగాణలో విద్యారంగానికి కేటాయింపులు చాలా తక్కువ. అదే కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇది 20%-22% వరకు ఉంటది.

ఇంకోవైపు గురుకులాల్లో భవనాల నిర్మాణానికి నిధులుగా రూ 500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే కోకొల్లలుగా స్థాపించిన ఈ గురుకులాలకి ఈ నిధులు కొద్దిపాటి ఉపశమనం. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణ బడ్జెట్ 2024-25 విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సమగ్ర అభివృద్ధికి బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. స్కిల్ యూనివర్శిటీల స్థాపనకు, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ స్థాపనకు గణనీయమైన నిధులను కేటాయించింది. వీటితో ప్రత్యేక శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించడం ద్వారా విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విశ్వవిద్యాలయాలు పరిశ్రమ-సంబంధిత కోర్సులను అందించడానికి, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ మార్కెట్ డిమాండ్లను తీర్చే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి ఉద్దేశించినవి.

అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి

విద్యకు బడ్జెట్లో గణనీయమైన కేటాయింపులు ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పోస్టుల భర్తీ గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం గమనార్హం. విద్యాప్రమాణాల నిర్వహణకు, పరిశోధన నైపుణ్యాన్ని పెంపొందించడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి అర్హత కలిగిన అధ్యాపకుల నియామకం కీలకం. అధ్యాపకుల నియామకానికి ప్రత్యేక నిధుల కేటాయింపు, వ్యూహాత్మక ప్రణాళిక అత్యవసరం. కానీ ఈ కీలకమైన అంశాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ నిబద్ధత ఆందోళనలను పెంచుతుంది. ప్రతిభను పెంపొందించడానికి, అకడమిక్ కాఠిన్యతను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అధ్యాపకులు చాలా అవసరం. అర్హత కలిగిన అధ్యాపకులు పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, పరిశోధనా మార్గదర్శకత్వంలో కీలక పాత్ర పోషిస్తారు, తద్వారా విద్యా సంస్థల మేధో స్వరూపాన్ని రూపొందిస్తారు. అంతేకాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాల ఖ్యాతి, పోటీతత్వాన్ని పెంచడానికి చాలా ముఖ్యమైనది. అధ్యాపకుల నియామకాల్లో లోటును పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలి.

డా. చాకేటి రాజు

పొలిటికల్ అనలిస్ట్

96250 15131

Tags:    

Similar News