చారిత్రక దృశ్యకావ్యం ‘ఇరువర్’
In Mani Ratnam’s ‘Iruvar’ movie a world of mirrors and illusion
మణిరత్నం సినిమాలంటేనే వాటి లెక్క వేరుగా ఉంటుంది. సంభాషణలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, చిత్రీకరణ అన్ని విషయాల్లోనూ మిగిలిన సినిమాలకంటే భిన్నంగా ఉంటాయి ఆయన చిత్రాలు. ఇక ఆయన సృష్టించే పాత్రలు వాటిని చిత్రీకరించే తీరు కూడా వైవిధ్యమే. మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా తెరకెక్కించిన దళపతి అయినా.. విషాద ప్రేమకావ్యం గీతాంజలి అయినా, ఘర్షణ, దొంగ దొంగ, విలన్ ఇలా అన్ని సినిమాలూ ప్రత్యేకమే. అయితే ఆయన ఎంతో ఇష్టంగా రూపొందించిన ‘ఇరువర్’ సినిమా వీటన్నింటికంటే భిన్నం.
90ల లోనే బయోపిక్..
చారిత్రక ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించాలంటే ఎన్నో అవాంతరాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే క్రమంలో అందులో కొంత డ్రామా మిళితం చేయకతప్పదు. ఈ క్రమంలో ఎవరినీ నొప్పించకుండా, ఎవరి మనసు గాయపరచకుండా సినిమాను చిత్రీకరించాలి. తీరా ఇంతా చేసి సినిమాను రూపొందించినా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలియదు. ఇన్ని సవాళ్లు ఉంటాయి కాబట్టే.. చాలా మంది కల్పిత కథలను సినిమాలుగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటీవల బయోగ్రఫీల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులోనూ మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు ఆ కోవలోనివే. కానీ ఎప్పుడో 1997లోనే ఆ ప్రయత్నం చేశారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. ఆయన తెరకెక్కించిన ‘ఇరువర్’ చిత్రం ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’గా డబ్ అయి ఆకట్టుకున్నది. కమర్షియల్ లెక్కలు పక్కకు పెడితే ఈ చిత్రం గొప్ప భారతీయ సినిమాగా పేరు తెచ్చుకున్నది.
పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్ తమిళనాట ఎంతటి ప్రభావశీలురో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్ ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కరుణానిధి, ఎంజీఆర్ గొప్ప స్నేహితులు కూడా. వీరి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే ఇరువర్. ఈ చిత్రం వీరి జీవితాల్లోని కొన్ని ముఖ్య ఘటనల ఆధారంగా తెరకెక్కినదే అయినా.. ఆనాటి తమిళ రాజకీయ పరిస్థితికి దృశ్య రూపాన్ని ఇచ్చింది. స్వాతంత్ర్యం అనంతర కాలంలో ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీదే హవా. అగ్రవర్ణాల వాళ్లే లీడర్లుగా ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితులను తమిళనాట అన్నాదురై, కరుణానిధి ఎలా మలుపుతిప్పారో.. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టేందుకు ఎలా ప్రయత్నించారో ఈ సినిమాలో మనకు అంతర్లీనంగా తెలుస్తుంది.
ఈ సినిమా అర్థం కావాలంటే..
ఒక సినిమా సక్సెస్ కావాలంటే.. 2.30 గంటల పాటు ప్రేక్షకుడిని పక్కకు కదలనీయకుండా చేయాలంటే ఆ చిత్రంలో దృశ్యం, మాటలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుడిని కట్టిపడేయాలి. అప్పుడే సినిమా విజయవంతమైనట్టు లెక్క. సరిగ్గా ఇరువర్ సినిమాలోనూ అదే జరిగింది. ఈ మూడు అంశాలు ఈ చిత్రాన్ని శిఖరస్థాయిలో నిలబెడతాయి. రాజకీయాల్లో సహజంగా ఎటువంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఉంటాయో అవే ఈ సినిమాలోనూ ఎంతో సహజంగా చూపించారు. సినిమా హీరో కావాలనుకొనే ఓ యువకుడు, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసి.. ఈ సమాజాన్ని మార్చాలి అనుకొనే మరో రచయిత స్నేహితులయ్యాక ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి వారి జీవితాల్లో చోటుచేసుకున్న ఘటనలు ఏమిటి? అన్నది సినిమాలో చూపించారు.
ఇక తమిళ రాజకీయాలు తెలియని వారికి, అవగాహన లేని వారికి ఈ సినిమా అర్థం కాదు. సినిమా అర్థం కావాలంటే ముందుగా తమిళనాడులోని రాజకీయపరిస్థితిని ప్రాథమికంగా అవగాహన చేసుకోవాలి. పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్ గురించి కొంత తెలుసుకొని సినిమాను చూస్తే కచ్చితంగా మనసులను హత్తుకుంటుంది. హృదయాన్ని ద్రవింపజేస్తుంది. మోహన్‌లాల్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, నాజర్ అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. టబు కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కొన్ని సందర్భాల్లో మోహన్ లాల్ (ఎంజీఆర్), ప్రకాష్ రాజ్ (కరుణానిధి) మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయి. సాహితీ వేత్తలు రాజకీయనేతలైతే అక్కడి ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం ఏమిటో తెలుస్తోంది. తమిళనాట జరిగింది అదే.. సినిమాలో మోహన్ లాల్, ఆనంద్ అనే సినీ హీరో పాత్రను.. ప్రకాశ్ రాజ్ సమరసూర్యం అనే రచయిత పాత్రను పోషించారు. అయితే ఈ ఇద్దరి మధ్య స్నేహం, అభిప్రాయభేదాలు అందుకు దోహదం చేసిన పరిస్థితులు ఇవన్నీ ఎంతో సహజంగా చిత్రీకరించారు మణిరత్నం.
మణిరత్నం సినిమాలన్నింటిలోనూ.. సంగీతం, సాహిత్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాత్రల రూపకల్పన అసాధారణంగా ఉంటాయి. ఆయన సృష్టించుకున్న పాత్రలకు నటులను ఎంపికచేయడంలోనే సగం సక్సెస్ సాధిస్తుంటారు మణిరత్నం. ఇక కెమెరా పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. ప్రకృతిని.. సహజ సిద్ధమైన సన్నివేశాలను చిత్రీకరించే తీరు.. అందుకు వాడే బీజీఎం మనసులను కట్టిపడేస్తాయి. ఇక ఇరువర్ సినిమా కూడా.. మొదటి సన్నివేశం నుంచి తల పక్కకు తిప్పనివ్వదు. కొన్ని సన్నివేశాల్లో ప్రకాశ్ రాజ్ నటన ఉచ్ఛస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా..
''నాకు విజయమాల వేసిన ఆ కరమెక్కడ? నా వేడి కన్నీళ్లు తుడిచిన ఆ వేళ్లెక్కడ? కొత్త వేణువు స్వరంలా వినిపించే కోయిల గొంతెక్కడ? ముద్దుగా నా పదును మాటలు పలికిన ఆ పెదవులెక్కడ? నన్ను అలనాడు ఎత్తి మోసిన ఆ యువ భుజాలెక్కడ? నాకు ఇక కనబడవా మిత్రమా.. నువ్వుగింజంత కూడా ఇప్పుడు ద్వేషమే లేదు... మొలకంత కూడా ఇప్పుడు పగే లేదు... మనసు పవిత్రమవ్వడానికి మార్గం మరణమొక్కటేనా? మిత్రమా'' అంటూ ప్రకాశ్ రాజ్ కన్నుమూసిన మిత్రుడి (ఎంజీఆర్)ని తలుచుకుంటూ మాట్లాడిన... మానవ జీవితాన్ని తాత్వీకరించిన అతి గొప్ప డైలాగ్‌తో ఇద్దరు సినిమా ముగుస్తుంది.
అరవింద్ రెడ్డి
81793 89805