ఇంటర్ ప్రవేశాల్లో కార్పొరేట్ల ఇష్టారాజ్యం

In inter admissions, corporate colleges are behaving on a whim

Update: 2024-03-29 00:15 GMT

ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియకముందే వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించేశారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వారు. విద్యను వ్యాపారంగా చేసి ఆఫర్ల పేరుతో ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే 30 నుండి 50% రాయితీ ఉంటది, భవిష్యత్‌లో ఎలాంటి అదనపు ఫీజు ఛార్జీలు ఉండవంటూ విద్యార్థినీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభానికి మూడు నెలల ముందే కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల వారు ముందస్తు ప్రవేశాలకు తెరలేపాయి. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్ష రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ విద్యార్థులకు సీటు రిజర్యు చేస్తున్నాయి. నిబందనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నా,అడ్మిషన్లు ప్రారంభం అని ప్రచారాలు చేస్తున్న అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

కార్పొరేట్ కళాశాలలు,పాఠశాలలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ప్రధాన పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో పీఆర్ఓలను నియమించుకున్నాయి. వీరు పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రులను మచ్చిక చేసుకొని ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ముందస్తు ప్రవేశాలకు మాత్రమే ఫీజులో రాయితీ ఉంటుందని నమ్మబలుకుతూ కనీసం 60 శాతం ఫీజును ముందే తీసేసుకుంటున్నారు. ఆ మాత్రమైనా చెల్లించకపోతే ఐడీ నెంబర్ రాదని భయపెడుతున్నారు.ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు అడ్మిషన్లు అయిపోయాయి అని బోర్డ్‌లు కూడా పెట్టాయి.

భారీగా ఫీజు వసూళ్లు..

నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. పాఠశాలల్లో ఎల్‌కేజీకే లక్ష రూపాయల పైన ఫీజు, అడ్మిషన్ ఫీజు 20 వేలు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు యూనిఫామ్, ఇతర స్టేషనరీ వస్తువుల పేరుతో లక్ష వరకు దండుకుంటున్నారు. ఎంపీసీ ,బైపీసీ (ఐఐటీ, నీట్) పేరుతో ఏడాదికి డే స్కాలర్ విద్యార్థికే రూ.90 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఫీజులు నిర్ణయించారు. ఇదే గ్రూప్ విద్యార్థులు ప్రత్యేక క్యాంపస్ హాస్టల్ అని చదువుకోదలిస్తే ఒక్క సంవత్సరానికే రూ.2.50,000 లక్షల వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లో రెండు సంవత్సరాల ప్యాకేజీ పేరుతో 6 లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వైనం. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్ సివిల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ సుమారు రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్స్ సీఏ,ఇతర పేర్లు జోడించి రూ.2 లక్షలకు పైనే డిమాండ్ చేస్తున్నారు.

ఉక్కుపాదం మోపాలి..

అడ్మిషన్ల కోసం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక పాఠశాలల్లో, ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేశాక ప్రవేశాలు తీసుకోవాలి. అంతవరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. అడ్మిషన్లు తీసుకోవద్దు పీఆర్‌వో‌ల ద్వారా అడ్మిషన్లు చేసుకోకూడదు. కానీ పాఠశాలల వారు, ఇంటర్ కళాశాలల వారు నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు అడ్డగోలు ప్రచారానికి తెరలేపుతున్నారు. తోక పేర్లతో, అడ్మిషన్లు ప్రారంభమంటూ, అనుమతి లేని ప్రాంతాలల్లో విద్యాసంస్థల నిర్వహణ పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో , కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్న అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడరు. వాటిపై చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు

కార్పొరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న విద్యా దోపిడిని అరికట్టాలి. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాఠశాలలను, కళాశాలలను తనిఖీ చేసి వారి సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను, కళాశాలలను సీజ్ చేయాలి. నిత్యం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల‌పై అధికారుల పర్యవేక్షణ ఉంటే వారు నిబంధనలు పాటిస్తారు కానీ అధికారులు చూసి చూడనట్లు వత్తాసుగా వ్యవహరించడం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలవారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు ప్రచారం, అడ్మిషన్లు నిర్వహిస్తు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపాలి.

-కసిరెడ్డి మణికంఠ రెడ్డి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

75695 48477

Tags:    

Similar News