కులగణనలో.. తెగల గణన అనివార్యం

In caste census, enumeration of tribes is inevitable

Update: 2024-03-05 00:45 GMT

కరోనా నుండి కష్టాలు ఎదుర్కొన్న వారు గిరిజనులు. వీరి జనాభా నేటికీ నికరంగా లేదు. అంతరిస్తున్న గిరిజన ఆదిమ జాతుల జనాభా తెలియాలంటే త్వరలో కులాలవారీగా గణన చేసే క్రమంలో గిరిజనులను తెగల వారీగా జరపాలి. వీరిని తెగలవారీగా గణించడం ఒక సామాజిక న్యాయం. మతపరంగా చూస్తే ఆదివాసులది ప్రత్యేక 'ఆదివాసి' ధర్మంగా పరిగణించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం పరిశీలించాలి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలలోని అసమానతలను సరిదిద్దడానికి కులాలవారీగా జనగణన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణహించడం హర్షదాయకం. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆదివాసీ మేధావులతో 2018లో జరిగిన జాతీయ ఆదివాసీ ధర్మ సాంస్కృతిక సమావేశంలో తమకు ప్రత్యేక మతం కావాలని తీర్మానించింది. ఆదివాసుల సంస్కృతిని ప్రత్యేక ధర్మంగా గుర్తించి త్వరలో చేపట్టబోయే కులగణనలో గిరిజన తెగలను సూచించే ఒక పట్టిక ప్రవేశపెట్టాలి. గతంలో చేసిన ఉమ్మడి గణన నుండి గిరిజనుల్లో ఆదిమ తెగల (పీటీజీ) గిరిజనులు అభివృద్ధి ఫలాలు అందుకోలేక నష్టపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని 35 తెగలలో నిర్దిష్టంగా ఏ తెగలో ఎంతమంది జనాభా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరించే తెగలపై స్పష్టత కొరవడుతోంది. ప్రస్తుతం వీరిది మెజారిటీ 35 తెగలుగా భిన్న సంస్కృతుల సమ్మేళనం.

తెగలను జన గణనలో ఎత్తేశారు

రాజ్యాంగం 342 అధికరణ 25వ నిబంధన ప్రకారం కొండ ప్రాంతం లేదా అటవీ ప్రాంతంలో నివసించేవారే గిరిజనులు. సంస్కృతి పరంగా వీరి జీవనశైలి మైదాన ప్రాంత, కులవృత్తులవారి కంటే విభిన్నం. అందుకే వీరి జనాభాను 1961 నుంచి 2001 వరకు జరిగిన జనగణనలో గిరిజన తెగలుగా లెక్కించారు. కానీ 2011 వీరిని ఒకే తీరుగా గణించారు. అది సమంజసం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు నిమ్న వర్గాలకు రక్షిత ఆదివాసీ ప్రజలకు నేరుగా చేర్చే ధ్యేయంతో ఉన్న ప్రభుత్వం చేసే ఈ గణన శాస్త్రీయం కాబోదు. తెలంగాణలోని 19, ఆంధ్రాలోని 16 తెగలను మైదాన, ఏజెన్సీ గిరిజనులుగా ప్రభుత్వం పరిగణించాలి. మైదాన ప్రాంత గిరిజనులను 1976 - 2011 మధ్య గిరిజన జాబితాలో కలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా అమాంతం పెరిగింది. అధిక ప్రయోజనాలు వారికే దక్కుతున్నాయి. రాజ్యాంగంలో పూర్వ తెగలకే ప్రత్యేకించి నప్పటికీ గిరిజనులలోనే ఏర్పడే ఈ అంతరం ఇబ్బందులు సృష్టిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోని 5,948 ఏజెన్సీ గూడేలలోని ఆదివాసులకు ఇది భంగపాటు!

వలసలతో ఏజెన్సీలో మంటలు

జనాభా గణాంకాల (2001 నాటి) ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగల జనాభా 50,24,104 (6.59 శాతం). ఇందులో 30 తెగల మొత్తం జనాభా 20,46,653. మూడు మైదాన తెగల నుంచి 20,77,947 మంది నమోదయ్యారు. 2003లో నక్కల/ కుర్వీకరన్, ఫైకో, ధులియా/ పుతియా తెగలు కలిసి 35 షెడ్యూల్డ్ తెగల సమూహం ఏర్పడింది. ఇలాంటి ఇతర కులాల చేరికలతో, మరోవైపు వలసలతో ఏజెన్సీ అట్టుడుకుతోంది. జనగణన తెగలవారీ చేపట్టకపోతే అంతరించిపోయే ఆదిమ తెగల గురించి తెలిసే అవకాశం లేదు. రోనా, రేనా, కట్టునాయకన్, కొండరెడ్లు, భిల్లులు, అంద్, తోటీల సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోంది. శిశుమరణాలు, పోషకాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. కొత్తగా కరోనా వైరస్ రూపేణా సంక్షోభం దాపురించింది. ఈ దశలో తెగల జనాభా గణాంకాలు అసమగ్రంగా, అశాస్త్రీయంగా ఉంటే గిరిజన ఉపప్రణాళిక నిధులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఏజెన్సీ వారికి ప్రత్యేకించిన పీసా చట్టం, 1/70 చట్టం, విద్య ఉద్యోగ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయగలుగుతారు? ఈ పరిణామాలన్నీ ఆదివాసుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి.

స్వయం ప్రతిపత్తితోటే 'అస్తిత్వం'

2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి గిరిజనుల జనాభా మొత్తం 59,18,073. ఇందులో తెగలవారి వివరాలు లేవు. కొన్ని తెగలలో అంతరించిపోతున్న ఆదివాసుల బాగోగుల వివరాలు తెలియకుంటే వారి భవిష్యత్తు చీకటిమయమవుతుంది. వారికి రిజర్వేషన్లు దక్కక అణగారిపోతారు. మైదాన గిరిజనులతో, గిరిజనేతరులతో పోటీపడలేని ఏజెన్సీ వారికి ఈ పరిస్థితి తలెత్తకుండా పాలకులు చూడాలి. గ్రామ పంచాయతీల వారీగానైనా 50 పడకల ఆస్పత్రులు నెలకొల్పితే గిరిసీమలూ ఆరోగ్య భారతంలో మిళితమవుతాయి. నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసి వారు సాగుచేసే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల చిరకాల వాంఛ అయిన వారి ప్రాంతాల్లో 'స్వయం ప్రతిపత్తి' కల్పిస్తే మూల వాసుల జీవన విధానం మెరుగుపడుతుంది. వారి భావి అస్తిత్వం నికరంగా ఉంటుంది.

గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక

94913 18409

Tags:    

Similar News