సీఐడీనా!! జెఐడీనా?

In Andhra Pradesh, CID department converted into jagan investigation department

Update: 2023-09-14 00:45 GMT

భారతదేశంలో నైపుణ్య మానవ వనరులను పెంపొందించి ప్రపంచ దేశాలతో పోటీగా నిలపాలని, నిరుద్యోగులకు, వివిధ వర్గాల వారికి నైపుణ్య అభివృద్ధి చేసి, ఉద్యోగ కల్పనకు సాయం చేసి, ఆదాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అధిక వృద్ధి రేటు సాధించి దేశ పురోగతికి దోహదపడాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్)ను మే 2014న ఏర్పాటు చేశారు. ఈ మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం నిధులు కూడా అందుబాటులోకి తెచ్చారు..కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సమర్థవంతంగా వినియోగించి రాష్ట్రంలో యువత నైపుణ్యాభివృద్ధికి, ఎంటర్ ప్రెన్యూర్షిప్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 లో జీఓ నెం.1755 ద్వారా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ శాఖను ఏర్పాటు చేశారు.

తదనంతరం రాష్ట్రంలో యువతకు కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు అందించి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి రక్షణ కల్పించడమే లక్ష్యంగా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అప్పటికే అమలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అధికారులు అధ్యయనం చేసి సిఫార్సు చేసిన మీదట గుజరాత్‌తో పాటు ఏడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిమెన్స్ సాఫ్ట్వేర్ అండ్ డిజైన్ టెక్ సంస్థలతో అవే షరతులపైన, అదే మొత్తానికి 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్-డిజైన్ టెక్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం ద్వారా (జీఓ ఎం ఎస్ నెం 4 ఆఫ్ ఎస్ డి‌ఈఐ డిపార్ట్మెంట్ తేది 30.6.2015) రూ.3,300 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా, మిగతా 90 శాతం భాగస్వామ్య టెక్ సంస్థలు చెల్లించాలి.

కుట్రదారుడిగా చూపుతూ..

శిక్షణ పొందే వారికి ప్రయోగశాలలు, తరగతి గదులు, వసతి సదుపాయం కల్పించే విధంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐదు నైపుణ్య శిక్షణా కేంద్రాలు కలిపితే ఒక క్లస్టర్ కాగా, అటువంటి ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్ట్ కాలం పది సంవత్సరాలలో సీమెన్స్ కంపెనీ మూడేళ్ల శిక్షణతో పాటు ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది, హోస్టింగ్ సంస్థలు తదుపరి ఏడు సం.ల పాటు ప్రాజెక్ట్ బాధ్యతలు నిర్వహించాలి. ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయడానికి (జీఓ.నెం 8 dt 15.10.2015) నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.కృష్ణారావు పలువురు ఐఏఎస్ అధికారులు, నిపుణులతో రెండు పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. 2015 నవంబర్ 5, 6 తేదీలలో నిపుణుల కమిటీ బృందం గుజరాత్ లోని సీమెన్స్ కేంద్రాలను సందర్శించి, సమగ్ర అధ్యయనం చేసి 2015 నవంబర్ 7వ తేదీన సవివరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తూ నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేసింది.

అప్పటి స్కిల్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారికి రూ. 30 లక్షలు కన్సల్టెన్సీ ఫీజు చెల్లించి ఒక క్లస్టర్ నెలకొల్పడానికి అయ్యే ఖర్చు రూ.550 కోట్లని నిర్ధారించుకుని ఆయనే రూ. 371.30 కోట్ల నిధులను నాలుగు విడతలుగా చెల్లించారు. చెల్లించిన ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల నుండి డ్రా చేసి హవాలా మార్గంలో తరలించారని,ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్న నిరాధార అభియోగాలతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కుట్ర దారునిగా చూపుతూ ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేశారు.

స్కాం జరగలేదని తెలిసినా..

క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను సందర్శించకుండా, పరికరాల విలువ కట్టకుండా ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని కాకమ్మ కథలు రిమాండ్ రిపోర్టులో పొందుపరిస్తే గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించక పోవడం దురదృష్టకరం. ఒప్పందం నిబంధనల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఈ మొత్తాన్ని వినియోగించారన్న విషయాన్ని, ఒప్పందం ప్రకారం మొత్తం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రావలసిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, పరికరాలు అన్ని అందాయని 2020 ఫిబ్రవరిలో నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండి ఆర్జా శ్రీకాంత్ డిజైన్ టెక్ వారికి అభినందన పత్రం ఇచ్చారన్న విషయాన్ని సీఐడి ఉద్దేశ్య పూర్వకంగా రిమాండ్ రిపోర్టులో ఎందుకు పేర్కొనలేదు? స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా ప్రాజెక్టు ప్రారంభం నుండి మార్చి 2020 వరకు 2,60,000 మందికి సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం జరిగింది, 72 వేల మందికి ఉద్యోగ కల్పన జరిగింది.

ఏపి స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని, పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను, మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున డిజి టెక్ కంపెనీ ఎండి ఖాన్ విల్కర్ ప్రకటన చేశారు. ఏపీ దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించి తమతో సంప్రదించలేదని, ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఏ విధమైన రాజకీయ కక్ష సాధింపు లేదని సమర్థించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం డిజి టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ఇచ్చిన వివరణపై దర్యాప్తు చేపట్టే దమ్ము ఉందా?

ఆధారాలు లేని కేసుకి అరెస్టా?

జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన కేసులో ఈడీ అరెస్టు చేసిన సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు చెందిన వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలలో నిధులు దుర్వినియోగం కాలేదని, 2,13,000 మంది నైపుణ్య శిక్షణ ఇచ్చారని, అందుకోసం 42 కేంద్రాలను నెలకొల్పారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని హైకోర్టు హితవు పలికింది. తమ అసంబద్ధ ఆరోపణలను సమర్ధించు కోవడం కోసం ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. గతంలో జీఓ నెం8కి సంబంధించిన నోట్ ఫైల్ పోయిందన్నారు, ఇప్పుడు జీఓ నెం 4 కు సంబంధించిన నోట్ ఫైల్ పోయిందంటున్నారు. దర్యాప్తు సంస్థల సౌలభ్యాన్ని బట్టి ఫైల్స్ పోతాయి మళ్లీ దొరుకుతాయా ఒకవేళ నోట్ ఫైల్ పోతే దానిపై విచారణ చేపట్టి,, బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేబినెట్ నోట్‌లో ఉన్నది మాత్రమే డిపార్ట్మెంట్ మెయిన్ ఫైల్‌లో ఉంటుంది, అదే ప్రామాణికం. అంతే కాని డిపార్ట్మెంట్ నోట్ ఫైల్ కాదు. ఒక వైపు ఫైల్స్ పోయాయంటున్నారు, మరో వైపు డబ్బు ఎటు మళ్ళించారో తెలియదంటున్నారు. కానీ ఏ విధమైన ఆధారాలు లేని కేసులో చంద్రబాబును దోషిగా చూపుతున్నారంటే రాజకీయ కక్షపూరిత చర్య కాక మరేమిటి?

మంత్రి మండలి నిర్ణయం మేరకు శాసనసభ ఆమోదం ప్రకారం బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. తరువాత సంబంధిత శాఖ ఆమోదంతో కార్పొరేషన్ అధికారులు ఆ నిధులను వినియోగిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు, నిధులను ఖర్చుపెట్టే అధికారం వారికి ఉండదు, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖ అధికారులదే. అటువంటిది నిధులు విడుదల చేసిన అధికారి ప్రేమ చంద్రారెడ్డి, ఒప్పందంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంరెడ్డిపై అభియోగాలు మోపకుండా నేరుగా మాజీ ముఖ్యమంత్రిపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధం. ఒకవేళ ఆర్థికశాఖ కార్యదర్శి సునీత సలహాలను పాటించలేదన్నా దానికి బాధ్యత వహించాల్సింది ప్రేమచంద్రారెడ్డి తప్ప ముఖ్యమంత్రి కాదు.

కుట్రపూరిత కట్టుకథ అల్లుతూ..

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చట్రంలో దేశంలో పాలన జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సుపరిపాలనకు బదులుగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగ పరచి ప్రత్యర్ధులపై గర్హనీయమైన రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో పింక్ డైమండ్, కోడికత్తి, బాబాయి హత్య లాంటి కట్టుకథల ప్రచారంలో, ప్రజలను వంచించి నమ్మించడంలో సిద్ధహస్తుడైన వాళ్ళు, నేడు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కొర్పొరేషన్‌లో అవినీతి జరిగిందనే మరో కుట్రపూరిత కట్టుకథ అల్లి, తప్పుడు ప్రచారంతో అక్రమ కేసు పెట్టి చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా అరెస్టు చేసి, రిమాండుకు పంపి పైశాచికానందం పొందుతున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) జగన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (జెఐడీ) గా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదకరమైన ఆటకు తెర తీశారు. ఇదే విధానాలు రాబోయే ప్రభుత్వాలు ఉపయోగిస్తే ఒక్క ప్రభుత్వాధినేత కూడా సక్రమంగా విధులు నిర్వర్తించలేరు. అన్యాయానికి తాత్కాలిక విజయం దక్కినా అంతిమ విజయం న్యాయానికి, ధర్మానికి దక్కుతుందనే సత్యం మహాభారతం రుజువు చేసింది. అధికారం శాశ్వతం అని రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తులో తగిన శాస్తి జరుగక తప్పదు.

లింగమనేని శివరామప్రసాద్

79813 20543

Tags:    

Similar News