అన్ని రాజకీయ పార్టీల్లోనూ.. వారసత్వం ఉంది!
In all political parties.. there is a legacy!
కుటుంబం అందరికీ ఉంటుంది. ఒక పెద్ద నేత ఉంటే ఆ కుటుంబంలో.. రాజకీయాల్లో కుటుంబసభ్యుల జోక్యం ఉండకపోవడం అనేది కల్ల! అది జరగని పని! ఇందుకు ఎవరూ అతీతం కాదు. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు, విమర్శిస్తున్నపుడు, తమని తాము ఒక్కసారి కాదు, వందసార్లు తొంగి చూసుకోవాలి అంటారు. చిత్తం వచ్చినట్లు, ఎట్లాబడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మొత్తం వారసత్వ రాజకీయాలు అనే బీజేపీ.. వారి ఎన్డీఏ సహచర గణంలో, బీజేపీలో పరిస్థితిని ఒక్కసారి పరికించి చూసుకోవాలి! అందులో ఉన్నంత పరివార్ వాద్ ఎక్కడ కూడా కనిపించదు. మొన్న ఇండిపెండెన్స్ డే నాడు పీఎం నరేంద్ర మోడీ పరివార్ వాద్ గురించి మాట్లాడినారు. ఆయన సహచరుడు దేశ హోమ్ మంత్రి అమిత్ షా కొడుకు నుంచి మొదలు.. కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, కర్ణాటకలో మాజీ సీఎం ఎస్ ఆర్ బొమ్మయి కొడుకు మాజీ సీఎం బొమ్మయి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుటుంబంలో ధర్మ ప్రధాన్ వీరిది అంతా పరివార్ వాద రాజకీయమే కదా!
విపక్షాల కన్నా ఎక్కువే!
అటు మహారాష్ట్ర సీఎం షిండే కొడుకు ఎంపీగా ఉన్నాడు. మాజీ మంత్రి నారాయణ్ రాణే, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, అనుప్రియ, ఎంపీ కైలాష్ తండ్రి ఆకాష్... వీరంతా ఎవరు? ఇది పరివార్ వాద్ కాదా? కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎవరు? మాజీ మంత్రి పాశ్వాన్ కొడుకు ఎంపీ చిరాగ్ పాశ్వాన్, మాజీ కేంద్ర మంత్రి మాధవరావ్ సింధియా కొడుకు ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మాజీ పీఎం చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్, గోపీనాథ్ ముండే కూతురు ఎంపీగా ఉన్నారు. సువెందు అధికారి కుటుంబంలో సుధీర్ అధికారి... ఇలా చెప్పుకుంటూ పొతే మిగతా విపక్షాల కన్నా ఎక్కువ ఫ్యామిలీ ప్యాక్ మనకు బీజేపీ, దాని సహచర పార్టీల్లోనే కనిపిస్తున్నది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అటు ఈశాన్యా రాష్ట్రాల్లోను, అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా తండ్రి వెంట రాజకీయాలలోకి వచ్చిన వారే ఉన్నారు. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకట్ స్వామి కొడుకులు కూడా తండ్రి వెంటే రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా పదవుల్లో ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ కూడా మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ వెంట వచ్చిన వారే, శరద్ పవార్ కూతురు సుప్రీయ ఎంపీగా, తమిళనాడు సీఎం చెల్లి కనిమొళి ఎంపీగా, ఆమె కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవన్నీ మన దేశ రాజకీయాల్లో ఉన్నాయి. ఎవరూ అతీతులు కాదు. ఇంకా చాలా మంది ఒకే కుటుంబ సభ్యులు చాలా పదవుల్లో ఉన్నారు. పీఎం నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు ఎవరూ ప్రధాన పదవుల్లో లేకపోవచ్చు, కానీ అయన పరివార్ వాద్ అంటూ కేవలం గాంధీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా విమర్శించడం జరుగుతున్నది.
వారసత్వ రాజకీయాలపై మాట్లాడేముందు..
రాహుల్ గాంధీకి జోడో యాత్ర ద్వారా పెరిగిన ప్రజా ఆదరణను బీజేపీ ఎదుర్కొలేని పరిస్థితిలో ఉంది. దీనితో అయన అది లాల్ ఖిలా కానీ, ఎన్నికల సభ కానీ, పరివార్ వాద్‌తో పాటు, అవినీతి, సృష్టికరణ్ మీదే మాట్లాడుతారు. ఇవే పీఎం డైలాగులు చర్విత చరణంగా ఉంటాయి. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అంటారు. అలాంటప్పుడు అవినీతి పరుడుగా మీరే పేర్కొన్న అజిత్ పవార్‌ను ఎన్సీపి నుంచి చీల్చి, ఎందుకు చేరదీసి పదవి ఇచ్చారో చెప్పండి మోడీజీ? ఈడీ కేసులను ఎదుర్కొంటున్న సువేందు అధికారిని, అసోమ్ సీఎం హేమంత్ బిస్వశర్మను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారు! ఏమిటి మీ రాజనీతి? కుటుంబ రాజకీయాలు వద్దు సరే! మీ మంత్రి వర్గం నుంచి ముందు అలాంటి వారిని తొలగించే సాహసం చేయగలరా? అందుకే మనం ఒకరి మీద దుమ్మెత్తి పొసే ముందు, ఆ దుమ్ములో కొంత కూడా మన మీద కూడా పడుతుందని గుర్తిస్తే మంచిది. రాజకీయ ఫ్యామిలీ ప్యాక్ అంత సులువుగా సమసి పోయేది కాదు, కొన్ని కుటుంబాలు ఈ దేశం కోసం త్యాగాలు కూడా చేసి ఉన్నాయి. ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినా పదవులకు దూరంగా ఉండడం మంచిది. అలా దూరంగా ఉన్నవారు లేకపోలేదు. పీపుల్ నుంచి పదవులకు దూరంగా ఉండడం వల్ల మంచి రెస్పాన్స్ ఉంటుంది. సమాజానికి ఒక ఆదర్శ సందేశం అవుతుంది! ఇందుకు గట్టి గుండె నిబ్బరం, సేవా, త్యాగ గుణం అవసరం. ఇందుకు పదవీ త్యాగాలు చేయాలి! రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటే గట్స్ అవసరం! ప్రస్తుతం అలాంటి వారు రాజకీయాల్లో అరుదని పేర్కొనక తప్పదు. తెలంగాణలో తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందుగలడు, అందులేడని, వెతుక్కోకుండా అన్నిచోట్ల, అన్ని పార్టీల్లో ఎందరో బంధు గణం కనిపించబోతున్నారు!
- ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు,
99518 65223