వచ్చే ఎన్నికల్లో.. నెగ్గేదెవరు.. తగ్గేదెవరు?

Update: 2024-05-28 01:15 GMT

ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంతవరకు విజయం వైపు తమ పార్టీ పయనించిందోనన్నది బీజేపీ అగ్ర నాయకత్వానికి సైతం అంతుపట్టడం లేదు. అందుకే న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నాటి పార్లమెంట్ ఎన్నికల ఉత్సాహం కానరావడం లేదు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో అధికార ఎన్డీఏకు, ఇండియా కూటమి సమానమైన పోటీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల పోలింగ్‌లో 486 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ ముగిసింది. ఇక ఏడో విడతలో కేవలం 67 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత ఆరో విడతలో పోలింగ్ జరిగిన 58 లోక్‌సభ స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53 చోట్ల పోటీ చేసి 40 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల బరిలో నిలిచి కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేక ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ గతంలో మాదిరి 40 స్థానాలను సాధించే పరిస్థితి లేదు. కొన్ని కీలక స్థానాల్లో ఆప్‌తో జతకట్టిన కాంగ్రెస్... అధికార పార్టీకి సవాల్‌గా మారింది.

బీజేపీలో కలవరపాటు..

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు, ఇండియా కూటమి సమానమైన పోటీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దశాబ్దాల పాటు నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించిన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి క్రమక్రమంగా కోల్పోతున్నట్లు నరేంద్ర మోడీకి ఎప్పటినుంచో సమాచారం ఉంది. ప్రస్తుత పోలింగ్ సరళిని చూస్తే.. ఎన్డీయే కూటమికి మొత్తంగా 220 నుండి 250 స్థానాలకు మించవని ప్రచారం సాగుతోంది. ఇదే ప్రధాన మంత్రి మోడీని కలవరానికి గురిచేస్తుంది.

మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోటలుగా భావించే కీలక నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం వైపు దూసుకుపోతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఆయన గడిచిన పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తం చేసి, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రజాస్వామ్యాన్ని ఏ మేరకు బలహీనపరిచారన్నది తన పాదయాత్ర ద్వారా దేశ ప్రజల దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్లగలిగారు.

ఉత్తరాదిలో హాంఫట్

ప్రధాని ప్రసంగాల్లో.. గతంలో మాదిరి ధీమా, ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మోడీ నాయకత్వంలోని బీజేపీకి అత్యధిక సీట్లను కట్టబెట్టాయి. ప్రస్తుత ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. 196 పార్లమెంట్ స్థానాలున్న ఈ నాలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం బీజేపీ 170 సీట్లను గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో, ఆ పార్టీ అధిక స్థానాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో మాదిరి సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మహారాష్ట్రలోను ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఇక కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో మాదిరి 26 పార్లమెంట్ స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశాలు లేవు. బీహార్‌లో బీజేపీ, జేడీయు నితీష్ కుమార్ కూటమికి భంగపాటు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ కూటమి ఈసారి 15 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టార్గెట్ దక్షిణాది ఫెయిల్

నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో సైతం కాంగ్రెస్ కూటమికి పది పార్లమెంటు స్థానాలు అలవోకగా వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కూటమికి సైతం గతంలో కంటే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం మసకబారితే ఆ పార్టీ అధికారానికి రావడం కష్టతరమని చెప్పవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి 30 పార్లమెంట్ స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నది ఆ పార్టీ అగ్ర నాయకులకు తెలియంది కాదు. ఉత్తరాదిలో జరగబోయే నష్టాన్ని దక్షిణాదిలో పుచ్చుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం గత మూడేళ్లుగా వ్యూహాత్మకంగా టార్గెట్ దక్షిణాది అంటూ చెమటోడ్చి పనిచేస్తున్నప్పటికీ, వారి ఆశలకు ప్రజా తీర్పుకు పొంతన ఉండే అవకాశాలు లేవు. పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఇచ్చిన హామీలకు ప్రజల ఆశలకు పొంతన లేదని చెప్పవచ్చు. ఉపాధి కల్పన, దారిద్ర నిర్మూలన, అభివృద్ధి, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామిక నిర్ణయాలు, అవినీతి నిర్మూలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు.

పాలనపై తీవ్ర అసంతృప్తి

గత పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ విఫలమైనట్లు ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు భావిస్తున్నారు. నల్లధనం ఏరివేత పేరుతో చేసిన పెద్దనోట్ల రద్దు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందంగా తయారైంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అటు ఉంచితే ఈ పదేళ్ల సుదీర్ఘ కాలంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో మోడీ ప్రభుత్వం పనిచేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. నరేంద్ర మోడీ కంటే ముందు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పులకు మూడింతల అప్పు నరేంద్ర మోడీ హయాంలో పెరిగిందంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేయడం, మత ఘర్షణలను రెచ్చగొట్టడం, పేదరికాన్ని మరింత పెంచడం, సంపన్నుల ఆదాయం అమాంతం పెరిగిపోతుండటం, పేదలు పేదలుగానే మిగిలిపోతుండడం పట్ల ఓటర్లలో ఆ పార్టీ పట్ల అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, 80 కోట్ల భారతీయులకు 5 కిలోల చొప్పున సబ్సిడీ బియ్యాన్ని అందిస్తామని ప్రధాని హామీ ఇవ్వడం దేశంలో తిష్ట వేసిన పేదరికానికి అద్దం పడుతుంది. ఏదెలా ఉన్నా రెండు పర్యాయాలు ఎన్డీయే కూటమికి అధికారాన్నిచ్చిన ఉత్తరాది ఓటర్లు ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా గద్దె దించుతారా అన్నది జూన్ 4న తేదీన తేలిపోనుంది.

సట్ల మురళీకృష్ణ

రాజకీయ విశ్లేషకులు

94411 74565

Tags:    

Similar News