వినాయక పూజలో ఉపయోగించే 21 రకాల పత్రలు వాటి ఉపయోగాలు..
హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగలో వినాయక పత్ర పూజకు
హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగలో వినాయక పత్ర పూజకు ఉపయోగించే 21 రకాల పత్రాలు ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు వల్ల, ఇవి సువాసనలు వెదజల్లడమే కాకుండా, కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల అవటం వల్ల ఇంటి ఆవరణలో ఉన్న సూక్ష్మ క్రిములు నశిస్తాయని, నవరాత్రులు పూర్తయిన తరువాత విగ్రహంతో పాటు ఆ పత్రులు నీళ్లలో కలపడం వల్ల ఆల్కలాయిడ్స్ విడుదలై నీటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా తగ్గి నీరు శుద్ధి అవుతుందని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. ఇంతటి ఆరోగ్యాన్ని చేకూర్చే 21 రకాల పత్రి పూజ ప్రత్యేకతలు, ఉపయోగాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మాచీ పత్రం- ఇది చామంతి జాతికి చెందినది. ఇది చర్మ వ్యాధులు, క్రిమి వ్యాధులు, జ్వరం, అజీర్ణం, అపస్మారక రోగాల నివారణకు పనిచేస్తుంది.
బిల్వ పత్రం- ఇది శివునికి అత్యంత ప్రీతికరమైనది. శివపుత్రుడైన వినాయకుడిని దీంతో పూజిస్తారు. దీనిని మారేడు అంటారు. ఇది మనిషికి మధుమేహ రోగాలు, అజీర్ణం, నొప్పులు, మూత్ర సంబంధ రోగాలు, ఉబ్బస వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది .
దుర్వాయుగ్మం- ఇది వినాయకుడికి ప్రీతికరమైనది. దీనిని తెలుగులో గరిక అంటారు. దీని కషాయం శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు దేహంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పైత్యాన్ని, తాపాన్ని కూడా తగ్గిస్తుంది.
శమీ పత్రం- దీనిని తెలుగులో జమ్మి పత్రం అంటారు. ఇది ఆయాసం, దగ్గు, చర్మ, దంత, మూలవ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
బృహదీ పత్రం- దీనిని నేల ములక అంటారు. దీనిలో చిన్న, పెద్ద ములక అని 2 రకాలుంటాయి. ఇది ఆకలి కలిగేందుకు, మలమూత్రాల విసర్జన ప్రక్రియకు ఇది ఉపయోగపడుతుంది .
దత్తూర పత్రం- దీనిని ఉమ్మెత్త అంటారు. ఇది వంకాయ జాతికి చెందినది. ముళ్లతో కలిగిన కాయలు తెలుపు, వంకాయ రంగు లో ఉంటాయి. ఇది మత్తును వేడిని కలిగించడంతో పాటు విషరోగ పుండ్లను తగ్గిస్తుంది. గదవలు, దద్దుర్లు, పేను కొరుకుడు నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
బదరీ పత్రం- దీనిని తెలుగులో రేగు అంటారు. ఇది శరీరానికి వేడిని కలిగించడం, విరేచనాలను అరికట్టడం, ముఖ్యంగా శరీర పుష్టికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
అపామార్గ పత్రం- దీనిని ఉత్తరేణి అంటారు. అపెండిసైటీస్ నివారణకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఉబ్బురోగాలు, నాలుక దోషాలు, పైత్యరోగాల నివారణకు దివ్యౌషధం.
తులసీ పత్రం- తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జ్వరాలు తగ్గించడం, కఫం, పొడి దగ్గు, అజీర్ణం తగ్గడంతో పాటు పలు రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది అన్ని మొక్కలకు భిన్నంగా రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
చూత పత్రం- దీనిని తెలుగులో మామిడి అంటారు. మామిడి ఆకుల కషాయం దంతవ్యాధులు నివారణకు, నోటిపూత, వికారం, రక్తస్రావం, అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కరి వీర పత్రం- దీన్ని గన్నేరు అంటారు. ఇది శరీరంలో ఉన్న విష గడ్డలు కరిగించేందుకు, రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, చిముడును తగ్గించడానికి, నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
దామిడీ పత్రం- దీనిని దానిమ్మ అంటారు. రక్త, నీళ్ల విరోచనాలు అరికట్టేందుకు, నోటి పూత తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
దేవదారు పత్రం- ఇది దేవతలకు అత్యంత ఇష్టమైనది. దీని మానుతో చెక్కిన విగ్రహాలకు సజత్వం ఉంటుంది. జ్వరాలు, శ్లేష్మ, గర్భాశయ రోగాలు, వాంతులు, విష దోషాలను ఇది పోగొడుతుంది.
మరువాక పత్రం- దీన్ని వాడుక భాషలో ధవనం అంటారు. ఇది ఎండినా మంచి సువాసన వెదజల్లుతుంది. క్షయ, పైత్య, వాత, పిత్త, శ్లేష్మాలను ఇది నివారిస్తుంది.
సింధువార పత్రం- దీనిని వావిలి అంటా రు. జ్వరాలు, ఉబ్బు వ్యాధులు, క్రిమి రోగాలు, అండ వాతాల వంటి రోగాల నివారణకు పనిచేస్తుంది.
జాజి పత్రం- ఇది నాలుక, దంతాలు, చెవి, ముక్కు సంబంధ వ్యాధులు, చర్మ రోగాల నివారణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
గండలీ పత్రం- దీనిని సంస్కృతంలో మతా క్షి అంటారు. జ్వరం, దాహం, మేహాలను ఇది తగ్గిస్తుంది.
అశ్వత్థ పత్రం- దీనిని రావి పత్రం అంటారు. మేహరోగాలు, జ్వరాలు, అతిసార, దంతరోగాల నివారణకు శరీర పుష్టికి ఇది ఉపయోగపడుతుంది.
అర్జున పత్రం- దీనిని తెలుగులో మద్ది అంటారు. హృదయ సంబంధ రోగాలు, మధుమేహ రోగాలు, గుండె జబ్బులు, జ్వరం, స్త్రీలకు రుతుస్రావ సంబంధ దోషాలు, మొండి కురుపులు, నివారించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
అర్కపత్రం- దీనిని జిల్లేడు అంటారు.. దీనిలో తెల్ల జిల్లేడు, వంకాయ రంగు జిల్లేడు అని రెండు రకాలయంటాయి. తెల్ల జిల్లేడుతో చేసిన వినాయక విగ్రహాన్ని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. వేడిని కలిగించేందుకు, సుఖవ్యాధులు, ఉదర సంబంధ రోగాలు, బోదకాల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
విష్ణుకాంత పత్రం - ఇది జ్వరం, విరోచనాల నివారణకు, ఉబ్బస వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.
సి.ఎన్. మూర్తి
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
83281 43489