మతంలో.. ప్రభుత్వ జోక్యం అవసరమా!?

Implementation Of Uniform Civil Code In India is correct?

Update: 2023-07-11 00:30 GMT

దేశవ్యాప్తంగా మరోసారి ‘ఉమ్మడి పౌరస్మృతి’ కి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. ‘పరివార్’ కనుసన్నలలో కేంద్ర న్యాయ శాఖ రూపొందించిన ఒక ప్రశ్నావళిని తీసుకొని ‘లా కమిషన్’ మరోసారి ప్రజల ముందుకు దీన్ని తీసుకొచ్చింది. జులై 14 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్‌కు తెలియజేసేందుకు సమయం ఇచ్చింది. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజల వద్దకు పోవడానికి ఏ అంశమూ మిగిలి లేనందున బీజేపీ సర్కార్ ఈ తేనెతుట్టెను కదిపినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల సమయంలో ప్రజల భావోద్రేకాలను రెచ్చగొట్టడానికి బాబ్రీ మసీదు లాంటి బలమైన అస్త్రమేదీ అమ్ముల పొదిలో లేని కారణంగా ‘ఉమ్మడి పౌరస్మృతి’ని ఆయుధంగా మలచుకొని రాజకీయ లబ్ధి పొందాలన్నది బీజేపీ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.

ప్రజల దృష్టి మళ్లించడానికి…

నిజానికి నేడు మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. లెక్కకు మిక్కిలి సమస్యలతో దేశం అతలాకుతలం అవుతుంటే, ఒక మతపరమైన, సర్వామోదం కానటువంటి అనవసరమైన అంశాన్ని పట్టుకొని దేశంలో రచ్చ చేయాల్సిన అవసరమేమిటి? ఒకవైపు నిరుద్యోగం, అధిక ధరలతో యువత, మధ్యతరగతి పౌరులు అల్లాడుతుంటే, మరోవైపు రెజ్లర్ల ఆందోళన, అన్నదాతల ఆక్రందన, మణిపూర్ మంటలు దహించి వేస్తుంటే దేశ ప్రధాని నోట ఒక్క మాట కూడా వెలువడలేదు. కానీ ‘యూనిఫాం సివిల్ కోడ్’(uniform civil code) విషయంలో మాత్రం తలా తోకా లేని ఉదాహరణలతో ఉపన్యాసాలు తన్నుకొస్తున్నాయి. మా గోడు వినండి, మా కనీస అవసరాలు తీర్చండి, మా హక్కులు మాకివ్వండి మహాప్రభో అని తప్ప, ఉమ్మడి పౌరస్మృతి(UCC) కావాల్సిందేనని ఎవరైనా రోడ్లెక్కి డిమాండ్ చేస్తున్నారా? మరి ఎందుకు దీనిని దేశంలో అమలు పరచాలనుకుంటున్నారు? ఎన్నోకులాలకు. మతాలకు, వర్గాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఏకపక్షంగా ఉమ్మడి పౌరస్మృతిని అందరిపై రుద్దాలని చూడడం ఎంతవరకు సమంజసం? భారత రాజ్యాంగంలో ఒక్క 44వ అధికరణ మాత్రమే కాదుగదా.. ఇంకా ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగంలోనే 25వ అధికరణ(Article 25) అయిన ‘మతపరమైన స్వేచ్ఛ, వృత్తి అభ్యాసం’ ఉందన్న విషయం మర్చిపోకూడదు కదా?

నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి తన పట్టు నిలుపుకోవడం కోసం కొట్టుకుంటున్న సెల్ఫ్ డబ్బా సరిగా మోగకపోవడంతో, 2018 లో లా కమిషన్ అవసరం లేదని మూలన పడేసిన ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్న విషయాన్ని మనం గమనించాలి. అభివృద్ధి నినాదంతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మోదీ ప్రభుత్వం(modi government) కర్ణాటక ఎన్నికల్లో చావు దెబ్బతిని, తలబొప్పి కట్టించుకొని, అన్ని రంగాల్లో విఫలమైన నేపథ్యంలో, మైనారిటీ వర్గాలను టార్గెట్‌గా చేసుకొని ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రణాళికా బద్దంగా ఎంచుకున్న అంశమే ఉమ్మడి పౌరస్మృతి అన్న అనుమానం సహజంగానే కలుగుతోంది.

ఆ రాజ్యాంగ హామీకి అర్థం ఉందా?

నిజానికి భారతదేశంలో వందలాది సంవత్సరాలుగా ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. వివాహాలు, విడాకులు, ఆస్తిపాస్తులు, వారసత్వం తదితర విషయాల్లో వారి వారి మత ధర్మాల ప్రకారం, వారి వారి సాంప్రదాయక ఆచార నియమానుసారం నడుచుకునే సంపూర్ణ స్వేచ్ఛ, అధికారం వారికి ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఎవరికి వారి ‘పర్సనల్ లా’ ఉన్నాయన్నమాట. అయినప్పటికీ ముస్లిం పర్సనల్ లాను మార్చాలని, ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని దేశంలో పరివార్ శక్తులు పెద్ద ఉద్యమాన్నే ప్రారంభించాయి. నామ మాత్రంగా నైనా సరే ముస్లింల ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్న పర్సనల్ లాను లేకుండా చేసి, రాజ్యాంగ ప్రసాదితమైన ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాల రాయాలన్నది పరివార్ శక్తుల కుటిల పన్నాగం. నిజానికి భారత రాజ్యాంగంలోని 25వ అధికరణ చాలా స్పష్టంగా 'ప్రజలందరికీ సమానంగా భావ ప్రకటనా స్వాతంత్ర్యం ఉంటుంది. తమకు నచ్చిన మతాన్ని స్వేచ్చగా స్వీకరించే, దాన్ని అవలంబించే, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికి ఉంటుందని మత స్వాతంత్ర్యానికి సంబంధించిన ఈ అధికరణ ప్రకారం, ఏదైనా ఒక వర్గానికి చెందిన మత స్వాతంత్ర్యాన్ని హరించి, తన మత బోధనలకు వ్యతిరేకంగా ఆచరించాలని బలవంత పెట్టే ఎలాంటి కోడ్‌కూ అవకాశం ఉండకూడదు. ఒకవేళ అలా జరిగితే అది నేరుగా మతంలో ప్రభుత్వ జోక్యం కిందికే వస్తుంది. అంటే, ప్రజలందరికీ తమ మత ధర్మాన్ని అవలంబించుకునే పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయన్న రాజ్యాంగ హామీకి అర్థం లేకుండా పోతుంది.

రాజ్యాంగంలోని ఇంత ముఖ్యమైన, ప్రధానమైన ప్రాథమిక హక్కును చాటి చెబుతున్న 25వ అధికరణను విస్మరించి, నిర్దేశిక నియమానికి సంబంధించిన 44వ అధికరణను మాత్రమే పట్టుకోవడం నిజంగానే విచిత్రం. ఎందుకంటే 44 వ అధికరణ లాంటి ఆదేశిక సూత్రాలు(directive principles) రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం కూడా అటువంటి ఆదేశిక సూత్రాల్లోనిదే కదా! మరి ఎన్ని రాష్ట్రాలు దీనిని అమలు పరుస్తున్నాయి? కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నైనా మద్యపాన నిషేధం అమలవుతోందా? దీన్ని ఏ వర్గమూ అడ్డుకోవడం లేదు కదా! కేవలం మతధర్మాల విషయంలోనే ఎందుకీ ద్వంద్వ వైఖరి?

దేశాన్ని కాషాయీకరించడానికి…

నిజానికి యూనిఫాం సివిల్ కోడ్ అనేది కొంతమంది అపోహ పడుతున్నట్లు కేవలం ముస్లింల సమస్య కాదు. ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సహా, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బుద్దులు, పార్శీలు, లింగాయత్‌లు ఇలా ఎన్నో వర్గాల వారి సమస్య. అందుకని మన ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి. ఏదో ఒక రకంగా సమాజంలో విద్వేష వాతావరణాన్ని సృష్టించి, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలని చూసేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు దీరాక రాజ్యాంగ పదవుల పవిత్రతను కూడా లెక్కచేయకుండా, దేశ లౌకిక పునాదులను పెళ్ళగిస్తూ, దేశాన్ని కాషాయీకరించడానికి మతోన్మాద శక్తులు నిస్సిగ్గుగా తెగబడటం మనం చూస్తున్నాం. విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు, లౌకికవాదులు ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులను ఓ కంట గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సున్నితమైన, మతపరమైన అంశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి, మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణకు, దేశ లౌకిక విలువల వారసత్వ సంపదకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవలసిన అవసరముంది. విభిన్న కులాలు, మతాలు, విభిన్న ఆచార సంప్రదాయాలతో విలసిల్లుతున్న నందనవనం లాంటి భారతదేశంలో సర్వజన, సర్వమత ఏకాభిప్రాయం రానంతవరకూ 'కామన్ సివిల్ కోడ్ 'ను కోరుకోవడమంటే, దేశ శోభను, సౌందర్యాన్ని, దాని ఔన్నత్యాన్ని తక్కువ చేయడమే. కనుక అప్రాధాన్యమైన, సున్నితమైన, పరివార్ భావజాలికులు తప్ప మరెవరూ కోరుకోని అంశాలను పక్కన పెట్టి తక్షణ సమస్యలపై దృష్టి సారిస్తే దేశానికి మేలు కలుగుతుంది.

యండి. ఉస్మాన్ ఖాన్

సీనియర్ జర్నలిస్ట్

99125 80645

Tags:    

Similar News