అమలుకు సాధ్యమయ్యే.. మేనిఫెస్టో!

Implementation of BJP manifesto is possible.. !

Update: 2023-11-21 01:00 GMT

రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. అయితే వీటిలో ఒక్కో పార్టీ మేనిఫెస్టో ఒక్కో రకంగా ఉంది. ఎన్నికల రణరంగంలో ఈ మేనిఫెస్టోలు కూడా కీలక పాత్ర వహిస్తాయి. అయితే అవి కేవలం ప్రకటనలకే కాకుండా అమలు అయ్యే విధంగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. కానీ పార్టీలు ఇవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రకటించడం బాధాకరం. అయితే, అందరికీ భిన్నంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అంశాలు మాత్రం కొంతవరకు అన్ని రకాల ప్రజలకు ఆమోదయోగ్యంగా, అమలుకు సాధ్యమయ్యేలా ఉన్నాయని అర్థం అవుతుంది.

జనతా మేనిఫెస్టో

కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో మంత్రులుగా ఓబీసీలను నియమించింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. అదే విధంగా జాతీయ ఓబీసీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా కల్పించి బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకుంది. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ లేడు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారికి డిక్లరేషన్లు, కార్పొరేషన్లు ప్రకటిస్తుంటే, బీజేపీ వారిపై ఉన్న నిబద్ధతను చాటింది. బీసీ ముఖ్యమంత్రితో పాటు, అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీగా జనాల్లోకి వెళ్లింది. ఈ సాహసం ఏ పార్టీ చేయలేదు.

సాధారణంగా పార్టీల మేనిఫెస్టోలో అన్ని రంగాలకు సంబంధించిన అంశాలతో పాటు, ఎక్కువగా ఉచితాలు ప్రకటిస్తుంటాయి. కానీ బీజేపీ సమాజానికి అతి ముఖ్యమైనటువంటి విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ విషయం. అలాగే డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి ఉచిత లాప్టాప్స్, ఆరునెలలకోసారి టీఎస్‌పీఎస్సీ పరీక్షలు, పంటకు మద్దతు ధర, పెట్టుబడికి సాయం, ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నవజాత బాలికలకు రెండు లక్షల ఫిక్స్ డిపాజిట్, పెట్రోల్ రేటు తగ్గింపు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, డ్వాక్రా సంఘాలకు ఒక శాతం వడ్డీ, ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేయడం వంటి ఆచరణ సాధ్యమయ్యే అంశాలే ప్రకటించడం ఒక ప్రత్యేకత. అలాగే రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, చరిత్ర పరిరక్షణ అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించడం ఆహ్వానించదగ్గ అంశం.

చివరగా భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఈ అంశాలు, కేంద్ర విధానాలు, పథకాలు, మోదీ చరిష్మా, రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధి పనులు, నిరాడంబరత మేనిఫెస్టోతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోటీలో ఉండి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చు. ఒకవైపు వైపు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, ఎక్కువ సీట్లు కేటాయింపు, బీసీ ఓటర్లను, యువ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. ఇతర పార్టీల మాదిరిగా ఓట్ల కోసమే మాత్రమే కాకుండా, బీజేపీ మేనిఫెస్టో సకల జనుల గ్యారంటీ మేనిఫెస్టోగా ఉండటం ఆ పార్టీకి అనుకూలించే విషయాలు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలో వస్తే మోడీ గ్యారంటీలతో అభివృద్ధి చేస్తారని రాష్ట్ర నాయకులు ధీమాగా మేనిఫెస్టోని జనాల్లో తీసుకేళ్లగలిగితే ఎక్కువ సీట్లని గెలవవచ్చు.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్

sravankuc@gmail.com

Tags:    

Similar News