అక్రమ కేసులే.. అంతిమ లక్ష్యం!

Illegal cases against Chandrababu are the ultimate goal of YCP!

Update: 2023-11-08 00:15 GMT

ధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా మారింది. గడచిన నాలుగున్నరేళ్లలో చంద్రబాబు తప్పుచేసినట్లు నిరూపించగలిగే ఆధారాలు ఏ ఒక్క కేసులో కూడా దొరకలేదు. అయినా కేసులపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పనిచేస్తున్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో అవినీతిపై బీజేపీ, తెలుగుదేశం- జనసేనలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు. ఆధారాలు లేని ఆరోపణలతో స్కిల్ డెవలప్ మెంట్ కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారు. ఆ కేసులో ఎక్కడ బెయిల్ వస్తుందో, ఆయన ఎక్కడ విడుదల అవుతారో అనే ఆందోళనలతో జగన్ రెడ్డి మద్యం కేసు నమోదు చేశారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో ఊహించని రీతిలో ఆయన పట్ల ప్రజాభిమానం పెల్లుబికింది. అది చూసి తట్టుకోలేకనే వరుస కేసులు పెడుతున్నారు. చంద్రబాబును ఎన్నికలు ముగిసే వరకు జైల్లో ఉంచాలనే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 6 కేసులు నమోదు చేశారు. నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం, కృష్ణా పుష్కరాల పనులపై మరో 3 కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం అవుతోంది.

జీవో వచ్చిన 8 ఏళ్లకు కేసా?

ఉచితంగా ఇసుక ఇవ్వడమే జగన్ రెడ్డి దృష్టిలో నేరంలా కనిపిస్తోంది. ఒకవైపు కులం చూడను, మతం చూడను అంటూనే అన్ని విషయాల్లో కులం, మతం ప్రాతిపదికనే పనులు చక్క బెడుతున్నారు. తన సొంత సామాజికవర్గంతోనే జగన్ రెడ్డి ఫిర్యాదులు చేయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం అంతా పారదర్శకంగా జరిగింది. ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.1500 కే లభిస్తే.. ఇప్పుడది ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. నాలుగున్నరేళ్లలో రూ.40వేల కోట్లకు పైగా ఇసుకలో జగన్ రెడ్డి దోచుకున్నారు. మద్యానికి సంబంధించిన కేసులో ఎప్పుడో 2015లో జీవో ఇచ్చారని చెబుతున్నారు. మరి జీవో వచ్చి సుమారు ఎనిమిదేళ్లు దాటింది. గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? జీవో జారీ చేసిన అప్పటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డిపై కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అయినా కేబినెట్ ఆమోదించిన తర్వాతనే అనుమతులు మంజూరు చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని ఎలా తప్పుబడతారు? ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి అధికారులుగా ఉన్న శ్రీలక్ష్మి, మైనింగ్ డైరెక్టర్‌గా ఉన్న రాజగోపాల్‌పై కేసులు నమోదు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి ప్రధాన బాధ్యులు. కానీ వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? దీనిని బట్టి జగన్ రెడ్డి కుట్రకోణం స్పష్టమవుతోంది.

రద్దులు, కూల్చివేతల రాజ్యం

ప్రివిలైజ్ ఫీజు చంద్రబాబు మాఫీ చేశారని, మద్యం కంపెనీలకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చారని జగన్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయాచితంగా లబ్ధిపొందిన మద్యం కంపెనీల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయలేదు? ఆ కంపెనీల నుంచే ప్రస్తుతం మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఆయాచితంగా లబ్ధిపొందిన కంపెనీల నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కాదా? ఆయా మద్యం కంపెనీలను ప్రస్తుతం నడిపిస్తున్నది ఎవరు? దీనిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఆ కంపెనీల నుంచి మద్యం ఎంత కొనుగోలు చేస్తున్నారు, వాటిని ఏ ధరకు విక్రయిస్తున్నారు, ఆ నగదు ఎక్కడ జమ చేస్తున్నారు? డిజిటల్ పేమెంట్ రూపంలో చెల్లింపులు ఎందుకు జరగడం లేదు? నగదు చెల్లింపులు మాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారు? గతంలో మద్యం ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? గతంలో మద్యం నాణ్యత ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.

గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు రద్దు చేశారు. రూ.11 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. నిర్మాణ దశలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని భవనాలను సైతం పాడు పెట్టారు. ఎంతోమంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. అలాంటిది గత ప్రభుత్వ హయాంలో ఆయాచితంగా లబ్ధి పొందిన మద్యం కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేదు? వాసుదేవరెడ్డి రైల్వేకు చెందిన చిన్న అధికారి. అతనికి అబ్కారీ విధానాల పట్ల కనీస అవగాహన లేదు. జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్న మద్యం కుంభకోణాల్లో అతని పాత్రపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. పాలసీలు రివ్యూ చేసే అధికారం వాసుదేవరెడ్డికి ఎవరిచ్చారు? ఎండీ స్థాయి అధికారి ఏ హోదాలో రివ్యూ చేసి నివేదిక ఇస్తారు? కమిషనర్, సెక్రటరీ, ముఖ్యమంత్రి పనితీరును బేరీజు వేసే అర్హత వాసుదేవరెడ్డికి ఉందా?

మద్యం ఆదాయంపైనా కోట్ల అప్పులు

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్తగా కొన్ని డిస్టలరీలకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారు. వాటిని కాస్తా జగన్ రెడ్డి బెదిరించి సొంతం చేసుకున్నారు. తన బినామీల చేత నాసిరకం మద్యం తయారు చేయిస్తూ ప్రజల ధన, ప్రాణాల్ని హరించివేస్తున్నారు. మద్య నిషేధం హామీపై జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారు. ప్రభుత్వం తయారుచేస్తున్న నాసిరకం బ్రాండ్లు తాగి 54 నెలల్లో 35 లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారు. 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యంలో విషపూరిత రసాయనాలున్నట్టు చైన్నైలోని ప్రముఖ ఎస్జీఎస్ ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. అమెరికా ల్యాబ్ లో పరీక్షించగా విషపూరిత రసాయనాలు ఉన్నట్టు తేలింది. ఈ అవినీతి డబ్బంతా జగన్ రెడ్డి జేబుల్లోకి వెళ్తోంది. ఏడాదికి రూ.57,600 కోట్లు విలువైన విక్రయాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రూ. 32,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మిగతా రూ. 25 వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. 4 ఏళ్లలో రూ. 1 లక్ష కోట్లు దోపిడి చేసి తాడేపల్లి ప్యాలెస్‌కి తరలించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అదాన్ డిస్టలరీస్‌కు 11 వందల కోట్లకు పైగా మద్యం ఆర్డర్లిచ్చారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా దొడ్డిదారిన ఇప్పటికే మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ‎ బ్యాంకుల నుంచి రూ. 33 వేల కోట్లు అప్పు తెచ్చారు. దేశంలో ఏ స్కాం బయటపడ్డా అందులో ఏపీ మూలాలు, దానిలో వైసీపీ నేతల మూలాలు బయటపడుతున్నాయి. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం రిమోట్ అంతా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంది. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు పాలయ్యారు.

ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారు. న్యాయాన్యాయాల విచక్షణ లేకుండా జగన్ రెడ్డి చెప్పిందే తడవుగా హడావుడిగా సీఐడీ కేసులు నమోదు చేస్తుంది. ప్రతిపక్షాలు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సరైన ప్రతిపక్షం ఉంటేనే పాలకపక్షాలు సక్రమంగా పని చేస్తాయి. సుపరిపాలన అందించడం ద్వారా ప్రజల మెప్పు పొంది ఎన్నికల్లో విజయం సాధించాలేగాని రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం మూర్ఖుల లక్షణం. చంద్రబాబుపై పెడుతున్న అక్రమ కేసులన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సందర్భంలో ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. చంద్రబాబుపై అన్యాయంగా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని లక్షలాది మంది తరలివచ్చారు. ఏపీలో, హైదరాబాద్‌లో చంద్రబాబుకు వెల్లువెత్తిన ప్రజాభిమానాన్ని చూస్తే ప్రజలకు వాస్తవాలు అర్థమైనట్లు ఉన్నాయి. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలకు జగన్ రెడ్డి స్వస్తి చెప్పాలి. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News