రుగ్మతలను విస్మరిస్తే మహాప్రమాదం!

విశ్వవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. వారిలో మానసిక ఆరోగ్యంపై కనీస అవగాహన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని

Update: 2024-10-10 01:00 GMT

విశ్వవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. వారిలో మానసిక ఆరోగ్యంపై కనీస అవగాహన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే, రక్షించే చర్యలను నడపడానికి పనిచేసే చోట మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అనే నినాదంతో ఈ సంవత్సరం అవగాహన కార్యక్రమం జరుపుకుంటున్నాం.

మానసిక రుగ్మతలతో జీవించే వ్యక్తికి నిద్రలేమి, ఒంటరితనం, విచిత్రమైన ఆలోచనలు, వింత ప్రవర్తనలు, తనలో తాను నవ్వుకోవడం - మాట్లాడుకోవడం, చేతబడి, చంపడానికి వస్తున్నారని భ్రమపడడం, నిరాశ నిస్పృహలు, విరక్తి, విచార వదనం, ఆత్మహత్య ఆలోచనలు ప్రయత్నాలు, నలుగురిలో మాట్లాడాలంటే భయం భయం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పదేపదే గొడవలు, ఎవరిని సులువుగా నమ్మకపోవడం, పదేపదే వ్యతిరేక ఆలోచనలు, చేసిన పనిని పదేపదే చేయడం, ఎక్కువగా మాట్లాడడం, అతి గొప్పలు చెప్పుకోవడం, మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావడం, చదువులో వెనుకబాటుతనం, ఇంట్లో, బయటా, ఆఫీసుల్లో తోటి వారితో అనవసరంగా గొడవలు పడటం లాంటివి మానసిక లక్షణాలు..

మానసిక వ్యాధుల కారణాలు..

న్యూరో ట్రాన్స్మిటర్లు సహజంగా ఉత్పత్తి అయ్యే మెదడులోని రసాయనిక పదార్థాలు ఉదా. డోపమైన్, సెరొటోనిన్. గ్లుటమిన్. గాభా, ఎపినెప్రిన్, నార్ -ఎపినెప్రిన్. ఎసిటలిన్ లాంటి రసాయ న పదార్థాల అసమతుల్యత మానసిక వ్యాధులకు దారితీస్తుంది. అలాగే మెదడు వ్యాధులు, వారసత్వం, విపరీతమైన ఒత్తిడి, పెంపకం సరిగ్గా లేకపోవడం, మాదకద్రవ్యాల వినియోగం వంటివి ఈ మానసిక రుగ్మతలకు కారణాలు..

మానసిక రోగులపై చిన్నచూపు....

ప్రపంచవ్యాప్తంగా మానసిక వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు, దుర్విచక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగడం మరో విషాదం. విశ్వంలోని ప్రతి అయిదుగురు పిల్లలలో ఒకరు మానసిక అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారు. దాదాపు 20% మంది పిల్లలు- కౌమారదశలోనే ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే 15-29 ఏళ్ల మధ్య వయసులో జరుగుతున్న ఆత్మహత్యలు.. ప్రపంచ మరణాల్లో రెండవ ప్రధాన కారణం. పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా 2018 నాటి సర్వే ప్రకారం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతల బాధితుల్లో అత్యధికులు భారత దేశంలోనే ఉన్నారన్న చేదు నిజాన్ని ఆవిష్కరించింది. వీరిలో 25 ఏళ్లలోపువారు 50శాతం, 35 వయసు లోపువారు 65 శాతం ఉన్నారు. మానసిక అనారోగ్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం US$ 1 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వివక్షత కొనసాగుతుంది. ఏ దేశంలో కూడా మానసిక ఆరోగ్య వ్యయం 2% కూడా దాటడం లేదు. ఈ వివక్ష భారతదేశంలో మాత్రం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా ఒక శాతం కన్నా తక్కువ ఉండటం మహా దురదృష్టకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకా రం- అమెరికాలో ప్రతి పదిలక్షల మందికి 100 మంది సైకియాట్రిస్ట్‌లు, 300 మంది సైకాల జిస్ట్‌లు ఉండగా, భారత్‌లో మాత్రం వారి సంఖ్య చాలా స్వల్పం. పది లక్షల మందికి కేవలం నలుగురు సైకియాట్రిస్టులు మాత్రమే ఉండగా క్వాలిఫైడ్ సైకాలజిస్ట్‌ల సంఖ్య మాత్రం నామమాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. మానసిక అస్థిరత్వం వల్ల అనేకమంది మద్యం, ధూమపానానికి అలవాటుపడి మరిన్ని కష్టాల పాలవుతున్నారు.

నివారణకు ఏం చేయాలి?

మానసిక అనారోగ్య సమస్యల విపత్తును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిగూఢ సంక్షో భంగా (Hidden- Emergency) పేర్కొంటున్నది. బాల్యం- కౌమార దశ నుంచే అనేక మానసిక సమస్యలు మొదలవుతున్నాయని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానసిక అనారోగ్యం జాతీయ రుగ్మతగా మారే అవకాశం ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. నేడు అందుతున్న ఆధునిక వైద్య చికిత్స విధానాలు సాధ్యమైనంత తొందరలోనే వ్యాధులను నయం చేయగలుగుతున్నాయి, కానీ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడే సంప్రదిస్తే నయం కావడం గ్యారంటీ. అయితే ముదిరిన దశలో వైద్యులను సంప్రదించడంతో నష్టం భారీగానే ఉంటుందన్న విషయం మరవద్దు. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి వాటిపై అపోలు తొలగిపోవాలి. ఈ బాధ్యతను కేవలం ప్రభుత్వాలే కాదు. స్వచ్ఛంద సంస్థలు కూడా చెయ్యాలి. మానసిక రోగాలను, మానసిక రోగగ్రస్తులను కూడా నిరాదరణకు గురి చేయడం చాలా బాధాకరం. అర్హులైన వైద్య సిబ్బందిని పెంచడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగం లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి, ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోని, మానసిక రోగగ్రస్తులకు వైద్య సదుపాయాలతో పాటు పునరావాస సౌకర్యాలపై కూడా దృష్టి పెట్టినప్పుడే మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా తగ్గించగలుగుతాం, లేకుంటే భవిష్యత్తుల్లో మానవ మనుగడకు మానసిక అనారోగ్యమే గుదిబండగా మారే ప్రమాదం ఉందన్న చేదు నిజాన్ని మరవద్దు సుమా !

(నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం...)

డా.బి.వి, కేశవులు ఎండీ, సైకియాట్రీ

సీనియర్ మెంటల్ హెల్త్ ఎక్సపర్ట్

85010 61659

Tags:    

Similar News