మమ్మల్ని సొంత జిల్లాకు పంపండి!

స్థానికత" పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల క్రితం ఆనాటి పాలకులు తీసుకువచ్చిన జీవో 317 అర్ధరాత్రి హడావుడిగా

Update: 2024-10-10 00:15 GMT

"స్థానికత" పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల క్రితం ఆనాటి పాలకులు తీసుకువచ్చిన జీవో 317 అర్ధరాత్రి హడావుడిగా ఎలాంటి హెచ్చరికలు చేయకుండా లాభనష్టాలతో సంబంధం లేకుండా యుద్ద ప్రాతిపదికన 317 జీవోను తెచ్చి ఉద్యోగులను తెల్లవారే ఉన్న జిల్లాను వదిలిపెట్టి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు జిల్లాలకు వెళ్లాలని ఆదేశించింది. సొంత జిల్లాలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం కొనసాగించి దాదాపు 30 సంవత్సరాల సర్వీసును చేసిన వారిని పరాయి జిల్లాల్లో స్థానికుడిగా నిర్ణయించింది ఈ 317 జీవో. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆనాటి పాలకులు తమకు నచ్చిన రీతిలో మాట్లాడినారు. ఈ 317 జీవో ఉద్యోగులను ఒక్కసారిగా కలవర పెట్టింది. కుటుంబాలు అన్నింటిని చెల్లాచెదురు చేసింది. ఒకరికొకరు కలవకుండా దూరాన్ని పెంచేసింది. ఉద్యోగులు ఎంత గగ్గోలు పెట్టినా నిరసన తెలియజేసినా ఆనాటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది అనడం ముమ్మాటికి వాస్తవం.

ఇంకా న్యాయం జరగలే...!

ఆనాడు ఉద్యోగ ఉపాధ్యాయ 317 జీవో బాధితులు చేస్తున్న నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 317 జీవో 48గంటల్లోనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఈ బాధిత ఉద్యోగుల పాత్ర ఎంతైనా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించింది. ఈ 317 జీవోను తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పెట్టింది. 317 జీవో బాధితుల కోసం ప్రత్యేకమైన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. ఇది జరిగి మూడు నెలలు గడిచింది. కానీ ఇప్పటికీ బాధిత ఉద్యోగులకు న్యాయం జరగలేదు. ఉద్యోగుల మానసిక సంఘర్షణ దృష్టిలో పెట్టుకొని సత్వరంగా సొంత జిల్లాలకు రప్పించాలని ఉద్యోగులు విన్నవించుకుంటున్నారు.

-యాడవరం చంద్రకాంత్ గౌడ్

94417 62105

Tags:    

Similar News