పిల్లల కలలను ప్రోత్సహిస్తే..

విశ్వ చదరంగ వేదికపై భారతీయ జెండా ఎగరేయాలనుకుని ఒక బాలుడు కన్న కల ఫలించింది. దశాబ్దం పైగా చదరంగ బోర్డుపై ప్రయాణం..! హేమా

Update: 2024-12-15 00:45 GMT

విశ్వ చదరంగ వేదికపై భారతీయ జెండా ఎగరేయాలనుకుని ఒక బాలుడు కన్న కల ఫలించింది. దశాబ్దం పైగా చదరంగ బోర్డుపై ప్రయాణం..! హేమాహేమీలను వరుసగా మట్టికరిపిస్తూ వచ్చిన విజయనాదం. ప్రపంచం చూస్తుండగానే చదరంగంలో భారత్ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గుకేశ్ మేధస్సుకు విశ్వ కిరీటం తలొంచింది.

విశ్వ చదరంగ ఛాంపియన్ గుకేశ్ విజయం పట్ల నేడు ప్రతి భారతీయుడి గుండె మేరా భారత్ మహాన్ అంటూ ప్రతిధ్వనిస్తోంది. "64 చతురస్రాల ఆటలో, మీరు అంతులేని అవకాశాల ప్రపంచాన్ని తెరిచారు. అభినందనలు గుకేష్. కేవలం 18 సంవత్సరాల వయస్సులో 18వ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచా రంటూ ఎందరో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తొలి రౌండ్‌లో ఓటమి చెందినా..

ప్రస్తుతం తమిళనాడులో స్థిరపడినప్పటికీ, తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన గుకేశ్ ప్రతిభను చిన్నప్పుడే గుర్తించిన తల్లిదండ్రులు నేటి విజయం కోసం తమ జీవితాలనే త్యాగం చేశారు. ఈ.ఎన్.టీ సర్జన్ అయిన తండ్రి విలువైన తన కెరీర్‌నే పక్కన పెట్టి తన కొడుకు ప్రయాణంలో పాలు పంచుకున్నారు. మైక్రో బయాలజిస్ట్ అయిన తల్లి సంపాదనతోనే కుటుంబం నెట్టుకొచ్చేవారు. కొన్ని సందర్భాల్లో టోర్నీలకు వెళ్లడానికి నిధుల సేకరణ కూడా చేసేవారు. చాలా కష్టపడి విశ్వ నాథన్ ఆనంద్ మార్గదర్శనం తన కొడుకుకు దొరికేలా చేశారు. ఇక అప్పటినుంచీ ఆనంద్ పర్యవేక్షణలో గుకేశ్ తనదైన శైలిలో నేటి తరం కుర్రాడిలా చెస్ ఆటలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే విధంగా దూసుకుపోతున్నారు. మొత్తం 14 రౌండ్స్ ఉన్న పైనల్ మ్యాచ్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి చెంది కాస్త భావోద్వేగానికి గురైనా.. వెంటనే కోలుకున్నాడు. 13 వ రౌండ్ ముగిసిన సమయానికి 6.5-6.5తో సమంగా నిలిచినప్పటికీ చివరి రౌండ్లో నల్ల పావులతో ఆడినప్పటికీ తన ప్రత్యర్థి డింగ్ లిరెన్ అనుభవాన్ని సైతం అధిగమించి చిరస్మర ణీయమైన విజయాన్ని మనకు అందించారు.

అసాధారణ విజయాలు చూడాలంటే..

కేవలం 18 ఏళ్ల వయస్సులో చదరంగం లాంటి ఆటలో ప్రపంచ చాంపియన్‌గా ఎదిగిన గుకేశ్, ఆ గెలుపులో కీలకపాత్ర పోషించిన వారి తల్లిదండ్రుల నుంచి నేటి యువతరం, తల్లిదండ్రులు చాలా నేర్చుకోవచ్చు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పిల్లలపై గుడ్డిగా ఒత్తిడితో రుద్దకుండా, ర్యాంకులు, మార్కుల పేరుతో ఇబ్బంది పెట్టకుండా పిల్లల ప్రతిభ శ్రద్ధాసక్తులు ఆధారంగా ప్రోత్సాహం అందించాలి. పిల్లల కలల్ని అందమైనా లక్ష్యాలుగా తీర్చిదిద్దాలి. నేటి యువతరం కూడా వయస్సు కేవలం ఒక నెంబర్ అని గమనించాలి. చరిత్ర గమనిస్తే అనామకులు కుడా తమ అలుపెరగని ప్రయత్నాల పరం పర కొనసాగిస్తూ, అహార్నిశల శ్రమతో ముందుకెళ్తూ అనుభవజ్ఞులైన హేమాహేమీలపై సైతం అసాధారణ విజయాలు సాధించారు. నవతరానికి స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలారు. 2013 చాంపియన్ షిప్ మ్యాచ్‌లో కార్ల్ సన్, ఆనంద్ ఆటను చూసి కలలుగన్న ఓ పిల్లాడు దశాబ్దం తర్వాత ఆనంద్, కార్ల్ సన్ తన ఆటను చూసేలా, మెచ్చుకునేలా ఎదగడమంటే ఓ అద్భుతమనే చెప్పొచ్చు. అసాధారణ విజయాలను ప్రపంచం చూడాలంటే అమావాస్య చీకటిలోనే కొత్త దారులు అన్వేషించాలి. అప్పుడే ఆ విజయాలు వెలుగు శబ్దాలై భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇస్తాయి. గుకేశ్ ఇంకా ఎన్నో గెలుపు మలుపులతో మన దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ, వారి తల్లిదండ్రులకు సెల్యూట్ చేద్దాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Tags:    

Similar News