తెలుగుదేశం పార్టీకి అమృత వర్షిణి
If a Brahmini takes the reins of TDP, will the party revive
టీడీపీకి సంక్షోభాలు కొత్తేమి కాదు. ఇప్పటికే కీలకమైన మూడు సంక్షోభాలను ఎదుర్కొంది ఆ పార్టీ. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీని సంక్షోభం చుట్టుముట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధినేత అరెస్టుతో తెలుగు తమ్ముళ్లలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. జైలు నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలియక ఆందోళనలో ఉన్నారు. దీంతో పార్టీని నడిపించేది ఎవరు అన్నది ప్రశ్నగా మారిపోయింది. 40 ఏళ్ల చరిత్ర.. పాతికేళ్ల అధికారం చలాయించిన అనుభవం.. వందల మంది నాయకులు.. లక్షల మంది కార్యకర్తలు.. ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇంతకుమించిన బలం.. బలగం ఇంకేముంటాయి.. ఇవన్నీ ఉన్న పార్టీ కష్టాలను ఎదుర్కోవలసి వస్తే ఏం చేస్తుంది.. సీనియర్ లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది, పోరాటాలతో తమ పంతం నెగ్గించుకుంటారా, ప్రభుత్వ నిర్బంధమని తప్పించుకుంటారా, పోరాడిన వారిని ప్రోత్సహిస్తారా, కేసుల్లో చిక్కుకుంటామని వెన్నుచూపుతారా? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇంచుమించు ఇలానే ఉంది..
వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..
నలభై యేళ్ళ టీడీపీకి నాయకత్వమే సమస్యా? లక్షలాది కార్యకర్తల బలం ఉన్నా.. సంక్షోభాన్ని అధిగమించడంలో తడబాటు ఏంటి? సీనియర్లలో నైరాశ్యమా, నిస్తేజమా... ఎందుకీ పరిస్థితి? అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ ఎప్పుడూ లేనంత అనిశ్చితిని.. గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో సంక్షోభాలు.. గడ్డు పరిస్థితులు ఎన్నో వచ్చినా.. గతంలో ఇలాంటి పరిస్థితిని మాత్రం తెలుగుదేశం చూడలేదు. గత సంక్షోభాల్లో క్యాడర్ కకావికలమైన.. అధినేత అండగా నిల్చొని అడ్డు చక్రం వేసి పార్టీని కాపాడుకున్నారు. అవేవీ టీడీపీ పునాదులను కదిలించలేకపోయాయి. ఐతే ఇప్పుడు ఆ పునాదులు షేకయ్యేలా అధినేత అరెస్టు అన్న సంక్షోభం టీడీపీని కమ్మేసింది. లోకేశ్ పార్టీని చక్కదిద్దే బాధ్యతలు తీసుకుంటారని ఆశిస్తే.. ప్రభుత్వ హెచ్చరికలు క్యాడర్‌ను మరింత భయపెడుతున్నాయి, లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ముఖ్య నేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండా పోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా లేక భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల ముందుకు వస్తారా? వస్తే వారు ఏ స్థాయిలో నిలబడతారు, పార్టీలో ఉత్సాహాన్ని మనోబలాన్ని ఎంతవరకు నింపుతారు అన్నది చూడాల్సివుంది. తెలుగుదేశం పార్టీ ముందున్న సవాళ్లు జనసేనతో పొత్తు ,సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన, పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార బాధ్యత నిధుల సమీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి క్రియాశీలక పాత్రను పోషించాల్సిన పరిస్దితి. సీనియర్ల సహాయ సహకారంతో జనసేనతో పార్టీని సమన్వయ పరుస్తూ ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. కార్యకర్తల సహాయ సహకారాలతో బ్రాహ్మణి పార్టీని ముందుకు తీసుకు వెళ్లగలరు అని కూడా మనం చెప్పుకోవచ్చు.
వైసీపీలో ప్రకంపనలు
జనసేనతో పొత్తును తెలుగుదేశం నేతలు స్వాగతించారు. రాక్షస సంహారం కోసం శక్తులన్నీ ఒక్కటయ్యాయని ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. వైసీపీని ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ఇరు పార్టీల నేతలు తెలిపారు. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. కమిటీ ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గట్టుగా ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటామని వెల్లడించారు. జగన్ ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు కలిసి రావాలన్నారు. ఒక విధంగా పవన్ ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. పవన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం- జనసేన పొత్తుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం రెట్టింపయింది. రెండు పార్టీల కలయిక రాష్ట్ర ప్రజల కోసమే తప్ప రాజకీయ లబ్దికోసం పదవుల కోసం కాదన్నది జనసేనాని ఉద్దేశ్యం. నాలుగో విడత వారాహి విజయ యాత్ర అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలై మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగుతోంది . ఈ ప్రాంతాలలో సామాజిక వర్గాల సమీకరణాలు జనసేన, తెలుగుదేశం పొత్తుకు అనుకూలంగా ఉన్నాయి.
బ్రాహ్మణి ఆగమనంతో..
నారా బ్రాహ్మణి కూడా ఈ యాత్రలో పాల్గొంటే తెలుగుదేశం కార్యకర్తలలో కేడర్‌లో నూతన ఉత్సాహం వస్తుంది. వాయిదాల పర్వం కొనసాగుతున్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీని గాదిలో పెట్టాల్సిన బాధ్యత సీనియర్లది. బ్రాహ్మణి చొరవ తీసుకుని పరిస్దితిని చక్కదిద్ది పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ దిశగా తెలుగుదేశం క్రియాశీలకంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ వాటికే పడతాయని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వైసీపీ పాలనలో అనేక అవమానాలు, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అవమానాలకు గురవుతున్న కమ్మ, కాపు, అమరావతి రైతులు అందరూ టీడీపీ-జనసేన వైపుకు వచ్చేస్తారు. ఈ రెండు పార్టీల కలయికతో రాష్ట్రంలో ‘ఓట్ల పోలరైజేషన్’ జరుగుతుందనే భయంతోనే ఇంత కాలం వాటిని కలవకుండా అడ్డుకొనేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఈ పొత్తు తప్పక ప్రభావం చూపవచ్చు. బీజేపీ వ్యూహం ఏమిటన్న దానిపై స్పష్టత రాకున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్యా వారి ఆలోచన మారవచ్చు. పొత్తు కుదరవచ్చు. సానుభూతి రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుందనేది చరిత్ర నేర్పిన పాఠం. అయితే ప్రతిసారి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయా అనేది నిర్ణయించాల్సింది ఓటరు.
- వాడవల్లి శ్రీధర్
99898 55445