ఇదీ సంగతి:నిజాయితీ రాతల కాలం కాదు

విదేశాలలో ఒక మాట మాట్లాడతారు. స్వదేశంలో మొఖం చాటేస్తారు. ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ అంటూ ఊదరగొడతారు. ఆచరణలో మాత్రం మొండిచేయి

Update: 2022-07-07 18:45 GMT

ప్రభుత్వ బెదిరింపుల కారణంగా మీడియా యాజమాన్యాలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. అనవసరంగా ఇబ్బందులు ఎదురవుతాయని, యాడ్స్ ఇవ్వరని, ప్రభుత్వం నుంచి లభించే మంచి మంచి పాలలో మీగడలు లభించవని వారు ఎలా చెబితే అలా చేస్తున్నారు. సహచరుడు జుబేర్ అరెస్ట్‌కు బదులుగా, అదే రోజు జి-7 దేశాల సమావేశాలలో పాల్గొని ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ అఫ్ స్పీచ్‌ను కాపాడతామని జరిగిన ఒప్పందం మీద మన పీఎం నరేంద్ర మోదీ సంతకాలు చేసిన అంశాలను దినమంతా చూపించినవారూ ఉన్నారు. జుబేర్ అరెస్ట్‌ను సమర్థిస్తూ మాట్లాడినవారికి, ట్వీట్లు చేసినవారికి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి, రాసి, స్టోరీ చేసిన చాలా మంది నిజాయితీ గల జర్నలిస్టులు ఇప్పటికే తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీదికి వచ్చేసారు.

విదేశాలలో ఒక మాట మాట్లాడతారు. స్వదేశంలో మొఖం చాటేస్తారు. ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ అంటూ ఊదరగొడతారు. ఆచరణలో మాత్రం మొండిచేయి చూపుతారు. అసలు ఎనిమిదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. 2024 వరకైనా పెడతారో లేదో తెలియదు. దేశంలో కొందరు జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నారు. అధికార బలం ఉన్నోడిదే రాజ్యమా? ప్రజామోదం ఉన్నవాడికి భవిష్యత్తులో స్థానం ఉండే పరిస్థితి లేదా? అసలు భారతదేశంలో ఏం జరుగుతున్నది? పాలకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిజాన్ని జీర్ణించుకునే పరిస్థితి ఉండడం లేదు. నిజం రాయడం కూడా ఇప్పుడు జర్నలిస్టులకు ప్రమాదకరం అయిపోయింది.

రాయడం అంటే పేపర్ నింపడం మాత్రమే అనుకునే పరిస్థితి వస్తున్నదా? 'అలా అయితేనే ఉంటావు, లేకుంటే నీ మనుగడ ఉండదనే' హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సహచరులను అన్యాయంగా అక్రమ కేసులలో జైలుకు పంపినా పత్రికా సమాజం సంపూర్ణంగా కదలలేని పరిస్థితి వచ్చేసిందా? అసలు ఎందుకింత భయం, ఆందోళన? 2014 నుంచి ఢిల్లీలోని 'ప్రెస్‌ క్లబ్ అఫ్ ఇండియా' ప్రభుత్వ నిఘాలో ఉంది. దీంతో అక్కడ పిడికెడు తలలు పండినవారే సమావేశాలలో కనిపిస్తున్నారు. 50, 60, 70, దాటిన తలలే దర్శనం ఇస్తున్నాయి. అల్ట్ న్యూస్ రిపోర్టర్ మొహమ్మద్ జుబేర్‌ను అరెస్ట్ చేసి అన్యాయంగా జైలుకు పంపారు. దీనిపై చర్చించడానికి ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు, వెటరన్ పాత్రికేయులే 90 శాతం దాకా కనిపించారు. భయం, ఆందోళన, అక్రమ కేసులు నేల మీద నిజం చెప్పే, చూపించేవారిని వెంటాడుతున్నాయి.

అతను ఒంటరి బాటసారి

ప్రభుత్వ బెదిరింపుల కారణంగా మీడియా యాజమాన్యాలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. అనవసరంగా ఇబ్బందులు ఎదురవుతాయని, యాడ్స్ ఇవ్వరని, ప్రభుత్వం నుంచి లభించే మంచి మంచి పాలలో మీగడలు లభించవని వారు ఎలా చెబితే అలా చేస్తున్నారు. సహచరుడు జుబేర్ అరెస్ట్‌కు బదులుగా, అదే రోజు జి-7 దేశాల సమావేశాలలో పాల్గొని ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ అఫ్ స్పీచ్‌ను కాపాడతామని జరిగిన ఒప్పందం మీద మన పీఎం నరేంద్ర మోదీ సంతకాలు చేసిన అంశాలను దినమంతా చూపించినవారూ ఉన్నారు. జుబేర్ అరెస్ట్‌ను సమర్థిస్తూ మాట్లాడినవారికి, ట్వీట్లు చేసినవారికి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి, రాసి, స్టోరీ చేసిన చాలా మంది నిజాయితీ గల జర్నలిస్టులు ఇప్పటికే తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీదికి వచ్చేసారు.

'ఏదైతే అదైందనుకుని' యూట్యూబ్, పేపర్, డిజిటల్ మీడియా ఏదో ఒకటి పెట్టుకున్నారు. క్రిటికల్ రిపోర్టింగ్ చేస్తున్నవారి, ఫ్యాక్ట్ చెక్కర్‌ల నెత్తి మీద తల్వార్ వేలాడుతూనే ఉంది. పరిస్థితి 'చీకటిలో, ముసురుకున్న మంచు పొగలో అన్వేషణలా ఉందంటే' అతిశయోక్తి కాదు. నిజాన్ని భరించే ఓపిక ప్రభుత్వానికి లేదు. నిజాయితీగా పని చేస్తున్న జర్నలిస్టులు కష్టాలలో పడినప్పుడు సహచరుల, యాజమాన్యాల మద్దతు సంపూర్ణంగా లభించడం లేదు. దాడిని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఏ సమాజం కోసమైతే తాను రిస్క్ తీసుకుని పని చేస్తున్నాడో ఆ సమాజం మద్దతు ఏ రకంగా కూడా జర్నలిస్టుకు లభించక ఒంటరి అయిపోతున్నాడు..

నిజం చెబితే నేరమా?

సహారన్ పూర్ పోలీసులు అన్యాయంగా కొందరు యువకులను అరెస్ట్ చేసి, లాకప్‌లో వేసి, చిత్తం వచ్చినట్లు కొట్టి చేతులు, కాళ్లు విరగగొట్టారు. ఈ వార్తను ఎన్‌డీ‌టీ‌వీ రిపోర్టర్ సౌరవ్ శుక్లాలాంటివారు కవర్ చేసారు. సౌరబ్ దీనిని వెలికి తీసుకుని రాకుండా ఉంటే, రిస్క్ చేయకుండా ఉంటే మొహమ్మద్ అలీ లాంటి 18 ఏండ్ల యువకులు బతికి బయట పడేవారు కాదు. కోర్టు అలీని విడుదల చేసింది. ఇలాంటి జర్నలిస్టులను సమాజం కాపాడుకోవాలి. కరోనా సందర్భంగా ఆక్సిజన్ లభించక చనిపోతున్నవారి గురించి, శవాలు పాతి పెట్టడానికి, తగలబెట్టడానికి స్థలం దొరకని పరిస్థితుల గురించి, గంగా నదిలో కొట్టుకు వస్తున్న మృతదేహాల గురించి న్యాయబద్ధంగా రిపోర్ట్ చేసినవారు, యాజమాన్యాలు ఐటీ దాడులను ఎదురుకున్న సందర్భాలు ఉన్నాయి.విచారణలు, కోర్టు కేసులైతే లెక్కే లేదు. ఫ్యాక్ట్ చెక్ జర్నలిస్టులకు వృత్తి ఒక కత్తి మీద సాము అయిపోయింది.

ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ఫొటో తీసే పరిస్థితి లేదని ఒక సీనియర్ ఫొటో జర్నలిస్ట్ చెబుతున్నారు. 'ఫొటోగ్రాఫర్ అనగానే అనుమానంగా చూస్తున్నారని, చాలా బాధ కలుగుతున్నదని' అంటారాయన. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు. ఫ్యాక్ట్ చెక్ జర్నలిస్ట్‌ను ఏదో నేరం చేసినవారిగా సమాజం ముందు నిలబెడుతున్నారు.

జవాబు చెబుతారా?

ఇవ్వాళ జుబేర్.. తరువాత ఎవరు? అనే పరిస్థితి వచ్చేసింది. ఈ సందర్బంగా నిర్మల్‌వర్మా రాసిన 'రాత్ కా రిపోర్టర్' పుస్తకాన్ని చదవాల్సిందే. ఇది ఢిల్లీకి సంబంధించిన స్టోరీ. భయం, కుటుంబం, నిర్బంధం నిజాయితీగా పని చేస్తున్న జర్నలిస్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇందులో కనిపిస్తుంది. జర్నలిస్టుల ఐక్యతే జర్నలిస్టులను కాపాడుతుంది. 'ఖదం ఖదం పర్ లడ్‌నే‌వాలే, లడ్‌ఖడాన ఛోడో-జీనా హైతో మర్నాభీ సీఖ్‌నా హోగా-అస్‌లీ పత్రికారితా అభీ జిందా హై' (అడుగడుగున పోరాటం చేసేవాడా, నీ అడుగులు ఎందుకు తడబడుతున్నయి? బతకాలంటే చావడం కూడా నేర్చుకోవలసి ఉంటుంది. నిజాయితీ కలిగిన జర్నలిజం ఇంకా బతికే ఉంది.) రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం పోరాడుదాం. ఏకం కండి.

నైతిక విలువలు లేనివారు రాజ్యం ఏలుతున్నారు. పాలకులారా చారిత్రక పట్టణాలు, జిల్లాల పేర్లు మార్చడం కాదు, ముందు దేశంలో పీడిత, తాడిత జనం సాధక, బాధకాల వైపు చూడండి. కొవిడ్ తర్వాత 36 కోట్ల మంది ఉపాధి లేక సతమతమవుతున్నారు. వలసలు విపరీతంగా పెరిగాయి. అసంఘటిత కార్మికులు ఆగమవుతున్నారు. కేంద్రం ఇచ్చే ఐదు కేజీల తాత్కాలిక రేషన్ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉంది. 18 కోట్ల చదువుకున్న నిరుద్యోగుల గురించి చెప్పండి. అసమానతలు పెరుగుతున్నాయి. దేశం మీద పడిన రూ.135 లక్షల కోట్ల అప్పు పీ‌ఎస్‌యూలను అమ్మి తీరుస్తారా? 80-20 రాజకీయాలు ఇంకెంత కాలం? ఇవన్నీ అడిగితే జర్నలిస్టులు దేశ ద్రోహులు, తీవ్రవాదులా? జి-7 దేశాల ఒప్పందం మంచిదే. దాని మీద సంతకాలకూ ఇక్కడ దేశంలో ఆచరణకు తేడా ఎందుకు? సమాధానం చెప్పండి

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Tags:    

Similar News