హైడ్రాను, మూణ్నాళ్ల ముచ్చటగా చేయొద్దు!
ప్రభుత్వ ఆస్తుల, చెరువుల పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అయినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లకు సర్కార్ తలొగ్గిపోతూ వస్తుంటుంది. చెరువులు
ప్రభుత్వ ఆస్తుల, చెరువుల పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అయినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లకు సర్కార్ తలొగ్గిపోతూ వస్తుంటుంది. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, దీనిని ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించాలని న్యాయస్థానాలు పదే పదే చెప్పినా.. ప్రభుత్వా లు పెడచెవిన పెడుతూ వచ్చాయి. వాటి సంరక్షణకు ప్రభుత్వ హయాంలో దాదాపు 20 ఏండ్ల కాలంలో చేసిన అతి గొప్ప పని, సాహసోపేత నిర్ణయం హైడ్రా ఏర్పాటు.
ప్రకృతి చల్లగుంటేనే..
ప్రకృతి, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ చెరువులను కబ్జా చేస్తూ విలాసవంతమైన ఫాంహౌజ్‌లను నిర్మిస్తున్నారు.. వ్యాపారాలకు, విలాసాలకు భవి ష్యత్ తరాల జీవనాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. హైదరాబాదులో గంటసేపు వర్షం పడితే డ్రైనేజీ సరిగా లేక ఏదో ఒకచోట మరణవార్త తప్పని పరిస్థితి ఎదురైంది. అది మన భవిష్యత్తు తరానికి హెచ్చరిక. ప్రకృతిని నాశనం చేసే అక్రమార్కుల విలసాలను కూల్చివేస్తే కొందరికి ఎందుకు మింగుడు పడడం లేదో అర్థం కావడం లేదు. ఏ అమాయక, పేద ప్రజలు చెరువులను కబ్జా చేసుకుని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారో అంతు చిక్కని ప్రశ్న..? ఒకవేళ అలా బడా బాబుల మోసంతో చెరువు స్థలాల్లో పోగుచేసున్న కష్టార్జితంతో పేదలు కట్టుకున్న ఇంటిని హైడ్రా కూల్చి వేస్తే.. దాన్ని మోసం చేసిన ఆ కబ్జాకోరు నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయించాలి. చెరువులను కాపాడటానికి ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తే హర్షించాల్సింది పోయి లేనిపోని అవమానాలు చేయడం సరైన పద్ధతి కాదు.
తప్పు ఎవరు చేసినా..
ఎంతో గొప్ప లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులపై బెదిరింపులకు వాడకుండా.. నిష్పక్షపాతంగా వచ్చిన కంప్లైంట్ లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. హైడ్రా తో రేవంత్ హిట్ అవుతాడా? లేదో పక్కకు పెడితే.. ఆయన చేసిన అతిపెద్ద సాహసం దీనిని ఏర్పరచడం. రైతు రుణమాఫీ కంటే ఎక్కువ పాపులారిటీ హైడ్రా ఏర్పాటుతో రేవంత్‌కు వచ్చింది. దీనిని ఐదేండ్లు కొనసాగించే బాధ్యత ఆయన మీదే ఉంది. ఆయనే చెప్పినట్టు కృష్ణుడు చెప్పిం దే తాను చేస్తున్నట్లయితే.. భగవంతుడు మన వాళ్లు తప్పు చేస్తే వదిలేయమని అసలే చెప్పడు.. ఈ విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. హైడ్రా అనేది కేవలం ఒక హైప్ క్రియేట్ కోసం కాకుండా ప్రకృతి సంరక్షణ బాధ్యతగా భావించాలి.. దానికి భగవంతుడు కూడా సహకరిస్తాడు.. అంతేకానీ రాజకీయ శక్తుల్లో హైడ్రా మూణ్నాళ్ల ముచ్చటగా మారకుండా చూడాలి. చెరువులపై, ప్రకృతిని నాశనం చేసే అక్రమార్కుల గుండెలో సింహస్వప్నమై వారి భారతం పట్టాలి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి
హైడ్రా కేవలం హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. అదే మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప బహుమతి. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను, నామరూపాలు లేకుండా కూరుకుపోయిన చెరువులను రక్షించాలి. హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, సిబ్బందిని నియమించాలి. పోలీస్ స్టేషన్‌తో పాటు న్యాయ నిపుణుల బృందాన్ని, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో స్వచ్ఛంద బృందాన్ని ఏర్పాటు చేస్తే మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. వారికి ఫుల్ అథారిటీ పవర్స్‌ను ఇవ్వాలి. హైడ్రాలో సామాన్య ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాను ఆ సంస్థకు టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు, హైడ్రాకు ఫిర్యాదు చేసే వారికి రివార్డ్ ప్రకటించాలి.
అనిల్ కుమార్ యాదవ్
జర్నలిస్టు, సిద్దిపేట
91774 54529