లేఖ: మానవ హక్కుల సభకు రండి
లేఖ: మానవ హక్కుల సభకు రండి... Human Rights Council
తేదీ: 20.11.2022
ఆదివారం ఉదయం గం.10.00 లకు
స్థలం: డాక్ బంగ్లా అంబేడ్కర్ చౌరస్తా, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.
మిత్రులారా! మానవ హక్కుల వేదిక గత 20 సంవత్సరాలుగా పౌర హక్కుల ఉల్లంఘనల మీద పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రజల పట్ల ప్రభుత్వ జవాబుదారీతనం లేమినీ, పట్టింపు లేనితనాన్నీ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నది. ప్రజలలోనూ హక్కుల చైతన్యాన్ని పెంపొందిస్తున్నది. ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ శాఖలు చట్టబద్దంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలన ఉండకూడదని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ వేదిక పలు విషయాలపై న్యాయ సలహాలు సైతం ఇస్తున్నది. ప్రజలకు భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. అందులో కూడా ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా ఉంటున్నాయి. కారణం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరం చుట్టూరా విస్తరించి ఉండడం. చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కువే. ఇప్పుడు హైదరాబాద్ నగరం బాగా విస్తరించడంతో పేదల సమస్యలు ఎక్కువయ్యాయి. హైదరాబాదుకు ఆనుకొని ఉండటం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, చిన్న పరిశ్రమలకు కూడా కేంద్రం అయింది. అందుకే ప్రభుత్వంతో పాటు భూ కబ్జాదారులు కూడా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ చేసిన భూములను లాక్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఫార్మా సిటీ కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరిగింది కొన్ని చోట్ల ప్రజలు వారికి భూములు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. రెండు నెలల క్రితం ఖానాపూర్ గ్రామంలో పేదలకిచ్చిన అసైన్‌మెంట్ భూములు తీసుకొని మినీ స్టేడియం నిర్మించడానికి ప్రయత్నాలు చేశారు. పై రెండు సందర్భాలలోనూ ఈ సంస్థ జోక్యం చేసుకొని ప్రజల వైపు నిలబడి, వాళ్లకు సలహాలు, న్యాయ సలహాలు ఇచ్చింది. రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నం ప్రైమరీ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ సర్జరీలు వికటించి మరణించిన వారికి నష్టపరిహారం డిమాండ్ చేశాం. మూడు సంవత్సరాల క్రితం తోపుడు బండ్లు, డబ్బాలు గంపలు పెట్టుకొని వ్యాపారం చేసేవారిపై మున్సిపల్ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేస్తే వారి హక్కుల రక్షణ ఆదేశాలు ఇప్పించగలిగాం. వారికి స్ట్రీట్ వెండర్స్ యూనియన్ పేరు రిజిస్టర్ చేసి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. ఇలా సంస్థ పలు విషయాలలో చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. అందుకే ఎన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉన్నా, మానవ హక్కుల వేదిక లాంటి సంస్థ ఆవశ్యకత ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సంస్థను బలోపేతం చేయడానికి మీరంతా సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 20న ఉదయం 10 గంటలకు డాక్ బంగ్లా, అంబేడ్కర్ చౌరస్తా, ఇబ్రహీంపట్నం, వద్ద జరిగే సభకు హాజరై మీ సూచనలు అందించి, సంస్థలో చేరి, సంస్థను బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. సభలో 'వైద్యం - విద్య' అనే అంశం మీద డా. తిరుపతయ్య, హెచ్ఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 'భూ సమస్య- ధరణి' అనే అందం మీద వి. బాల్‌రాజ్, రిటైర్డ్ తసీల్ధార్, హెచ్ఆర్ఎఫ్. హైదరాబాద్ జంటనగరాల కార్యదర్శి, 'మానవ హక్కులు-పరిపాలన' అనే అంశం మీద జీవన్‌కుమార్, హెచ్ఆర్ఎఫ్ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ప్రసంగిస్తారు. ఎ. కిష్టయ్య, రాజు దుర్గాని, దామోదర్ అతిథులుగా హాజరవుతారు. వివరాలకు ఎ. నరసింహ-94402 20929, జహీరుద్దీన్- 94416 77614. కె. జంగయ్య- 98494 85312, ఎస్. రాజు-9908791723 నంబర్లలో సంప్రదించగలరు.