స్వేచ్ఛకు ఊపిరి మానవ హక్కులే..!

హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి

Update: 2024-12-10 00:30 GMT

హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి జాతీయత లేదా జాతి, రంగు, మతం, భాష లేదా మరే ఇతర హోదాతో సంబంధం లేకుండా మానవ హక్కులు మనందరికీ అంతర్లీనంగా ఉంటాయి. మానవుల మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు. ఇవి పుట్టుకతో ప్రతి వ్యక్తికి లభించే హక్కులు. నేడు నిత్యం ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరుగుతూనే ఉంది. జాతి, మత మౌఢ్యం వల్ల, రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ద్వేషం, కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితాలకు భరోసా లేకుండాపోతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణం అయ్యాయి.

1948 డిసెంబర్ నెల 10వ తేదీన ఏర్పడిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ‘అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం’ తీర్మానం రూపొందించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యా ప్తంగా నిర్వహిస్తున్నారు. ఇది విశ్వవ్యాప్తంగా రక్షించబడే ప్రాథమిక మానవ హక్కులను నిర్దేశించే మొదటి చట్టపరమైన పత్రం. 2024 డిసెంబర్ 10 నాటికి 76 ఏళ్లు నిండిన ఈ ప్రకటన, అన్ని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు పునాదిగా కొనసాగుతోంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్ష లేకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంలో 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర స్థాయిలలో కూడా మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయాలని సూచించినా దేశంలో కొన్ని రాష్ట్రాలకు నేటికీ మానవ హక్కుల కమిషన్‌లు లేవు. మానవులుగా ఉన్నందున మనకు లభించే హక్కులు మానవ హక్కులు. అవి అత్యంత ప్రాథమికమైన జీవించే హక్కు నుండి ఆహారం, విద్య, పని, ఆరోగ్యం, స్వేచ్ఛ వంటి హక్కులు జీవితాన్ని విలువైనదిగా మార్చగలుగుతాయి. కానీ 'చట్టం ముందు అందరూ సమానులే' అనే పాలకుల మాటలు నీటి మూటలని తేట తెల్లం కావడం విషాదం.

(నేడు మానవ హక్కుల దినోత్సవం)

కనపర్తి సుధాకర్

అసిస్టెంట్ ప్రొఫెసర్,

94413 13780

Tags:    

Similar News