అన్నీ ఉచితాలైతే ఎలా..!?

దీర్ఘకాలిక ప్రాతిపదికన పేదలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించి ఉంటే సమాజంలో అసమానతలు చాలా వరకు తగ్గేవి.

Update: 2024-08-08 01:15 GMT

దీర్ఘకాలిక ప్రాతిపదికన పేదలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించి ఉంటే సమాజంలో అస మానతలు చాలా వరకు తగ్గేవి. కానీ దూరదృష్టి లోపించిన మన పాలకులకు ప్రజల ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని పప్పు బెల్లంలా పంచి పెట్టడం మొదలైంది. తమిళనాడులో మొదటగా 90వ దశకంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఉచితంగా ప్రెషర్ కుక్కర్లు, సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వడంతో మొదలైన దుష్ట సంప్రదాయం దేశమంతా విస్తరించింది. పోటీలు పడుతూ రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు, అవసరం లేకున్నా సంక్షేమ పథకాల పేరుతో రకరకాల ఉచితాలను ఇవ్వడంతో జనాలు కూడా ప్రతి చిన్నదానికి ప్రభుత్వం వైపు చూస్తున్నారు..

రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమపథకాల కొరకు సింహభాగం కేటాయించడంతో విద్య, వైద్యం మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పన వంటి వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతూ పోతున్నాయి. ప్రతి ప్రభుత్వ దవాఖానాలో ప్రజలకు ఉచితంగా కావలసిన మందులు ఇచ్చినా బాగుంటుంది. హైదరాబాదులోని పేరు మోసిన గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానాల్లో పేదలకు ఉచి తంగా మందులు దొరకక అక్కడే ఉన్న ప్రైవేటు మందుల దుకాణాల్లో వేలు ఖర్చు చేసి మందులు కొనే పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వ ఆదా యాన్ని, అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అర్హులకే అందేటట్లు పునఃపరిశీలించాలి. కేవలం ఎన్నికలను, ఓటర్లను దృష్టిలో ఉంచుకొని ప్రజాధనాన్ని వృధాచేయరాదు.

అసమానతలు తొలగిపోక..

స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశం పేద దేశంగా మిగిలిపోయింది. వ్యవసాయ భూములు కొందరు జమీందారులు, జాగీరుదారుల చేతిలో ఉండిపోయి రైతులు కౌలుదారులుగా మిగిలిపోయారు. అసలే పేద దేశం, దానికి తోడు సంపద కొందరి చేతిలో ఉండటం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుకరణ-38లో, ప్రభుత్వం సమాజంలోని ఆర్థిక అసమానతలు తొలిగించాలని, అలాగే సమసమాజ స్థాపనకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పేదవారికి విద్య ఒక హక్కుగా అందించాలని, అలాగే చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అసమానతలు తొలగించడానికి కొద్దిపాటి చర్యలు తీసుకొన్నా అసమానతలు తొలగకపోగా రాను రాను ఇంకా పెరుగుతూ పోతున్నాయి. భూసంస్కరణలు, జమీందారీ అబాలిషన్ చట్టం, వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం, కౌలుదారు రక్షణ చట్టం చివరకు భూదాన ఉద్యమం వంటివి తీసుకురావడం జరిగింది. అయినా ఇవి సరిగా అమలు కాక ఇప్పటికీ చాలా భూములు రాజకీయ నాయకుల బినామీ చేతుల్లోనే ఉన్నాయి.

విద్య, వైద్యంలో సంక్షేమమేది?

ప్రభుత్వం ప్రజల ప్రాణాలను, ఆస్థిని రక్షిస్తూ అవినీతి లేని మంచి పాలన అందించాలి. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. ప్రజాధనాన్ని బతుకమ్మ చీరలకు, పెళ్లిళ్లకు బంగారం, డబ్బులు రూపంలో ఇవ్వడం, దసరా, రంజాన్, క్రిస్టమస్ వంటి పండుగలకు ప్రభుత్వ ఖర్చుతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం, కుల సంఘాల పేరుతో ప్రతి గ్రామంలో కుల సంఘాల భవనాలు కట్టించడం సమర్థనీయం కాదు. దేశంలో నాణ్యమైన ఉన్నత విద్య అందించడానికి మంచి కాలేజీలు స్థాపించి అందరికీ తగిన విద్యను అందించడానికి ప్రయత్నించకుండా విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం అందజేయటం కూడా సమర్థనీయం కాదు. పేదలకు మంచి విద్యను అందించడం కూడా ఒక సంక్షేమ కార్యక్రమమే. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో సరియైన వసతులు లేక పిల్లలు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ బడులలో చదువుకుంటున్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ..

ఇక వ్యవసాయ రంగంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం సమర్థనీయమే. అయితే రైతుబంధు, బోరుబావులకు ఉచిత కరెంటు, రెండు లక్షల వరకు రుణమాఫీ వంటివి అర్హులకు మాత్రమే అందజేయాలి. గత ప్రభుత్వం రైతుబంధు అందరికీ వర్తింపచేయడంతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇక బోరుబావులకు ఉచిత కరెంటు సరఫరా చేయడంతో విద్యుత్ కంపెనీలు పీకల్లోతు అప్పులలో ఉన్నాయి. బోరు బావులకు ఉచిత కరెంటు చిన్న, సన్నకారు రైతులవరకే ఇచ్చినా బాగుండేది. ఇక దళితబంధు కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అప్పటి ముఖ్యమంత్రి, దళితబంధు కార్యక్రమం రాజకీయ లబ్ధి ఆశించి ప్రారంభిస్తున్నానని చెపుతూ ప్రతి రాజకీయ పార్టీ ఏ సంక్షేమ పథకాన్ని అయినా ఏదో కొంత రాజకీయ లబ్ధి ఆశించే చేపడుతున్నారని చెప్పడం చూస్తే, నేడు దేశంలో రాజకీయ పార్టీలు ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయో అర్థమవుతుంది. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కమీషన్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టే ఉదాహరణ.

సంక్షేమ పథకాలు అర్హులకే..!

ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచుతూ ఉపాధి అవకాశాలు పెంచాలి. దాంతో పేదవారు, ఉన్నత విద్యకు అవకాశాలు లేనివారు నైపుణ్యాన్ని పెంచుకొని ప్రభుత్వం, బ్యాంకుల ద్వారా రుణాలు పొంది చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం ఉంది. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్‌కు చేపట్టిన కార్య్రకమాలను అభినందించాలి. ఇక ఉచితాలు ముఖ్యంగా ఉచిత ప్రయా ణం, ఉచిత విద్యుత్, స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల గ్రాంటు, రుణమాఫీలు, వడ్డీ లేని రుణాలు వంటివి కొంతవరకు సమంజసమే అయినా పిండి కొద్దీ రొట్టె అన్న చందాన, ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అర్హులకే అందేటట్లు పునఃపరిశీలించాలి. తెలంగా ణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు, ఇతర సౌకర్యాలు ఉన్నా యి. మంత్రులు , మంత్రుల హోదా కలిగిన ఇతర కార్పొరేషన్ చైర్మన్ల ఆదాయపు పన్ను ప్రభుత్వ మే భరిస్తుందంటే ఇది కూడా ఒక ఉచితమే. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తమ జీతభత్యాలను తగ్గించుకోవడం అలాగే వారి ఆదాయపు పన్ను వారే చెల్లించిన ప్రజలలో రాజకీయనాయకులపై గౌరవం పెరుగుతుంది.

యం. పద్మనాభరెడ్డి

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

Tags:    

Similar News