నడుస్తున్న చరిత్ర:ఉద్యోగార్థులకు ఎంత కష్టం?

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన క్రూరమైన అలసత్వం విద్యార్హతలున్న యువతను తీవ్ర నిరాశకు లోను చేసింది. నిరీక్షణలో విసిగి వేసారి కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Update: 2022-05-30 18:45 GMT

నిజానికి చేసే ఉద్యోగానికి రాసే పరీక్షకు ఎలాంటి పొంతన ఉండదు. అంతా వడబోత కోసమే. అలాంటప్పుడు వంద ప్రశ్నల స్థానంలో 50 ప్రశ్నలైతే నష్టమేమిటి? పరీక్షల సంఖ్య కూడా సగానికి తగ్గిస్తే ఫలితాలేమి తారుమారు కావు. స్టడీ మెటీరియల్ పేరిట పుస్తకాలు కొనే ఖర్చు కూడా తగ్గుతుంది. నిరుద్యోగ భృతిపై నోరిప్పని ప్రభుత్వం కనీసం ఈ భారాన్నైనా తగ్గించవచ్చు. చాలా మటుకు చేస్తున్న చిరు ఉద్యోగాలను వదిలేసి ఖాళీ చేతులతో పరీక్షలకు సిద్దపడుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న కమ్యూనిటీ హాళ్లలో పరీక్షలయ్యేదాకా వారికి భోజన, నివాస వసతి కల్పించి ఆదుకొనే బాధ్యత సర్కారుపై ఉంది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన క్రూరమైన అలసత్వం విద్యార్హతలున్న యువతను తీవ్ర నిరాశకు లోను చేసింది. నిరీక్షణలో విసిగి వేసారి కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగ నియామకాలు ఇంత నిర్లక్ష్యానికి గురి కాలేదు. డీఎస్‌సీల ద్వారా క్రమంగా ఉపాధ్యాయుల భర్తీ జరిగేది. ఏపీపీఎస్‌సీ ద్వారా ప్రతి ఏడాది గ్రూప్ పరీక్షలు జరిగేవి. వెనువెంటనే ఫలితాలు, ఎంపికైనవారికి ఆలస్యం లేకుండా అపాయింట్‌మెంట్ లెటర్స్ అందేవి. జోనల్ విధానం వర్తించని ఉద్యోగాల్లో మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి అవకాశాలు ఉండేవి. దానికి తోడు ఆంధ్ర జిల్లాల నుండి డిప్యూటేషన్‌పై వేలాది మంది హైదరాబాద్, తెలంగాణ పట్టణాలకు రావడంతో ఇక్కడ ఖాళీల సంఖ్య భారీగా తగ్గేది.

ఇలాంటి చొరబాట్లను అడ్డుకొని స్థానిక ఉద్యోగాలన్నీ తమకే దక్కాలని చదువుకున్న యువత ప్రత్యేక తెలంగాణకు తోడుగా నిలిచి ఉద్యమాన్ని వేడెక్కించింది. ఫలితంగా స్వీయ పాలన మాత్రం నిరుద్యోగులను ఘోరంగా మోసగించింది అనవచ్చు. ఇప్పుడు అప్పుడు అంటూ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఈయకుండా ఏళ్లు గడిపింది. ఇక తప్పదన్నట్లుగా మార్చి తొమ్మిదిన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. 2018 చివరి అసెంబ్లీ సమావేశంలో కూడా 73 వేల ఉద్యోగాల నియామకం జరుపుతామని అన్న మాట నిజం కాకపోగా, మళ్లీ మూడున్నర ఏళ్ల తర్వాత ఆయన నోట ఈ ప్రకటన వెలువడింది. దానికి తగ్గట్లుగా జాబ్ నోటిఫికేషన్లు కూడా వెలువడుతున్నాయి. అన్ని సక్రమంగా జరిగితే ఈ ఏడాది చివరి వరకు ఎంపిక అయినవారు కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోవాలి.

సౌకర్యాల కల్పన ఏదీ?

అయితే, ఏడాదికి కొన్ని ఉద్యోగాలు పూరించకుండా ఆపి, ఆపి ఒక్కసారిగా అన్ని శాఖలకు చెందిన 80 వేల పోస్టుల భర్తీ అనగానే అభ్యర్థుల సంఖ్య మించిపోయి వారిపై విపరీత ఒత్తిడి పెరిగింది. కనీసం 2018లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం వాటిలో సగం పోస్టులు అప్పుడే భర్తీ చేసినా బాగుండేది. పోటీ పరీక్షలు రాసేవాళ్లు ఒక్కసారిగా వేల సంఖ్యలో గ్రంథాలయాలపై పడే పరిస్థితి ఏర్పడింది. పుస్తకాల సంగతేమో కానీ, కూచుండే జాగా కోసమే యుద్ధం చేయవలసి వస్తోంది. ఉదయం తొమ్మిదింటికి తెరిచే లైబ్రరీ ముందు పొద్దున ఏడింటికే వెళ్లి క్యూలో ఉండేలా పుస్తకమో, చెప్పులో వరుసలో పెట్టవలసి వస్తోంది. మన రాష్ట్రంలో ఇప్పుడు లైబ్రరీ అంటే అక్కడే లభించే భిన్న విషయాల పుస్తకాలు చదువుకునే చోటు కాదు. అది కేవలం ఒక నీడ. కుదిరితే గదిలో, లేకుంటే దాని ఆవరణలోని చెట్టు కింద సొంత కుర్చీ వేసుకొని వెంట తెచ్చుకొన్న పుస్తకాలను చదవడానికి దొరికే వసతి. ఆ మాత్రం దానికి తప్పని పడిగాపులు, ఎదురుచూపులు.

ఉద్యోగాల భర్తీ అనగానే గ్రంథాలయాలపై అభ్యర్థుల తాకిడిని ఊహించి వాటి పెద్దలు తగిన ఏర్పాట్లు చేయాలి. 'పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం'అని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మార్చి 17న పత్రికలవారితో అన్నారు. 'అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు గ్రంథాలయాల్లో రీడింగ్‌ హాళ్లను అభివృద్ధి చేశాం. పాత జిల్లా కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాలను ఆధునికీకరించి సౌకర్యాలు మెరుగుపరిచాం. సాధారణంగా గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. అభ్యర్థులు కోరితే పనివేళలు పెంచాలని సూచించాం. అన్నిచోట్ల పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉంచాలని, శౌచాలయాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించాం. ఇప్పటికే హైదరాబాద్‌లో సెంట్రల్‌, రాష్ట్ర లైబ్రరీల్లో రూ.5 భోజనం అందిస్తున్నాం. పలు జిల్లాల్లోనూ అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని కూడా ఆయన అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర లైబ్రరీలలో సౌకర్యాల పెంపు జరగలేదని పత్రికల్లో వస్తున్న వార్తలు చెబుతున్నాయి.

పుస్తకాల సరఫరా శూన్యం

అయితే, మన లైబ్రరీల పరిస్థితి అక్కడి ఉద్యోగుల మాటల్లో ఇలా ఉంది. 'కొత్త పుస్తకాలు లేకుండా లైబ్రరీ తెరిచి ప్రయోజనమేముంది? 2014 నుండి నిధుల కొరత మూలంగా కొత్త పుస్తకాల కొనుగోలు ఆపేశాం. అంతకు ముందు ఏడాదికి సుమారు రూ. 50 లక్షల విలువైన పుస్తకాలు కొనేవాళ్లమని' చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సీనియర్ లైబ్రేరియన్ అన్నట్లు పత్రికల్లో వచ్చింది. 'ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగర పాలికకు సుమారు రూ. 1300 కోట్ల దాకా ఆస్తి పన్ను వసూలైతోంది. అందులో ఎనిమిది శాతం సెస్ ఉంటుంది. ఆ లెక్కన రూ. 104 కోట్లు లైబ్రరీలకు చెందాలి. 'నగర కేంద్ర గ్రంథాలయానికి నెలకు రూ. 15 లక్షలు నిర్వహణ ఖర్చు కింద అందుతున్నాయి' అని ఆ లైబ్రరీ సిబ్బంది అంటున్నారు.

ఈ లెక్కన లైబ్రరీల పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశ లేదు. ఇట్లాగే కాలం గడిచి పరీక్షలు ముగుస్తాయి అనిపిస్తోంది. ఇక ఉద్యోగ భర్తీలోకి వెళితే 17,516 యూనిఫారం ఉద్యోగాల అప్లికేషన్ల గడువు ఈ మధ్య ముగిసింది. దీని ద్వారా ఏడు కేటగిరీల పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఆ పరీక్షల నిర్వాహకులు ప్రకటించిన వివరాల ప్రకారం ఖాళీలు 2018 కన్నా సుమారు వేయి తక్కువున్నా దరఖాస్తులు మాత్రం 80 శాతం అధికంగా వచ్చాయి. అప్పుడు 71,9840 వస్తే ఇప్పుడు సుమారు 13 లక్షలు. ఎస్సై ఉద్యోగానికి ఒక్క పోస్టుకు 500 మంది పోటీ పడగా, కానిస్టేబుల్ స్థాయి ఒక్కో నౌకరికి 50 మంది రంగంలో ఉన్నారు. ఉద్యోగ ఖాళీలకు ఉద్యోగార్థుల సంఖ్యకు ఇంత వ్యత్యాసం ఎన్నడూ లేదు. అభ్యర్థుల్లో 92 శాతం బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలే కావడం కొంత ఆందోళనకరమైన విషయమే. ఓసీలు రిస్క్ ఉద్యోగాలకు దూరముంటే బహుజనులు బతకడానికి అన్నిటికి సిద్ధమైన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.

సదస్సులతో ఫలితమేమిటి?

పరీక్షలు రాసేవారికి అందరూ సలహాలిచ్చేవారే. టీఎస్‌ఆర్‌టీసీ తరఫున ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వార్త వచ్చింది. నిజానికి చదివి చదివి చాలా మంది పిల్లలు వక్తలను మించిన తెలివి ఇప్పటికే సంపాదించారు. వీరి ప్రయత్నం చూస్తే ఆకలితో ఉన్నవాడికి అన్నమెలా తినాలో నేర్పించినట్లుంది. భోజనాలు పంపండి, వసతులు కల్పించండి, మెటీరియల్ ఇవ్వండి, పరీక్షలను సులభతరం చేయండి. పోటీ ఒత్తిడిని తగ్గించండి. రెండు కిలోమీటర్ల పరుగు పందెమైనా, ఒక్క కి.మీ పరుగైనా గెలిచేవారిలో పెద్ద తేడా ఉండదు. రెండింటిలో విజేతలు ఒక్కరే అయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు దూరం తగ్గించడం వల్ల ఉరికేవాళ్ల ఆయాసం తగ్గించిన వాళ్లవుతారు.

ఈ లెక్కన ఈ ఉద్యోగార్థులకు కూడా వీలయినంత సిలబస్ ను తగ్గించి, పరీక్షల సంఖ్యను తగ్గించి వారి భారాన్ని, ఒత్తిడిని తగ్గించవచ్చు. దీని వల్ల నిర్వాహకులకు కూడా శ్రమ తగ్గి సమయం కలిసి వస్తుంది. నిజానికి చేసే ఉద్యోగానికి రాసే పరీక్షకు ఎలాంటి పొంతన ఉండదు. అంతా వడబోత కోసమే. అలాంటప్పుడు వంద ప్రశ్నల స్థానంలో 50 ప్రశ్నలైతే నష్టమేమిటి? పరీక్షల సంఖ్య కూడా సగానికి తగ్గిస్తే ఫలితాలేమి తారుమారు కావు. స్టడీ మెటీరియల్ పేరిట పుస్తకాలు కొనే ఖర్చు కూడా తగ్గుతుంది. నిరుద్యోగ భృతిపై నోరిప్పని ప్రభుత్వం కనీసం ఈ భారాన్నైనా తగ్గించవచ్చు. చాలా మటుకు చేస్తున్న చిరు ఉద్యోగాలను వదిలేసి ఖాళీ చేతులతో పరీక్షలకు సిద్దపడుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న కమ్యూనిటీ హాళ్లలో పరీక్షలయ్యేదాకా వారికి భోజన, నివాస వసతి కల్పించి ఆదుకొనే బాధ్యత సర్కారుపై ఉంది.

 బి.నర్సన్

94401 28169

Tags:    

Similar News