బీజేపీతో.. హిందువులకే ఇబ్బంది!
Hindus are in trouble with BJP's policies!
బీజేపీ ప్రభుత్వం హిందువుల కోసం పనిచేస్తుందని చేసే ప్రచారం ఒక బూటకపు కథనం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాల కంటే ఎక్కువ మంది హిందువులను పేదరికంలోకి నెట్టింది బీజేపీ ప్రభుత్వమే. వాస్తవానికి బీజేపీ ఒక హిందూ వ్యతిరేక పార్టీ. ‘నోట్ల రద్దు’ కార్యక్రమం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని, చిన్న వ్యాపారాలను నాశనం చేసింది. లక్షలాది మంది సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో 80% మంది హిందువులే.
దేశంలోని ఎక్కువ సాగు భూమి హిందూ రైతులదే. పైగా లక్షలాది హిందూ కౌలు రైతులున్నారు. బీజేపీ ప్రభుత్వ ‘నల్ల వ్యవసాయ చట్టాలు’ హిందూ రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్‌లకు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయి. చట్టబద్ధమైన లాభసాటి ధరలు లేనందున ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో అత్యధికులు హిందువులే.
ప్రజలకు బీజేపీ గురించి తెలియజేయాలి..
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అక్రమ మార్గాలలో సహాయం చేసింది, దేశంలో ఆదాయ అసమానతలను పెంచింది. సామాన్య ప్రజల జీవనోపాధిని నాశనం చేసింది. ముస్లిం వ్యతిరేకత, రామరాజ్యంపై ఆశలు, నకిలీ విశ్వ గురు వంటి చౌకబారు నినాదాలతో హిందువుల ఓట్లను పొందాలనుకుంటున్నది.. అందుకే బీజేపీ తిరిగి మూడోసారి కేంద్రంలో అధికారాన్ని పొందకుండా మన దేశాన్ని, ప్రజలను రక్షించుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో హిందుత్వ, రామ మందిరం, మత ధ్రువీకరణ, ఫాసిజం గురించి మాట్లాడితే, ఎక్కువ మంది హిందువులు బీజేపీ గుప్పిట్లోకి చేరవచ్చు, అందువలన, హిందుత్వం, రాముడి గురించి మాట్లాడే బదులు, బీజేపీ తాము హిందువుల పార్టీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ, బీజేపీ ఒక హిందూ వ్యతిరేక పార్టీ అనే నిజమైన దృక్పథాన్ని ప్రజలకు అందించాలి. దీంతో జాతీయ చర్చను, బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా భారతీయులందరిపై, ముఖ్యంగా 110 కోట్లపై సంఖ్యలో ఉన్న హిందువులపై చేసిన ఆర్థిక విధ్వంసం వైపు మళ్లించాలి.
కొత్త మార్గంలో విభజించు... పాలించు
భారతదేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ - 2022 నివేదిక ప్రకారం, దేశంలోని 1% మంది సంపన్నులు జాతీయ సంపదలో 42.5% కలిగి ఉండగా, 10% మంది సంపన్నులు 77% కలిగున్నారు అయితే, దిగువ 50% ప్రజల వద్ద కేవలం 2.8% సంపద మాత్రమే ఉంది. 90% భారతీయులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి, కేవలం 10% మందిని మరింత సంపన్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం 2014 నుండి కృషి చేస్తోంది. ఈ దుర్మార్గమైన ఆర్థిక విధానాలను కప్పిపుచ్చడానికి, బీజేపీ 8020, అంటే దేశ జనాభాలో 80% హిందువులు 20% మైనారిటీలు అనే మతవిభజనను ముందుకు తెచ్చింది. దేశాన్ని మతపరంగా విభజించి అధిక సంఖ్యలో ఉన్న హిందువుల ఓట్లను పొందాలని భావిస్తున్నది.
హిందువుల్లోనే పెరిగిన దారిద్య్రం
బీజేపీ విధానాలు, మైనారిటీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాశనం చేయడమే కాకుండా, హిందువుల లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేదల ఆర్థిక స్థితిని, జీవనోపాధిని కూడా నాశనం చేస్తున్నాయి. గత దశాబ్దంలో హిందువుల (సంపన్నులైన 10% మినహా) జీవితాలను మెరుగుపరిచేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్లుగా చేసే వాదనలు కేవలం అపోహలు మాత్రమే. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాల కంటే ఎక్కువ మంది హిందువులను పేదరికంలోకి నెట్టింది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం హిందువుల కోసం పని చేస్తుందని చేసే ప్రచారం ఒక బూటకపు కథనం. వాస్తవానికి బీజేపీ ఒక హిందూ వ్యతిరేక పార్టీ.
అత్యధిక హిందువులకు హాని
జాతీయ ఆస్తులన్నీ వివిధ సమూహాలకు వారి జనాభా శాతం ప్రకారం చెందినవని భావిస్తే బీజేపీ ప్రభుత్వం గత దశాబ్దంలో పెట్టుబడిదారులకు అప్పగించిన పన్ను చెల్లింపుదారులకు చెందిన ప్రతి 100 రూపాయలలో, జాతీయ ఖనిజాలలో, అటవీ వనరులలో, ప్రజల మౌలిక సదుపాయాల ఆస్తులలో, 80 రూపాయల కంటే లేదా 80% ఆస్తుల కంటే ఎక్కువ హిందువులకు చెందినవే. 20 రూపాయలు కంటే లేదా 20% ఆస్తుల కంటే తక్కువ మైనారిటీలకు చెందినవి. దీంతో బీజేపీ ప్రభుత్వ చర్యలు హిందువులకు ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు నిరూపించబడుతోంది.
ప్రైవేటీకరణతో పెను నష్టం
ప్రభుత్వ రంగ సంస్థలను, మౌలిక సదుపాయాలను, ప్రైవేటీకరించడం వల్ల, ఈ సామాజిక ఆస్తుల్లో 80 శాతం వాటా కలిగివున్న హిందువులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రధానంగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల, ఈడబ్ల్యూఎస్‌ల ఉపాధిని దెబ్బతీస్తుంది; ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగులలో రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన రిజర్వేషన్లను అమలు చేయల్సిన బాధ్యత ఉండదు.. తద్వారా బీజేపీ హిందువుల జీవనోపాధికి తీవ్రమైన హాని చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పెట్టుబడిదారులు తీసుకున్న రూ.15.4 లక్షల కోట్ల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మొత్తాలు దిగువ, మధ్యతరగతి వేతన జీవుల కష్టార్జితం. అంతేకాకుండా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రజల సొమ్ముతో మూలధనాన్ని సమకూర్చింది. ఈ రెండు చర్యల వలన నష్టపోయిన వారిలో 80% ప్రజలు హిందువులే.
ఖజానాకు భారీ నష్టం
ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను 30% నుండి 22%కి తగ్గింపుతో పెట్టుబడిదారులకు లాభం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగింది. అయినా అదనపు పెట్టుబడులు గాని, కొత్త ఉద్యోగాలు గాని రాలేదు. ఈ నిరుద్యోగ యువతలో అత్యధికులు హిందువులే. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పరిధిని, రేట్లను పెంచి ప్రజల మీద ధరల భారం నెట్టింది, ఆరోగ్యం, విద్యా రంగాలను విస్మరించింది. పేదల ఉపాధి పథకాలకు నిధులను తగ్గించింది. కొత్త లేబర్ కోడ్‌లతో కార్మికులకు హాని చేసింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, గ్యాస్ , రవాణా, విద్యుత్ ధరలను పెంచింది. వీటి బాధితుల్లో 80% హిందువులే.
ప్రతి హిందువూ నష్టపోయాడు
10 శాతం సంపన్నులను మినహాయిస్తే బీజేపీ ప్రభుత్వం దేశంలో 80% ఉన్న హిందువులలోని ప్రతి వర్గానికి ఆర్ధికంగా హాని కలిగించింది. అయినప్పటికీ బీజేపీ తమ పార్టీ హిందూ అనుకూల పార్టీ అని చెప్పుకుంటోంది. కానీ ఆచరణలో తన విధానాల ద్వారా బీజేపీ ఒక హిందూ వ్యతిరేక పార్టీ అని నిస్సందేహంగా నిర్ధారించబడింది. మన దేశాన్ని, మన ప్రజలను, కుల మత వివక్ష లేకుండా ఐక్యం చెయ్యాలి. విద్యావంతులు, మేధావులు, దేశభక్తులు, పౌర సమాజ సమూహాలు ఈ ప్రయత్నంలో ఒక ముఖ్య భూమిక పోషించవలసిన అవసరముంది.
నెల్లూరు నరసింహారావు,
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ
88863 96999
నలమటి లక్ష్మణరావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్, రావులపాలెం
9948112622
బండ్ల శ్రీనివాస్,
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్
9640427788