ఏపీ..పెట్టుబడులకు స్వర్గధామం
ఏపీ..పెట్టుబడులకు స్వర్గధామం... highlights and advantages of Andhra Pradesh to investments
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో పర్యాటక రంగం, విద్య, వైద్య, పారిశ్రామిక, పెట్రోలియం, వ్యవసాయ ,ఆహార తయారీ, పునరుత్పాదక శక్తి, రక్షణ, అంతరిక్ష, లాజిస్టిక్, ఆటోమొబైల్ లాంటి పదమూడు రంగాలలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోల్‌కత్తా, అహ్మదాబాద్, ముంబాయి, బెంగళూర్, త్రివేండ్రం, చెన్నై, హైదరాబాద్ నగరాలలో స్థానిక పెట్టుబడిదారులతో సదస్సులు నిర్వహించి రాష్ట్రంలో ఉన్న వనరులను, పెట్టుబడులు పెట్టే వారికి ప్రయోజనాలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం కలిగి ఉండటం ఆంధ్రప్రదేశ్ పాలిటి కల్పతరువుగా భావించవచ్చు.
ఎన్నో సానుకూల అంశాలు
దేశంలో ఉన్న మొత్తం తీర ప్రాంతంలో 12 శాతం రాష్ట్రంలో ఉంది. పర్యాటక, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీరప్రాంతం అక్షయపాత్రగా పేర్కొనవచ్చు. విశాఖపట్నం లాంటి ప్రధాన ఓడరేవుతో పాటూ రాష్ట్రంలో 10 ఓడరేవులు ఉండడం ఆంధ్రప్రదేశ్‌కు అదనపు బలం. అందులో ఐదు కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగిస్తుండగా ఇంకో ఐదింటిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం తిరుపతి విమానాశ్రయాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా, ఇంకా వీటిని హైదరాబాద్, చెన్నై విమానాశ్రాయాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికితోడు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో విమానాశ్రయం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు అందుకే ఈ విమానాశ్రయాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో 650 రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిదవ స్థానంలో ఉంది. అలాగే ఒడిసా, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ రాష్ట్రంలో సుమారు 6600 కిలోమీటర్ల తో 38 జాతీయ రహదారులు నిర్మించి ఉండటం గొప్ప పరిణామం. అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెరైటీస్, ఆస్బెస్టాస్, గ్రానైట్ లాంటి అనేక రకాల భూగర్భ ఖనిజ నిక్షేపాలకు, అనేక రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ అనేక దశాబ్దాలుగా దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. ఇటువంటి అనేక సానుకూల అంశాలతో పాటు సమర్ధవంతమైన, యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్నేహపూర్వక నాయకత్వం కూడా పెట్టుబడిదారులకు అందివచ్చే అవకాశంగా పేర్కొనవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) అధ్యక్షులు సుమంత్ సిన్హా పేర్కొనడం గమనార్హం.
ప్యాకేజీకి బాబు ఒప్పుకోవడంతోనే
రాష్ట్రం 50 బిలియన్ డాలర్ల జీడీపీతో దేశంలోనే 8వ స్థానంలో ఉంది. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం మొదటి స్థానం ఆక్రమించడం విశేషం. లైఫ్ సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే కరోనా కల్లోలపు కష్టాలను అధిగమించి రాష్ట్రం పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు సంబంధిత అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గణాంకాల ప్రకారం గత తొమ్మిది నెలల కాలంలోనే 47,491 కోట్ల పెట్టుబడులతో 96 మెగా పరిశ్రమలు, 29వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా రెండు లక్షల యాభై వేల మంది ఉపాధి పొందారు. అదేవిధంగా లక్షా డెబ్బై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతో 61 మెగా పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవికూడా పూర్తి అయితే సుమారు లక్షా అరవై వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. భూమి పూజ జరిగిన జిందాల్ ఉక్కు పరిశ్రమ పూర్తయితే రాయలసీమలో 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటూ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు సుమారు 800 కిలోమీటర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పొందు పరిచారు. అందులోనే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ద్వారా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న పరిణీతి లేని స్వార్ధపూరిత నిర్ణయాలతో విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసే పరిస్థితి ఏర్పడింది. పోలవరంను కేంద్రమే నిర్మించాలని చట్టంలో ఉండగా, తామే నిర్మిస్తామని హోదా స్థానంలో ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఈ నిర్ణయమే రాష్ట్ర ప్రజల పట్ల శాపమై కూర్చుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలను అటకెక్కించి ఏపీని పట్టించుకోలేదు. పాలకులు తీసుకునే తప్పుడు, స్వార్ధపూరిత నిర్ణయాలకు ప్రజలను బలి పశువులు చేయడం కేంద్ర ప్రభుత్వానికి భావ్యం కాదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 సందర్భంగా తమ సంపూర్ణ సహకారం అందించి విభజన చట్టం ప్రకారం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మొత్తంమీద చూస్తే రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర వనరుల దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కైలసాని శివప్రసాద్
94402 03999
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672