పూర్వం రోగాలు తక్కువ ఉండేవి కాబట్టి రోగులు తక్కువగా ఉండే వారు. వైద్యులు, రోగ నిర్ధారణ పద్ధతులు, పరికరాలు తక్కువగా ఉండేవి కాబట్టి రోగులు తక్కువగా ఉండే వారు. రోగులకి రోగం వచ్చేది కానీ, ఏ రోగమో తెలిసేది కాదు. వైద్య శాస్త్రం ఎంతగా పురోగతి చెందినదో, అదే విధంగా రోగాల క్లిష్టత కూడా పెరిగింది. ఒకే రోగానికి పెక్కు ఉప రోగాలు ఆవిష్కృతమవుతున్నాయి.
రోగాల నివారణ ఎలా అన్న అంశం ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలని ఆకర్షించి ఆకట్టుకునే అంశం కాబట్టే ఈ అంశాల మీద ప్రజలకి “అవగాహన” కల్పించడం కోసం ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు, పుట్టుకొస్తున్నాయి, ఎంతో మంది నిపుణులు తయారవుతున్నారు. రతిక్రీడ పద్ధతుల దగ్గరనుండి, రక్తపోటు నివారణ వరకూ వెన్నుపోటు రహస్యాల నుండి, వెన్నుపూస వ్యాధులకి వైద్యం దాకా అరగంట సేపు చెప్పే అపర చరకులు, పుల్లయ్యలు, ప్రతీ రోజూ సంప్రదాయ ప్రసార మాధ్యమాలలోనూ, సామాజిక ప్రసార మాధ్యమాలలోనూ బోధిస్తూ ఉంటే మనకి సమస్యలు తగ్గకపోగా పెరుగుతున్నాయి. చెప్పే వారి అర్హతలు తెలుసుకోకుండా, చెప్పే వారి మాటలు తీయగా, మన ఆలోచనలకి దగ్గరగా ఉంటే చాలు మనం నమ్ముతున్నాం.
వైద్యరాజుల అతి ఎక్కువ
ఈ ధోరణి భారత దేశంలోనే కాదు, పశ్చిమ దేశాలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఏది నిజం, ఎవరి మాట ప్రామాణికం అన్న విషయాన్ని అంచనా వేయగల వివేకం యాంత్రికంగా, సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే తీరిక లేని సామాన్య ప్రజలకి తక్కువగా ఉంటోంది. చదువుకున్న మేధావులు సైతం నమ్మకంగా చెప్పబడే మాటలని నమ్మే పరిస్థితి ప్రపంచంలో నెలకొని ఉంది. అంతేకాక., పుస్తకాలలోని పాఠాలు వల్లె వేసి, ప్రశ్నా పత్రాలలోని ప్రశ్నలకి సమాధానం రాసి డిగ్రీలు పొందే వారు చెప్పే పాఠాలు ఎంత లోతుగా ఉంటాయో ఊహించాలి!
ఇప్పుడు ఆహార నియమాల విషయంలో ఎక్కువగా వినపడే విషయాలు- ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువ తీసుకుంటే నిన్ను చంపే వరకూ బతుకుతావని సెలవిచ్చే వారు కొందరు, కాదు, కొవ్వెక్కిన కూడు తింటే కొదమ సింహంలా ఉరకలేస్తావని వక్కాణించే “శాస్త్రవేత్తలు” కొందరు ఇదేమీ నిజం కాదు, పచ్చి ఆకులూ, ఎండు రెమ్మలూ, పచ్చటి కూరలూ తింటే రోగాలకే రోగం తెప్పించవచ్చని ధైర్యంగా చెప్పే వైద్య రాజులు కొంతమంది.
రోగనిర్థారణలో భిన్నాభిప్రాయాలు..
నిజానికి ఏమి తింటే సవ్యంగా అరిగి, మనిషిలా బతక వచ్చునో మనకు మనమే తెలుసుకోవాలి. నమ్మతగ్గ మాటలకీ, నమ్మించేలా ఉండే మాటలకీ తేడా తెలుసుకునే విచక్షణ ఇవ్వగల విద్యని మన విద్యాలయాలలో అందివ్వాలి. రోగ నిర్ధారణ విషయంలో కూడా వైద్య రంగంలో భిన్న అభిప్రాయాలు, ఆలోచనలు ఎప్పుడూ ఉన్నాయి, ఉంటాయి. ఉదాహరణకి మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షల విషయంలో ఎన్నో అభిప్రాయాలు, ఆలోచనలు, పరీక్షలు వచ్చాయి, వస్తున్నాయి. పూర్వం, పరగడుపున చేసే రక్తంలో ఉన్న గ్లూకోజును కొలిచే పరీక్ష, భోజనం చేశాక రక్తంలో ఉన్న గ్లూకోజును కొలిచే పరీక్ష ఆధారంగా మధుమేహ వ్యాధిని నిర్ధారించే వారు. ఇప్పుడు రక్తంలో మూడు నెలలుగా ఉన్న సగటు గ్లూకోజు స్థాయిని బట్టి నిర్ధారిస్తున్నారు. ఆ సగటు విలువ కూడా అందరూ వైద్యులూ ఒకే విలువని విశ్వసించరు!
ఎవరి దందా వారిదే!
అందరికీ వచ్చే ప్రశ్న- శాస్త్రం ఒకటే కదా, రోగ నిర్ధారణ, నివారణ, చికిత్సలలో వైవిధ్యం ఎందుకు? మనకి ఆశ్చర్యం కలగ వచ్చు కానీ, వైద్య శాస్త్రం అనేది భౌతిక, రసాయన శాస్త్రాలలా ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది ఒక కళా శాస్త్రం అందుకే కొందరు వైద్యులు మాత్రమే గొప్ప వైద్యులుగా వెలుగొందుతారు. IIT పరీక్ష అందరికీ ఒకటే అయినా కొందరు “రామయ్య” నామం, ఇంకొందరు “నారాయణ” నామం జపిస్తున్నట్టుగా, రోగం ఒకటే అయినా నయం చేసే మార్గాలు వేరయా, నయం చేసే వారి నైపుణ్యం వేరయా! శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రతీ సంవత్సరం ఎన్నో సభలకి హాజరయి వారి వారి పరిశోధనా ఫలితాలను శాస్త్రవేత్తలతో పంచుకుంటారు. కానీ, ఆరోగ్యానికి ఆకులు తినమనే వారూ, పళ్ల రసాలు మాత్రమే తాగమనే వారు ఒకే వేదిక మీదకు రాగలరా? ఎవరి దందా వారిది కదా! ప్రజలు అప్రమత్తంగా ఉండి నకిలీ సలహాలు వినకుండా నికార్సయిన వైద్యులను సంప్రదించడం ఆరోగ్యానికి మంచిది.
డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక (అమెరికా)
editor@prakasika.org