తొక్కిసలాటలకు నెలవుగా ఆధ్యాత్మిక కేంద్రాలు..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది బాబా భక్తులు ప్రాణాలను కోల్పోవడం హృదయాలను

Update: 2024-07-04 01:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది బాబా భక్తులు ప్రాణాలను కోల్పోవడం హృదయాలను ద్రవింప జేస్తోంది. ఈ అత్యంత దురదృష్టకర సంఘటనకు కారణం ఐదువేల మంది మాత్రమే సమావేశం కావడానికి వీలున్నచోట పదిహేను వేల మంది భక్తులు బాబా ప్రవచనాలు వినడానికి గుమిగూడటం.

అంతటితో సరిపెట్టుకోకుండా ఆ బాబా పాదధూళితో పునీతులవ్వాలనే ధ్యాస తొక్కిసలాటకు దారి తీసిందనే వార్తలు ఆందోళన కలిగించేవే. ఫలితంగా 116 మంది బాబా భక్తులు అకాల మరణానికి గురవ్వడంతో పాటు మరో 150 మంది మృత్యువుతో పోరాడుతున్నారనే వార్తలు కన్నీళ్లు పెట్టించేవే. భోలే బాబా ప్రవచనాలతో శాంతి లభిస్తుందని ఆశ పడ్డ వారికి ఆత్మ శాంతి, జ్ఞానోదయం మాట దేవుడెరుగు... అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో భారీ మొత్తంలో భక్తులు మృత్యువాత పడడం మానవ కల్పిత విషాదంగా భావించక తప్పదు.భారత రాజ్యాంగం లోని 51 ఏ అధికరణ ప్రకారం ఈ దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వానిదే. ఐతే సదరు రాజ్యాంగ నిబంధనను తోసిరాజంటూ ప్రభుత్వాలే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని సమాధి చేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ విద్యా విధానంతో పాటు ప్రజల సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసే అనేక పాలనా విధానాల రూపకల్పనలో ఈ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న శాస్త్రీయ విజ్ఞానం స్థానంలో పుక్కిటి పురాణాలను, అశాస్త్రీయమైన ఆలోచనలకు బలం కలిగించే విధంగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలనా విధానాలు, కార్యాచరణ మానవ జీవన మనుగడకు అనేక అవరోధాలను, సమస్యలను సృష్టిస్తున్నాయని బుద్ధిజీవుల అభిప్రాయం. ఆలయాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరుగుతున్న తొక్కిసలాటలు, మృతుల ఘటనలను ఈ నేపథ్యంలోనే పరిశీలించాల్సి ఉంది.

అమాయక భక్తుల ప్రాణాలు బలి

గతంలో మహారాష్ట్ర లోని వసుంధరా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది, రాజస్థాన్‌లోని చాముండీ దేవి ఆలయంలో 250 మంది, హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయ ప్రాంగణంలో 162 మంది మధ్యప్రదేశ్‌లోని రతన్ ఘర్ దేవాలయంలో 115 మంది, ఆంధ్రప్రదేశ్ పుష్కరాల్లో 27 మంది, కేరళలోని శబరిమలైలో 104 మంది తొక్కిసలాటలో మృత్యువాత పడిన వైనాన్ని ఎవరూ మరిచిపోలేదు. ఈ క్రమంలో నిన్న ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది బాబా భక్తులు ప్రాణాలను కోల్పోవడం హృదయాలను ద్రవింపజేస్తోంది.

పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా..

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి ఆధ్యాత్మిక సమావేశాలకు అనుమతులిచ్చే సాధారణ పరిపాలన శాఖతో పాటు అలాంటి భారీ సమూహాల్లో ఓ చోటికి చేరుకునే ప్రజలను కట్టడి చేసి, శాంతియుత వాతావరణంలో సమావేశం పూర్తి చేసుకున్న తదనంతరం ప్రజలంతా సురక్షితంగా వారి వారి నివాసాలకు వెళ్లడానికి అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలను తీసుకోవాల్సిన పోలీసుశాఖలు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న యక్ష ప్రశ్నగానే మిగిలిపోవడం బాధాకరం. సదరు దురదృష్టకర సంఘటనకు తక్షణ స్పందనగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా కేంద్రంలో, రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం దిగ్భ్రాంతిని ప్రకటించడం. తదనంతరం ప్రభుత్వం మృత్యువాత పడిన కుటుంబాలకు తక్షణ పరిహారంగా రెండు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించడం బాధితులకు ఎంతో కొంత స్వాంతన చేకూర్చేదే.

ఐతే వెలకట్టలేని మృతుల ప్రాణాలకు మూల్యంగా ఓ రెండు లక్షల పరిహారాన్ని చెల్లించి చేతులు దులుపుకోకుండా ఇలాంటి తొక్కిసలాట సంఘటనలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే సమగ్ర న్యాయ విచారణ జరిపించి ఇలాంటి తొక్కిసలాటకు కారకులౌతున్న వ్యక్తులపై, వ్యవస్థలపై తగు చట్టపరమైన చర్యలను తీసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాలి. అప్పుడే ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన మన దేశంలో మళ్లీ,మళ్లీ ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండ, సదరు ఘోర దుర్ఘటనల్లో వందల సంఖ్యలో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోకుండా ఉండే అవకాశముందని బుద్ధిజీవులు కలగంటున్నారు. ఐతే రాబోయే కాలంలో వారి కలలు నిజమౌతాయో లేక కల్లగానే మిగిలి పోతాయో కాలమే తేల్చి చెప్పాల్సి వుంది.

డా. నీలం సంపత్,

డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్,

98667 67471

Tags:    

Similar News