ఆక్రమణలకు అంతం పలకాలి!

ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ 'హమాస్‌ ' చేసిన అకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఇప్పుడు హమాస్ చేసిన ఈ దుందుడుకు చర్యలను

Update: 2023-10-14 23:45 GMT

ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ 'హమాస్‌ ' చేసిన అకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఇప్పుడు హమాస్ చేసిన ఈ దుందుడుకు చర్యలను ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. ఈ హింసా ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ విధిగా ఖండించాల్సిందే. అందులో ఏమాత్రం సంశయం అక్కర లేదు. అయితే, ఒకసారి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పాలస్తీనా- ఇజ్రాయెల్ సమస్యను నిష్పాక్షికంగా అంచనా వేస్తే, ఇప్పుడు మన ప్రధానమంత్రి హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేస్తున్నారు. కానీ బీజేపీ అగ్రనాయకుడు వాజ్‌పాయి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సైతం పాలస్తీనా సమస్యను సానుభూతితో అర్థం చేసుకున్నారు. వారి న్యాయమైన భూభాగంలో ఇజ్రాయెల్ అక్రమ చొరబాటును ఆక్షేపించారు. పాలస్తీనాపై అనేకసార్లు అమెరికా, ఇతర ఐరోపా దేశాల సహకారంతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధాలు, చేసిన దాడులను, క్రూరమైన హింసాయుత చర్యలను ఆయన ఖండించారు. ఆ విషయాన్ని మనం మరచి పోకూడదు. చారిత్రకంగా పాలస్తీనాకు జరిగిన అన్యాయం విషయంలో భారతదేశంతో సహా సమస్త అలీన దేశాలు అండగా నిలిచిన చరిత్రను మరిచిపోవద్దు. అప్పుడూ అందరూ ఏక కంఠంతో ఖండించిన వారే. సానుభూతి ప్రకటించిన వారే!

మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం

ఒకప్పుడు పాలస్తీనాకు అండదండగా యునైటెడ్ అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 1987 ఇస్లామిక్ రెసిస్టెన్స్ ముస్లీం బ్రదర్ హుడ్‌కు సపోర్ట్ కూడా ఉంది. 'పతా' లాంటి మితవాద సంస్థ కూడా పాలస్తీనాకు అండగా ఉంది. రష్యా కూడా ఇజ్రాయిల్ పాలస్తీనా పై దాడులు చేసినప్పుడు పాలస్తీనాకు అండగా నిలబడింది. ఇప్పుడు 'గాజా' భూభాగంలో ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో, ఇరువైపులా అనతికాలంలోనే సంభవించిన వందలాది మరణాలు, అపరిమితమైన విధ్వంసం ఆవేదన కలిగిస్తున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ పక్షాన అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు, ఇండియాతో సహా సపోర్ట్‌గా ఉంటే, హమాస్‌ (పాలస్తీన )పక్షాన లిబియా, సిరియా, ఇరాక్, ఇరాన్, యునైటెడ్ అరబ్ మొదలైన ఇస్లామిక్ దేశాలు అండగా ఉంటున్నాయి, ఇతర రాజ్యేతర శక్తులు కూడా రంగప్రవేశం చేస్తుండంతో రాబోయే రోజుల్లో ఇది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆధునిక యుద్ధంలో టెక్నాలజీతో వాడుతున్న ఆయుధాల వలన సామాన్య పౌరులుకు కష్టకాలం వచ్చిపడింది. వారు అన్ని రకాలుగా నలిగిపోతున్నారు.

అగ్రరాజ్యాల కపటత్వమే కారణం

ఈ దేశాల మధ్య శాంతి చర్చలు జరగకపోతే, ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి లాంటి సంస్థలు జ్యోక్యం చేసుకోపోతే ఇక ముందు జరగబోయే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేము. ఇండియాతో పాటు కొన్ని దేశాలు హమాస్‌ దౌష్ట్యాన్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్‌కు సంపూర్ణ సహకారం ప్రకటిస్తున్నాయి. హమాస్‌ ఎంత భయానకమైన ఉగ్రవాద సంస్థో, యూరోపియన్ రాజ్యాలు వివరిస్తూనే, పాలస్తీనా ప్రజల ‘న్యాయబద్ధమైన’ ఆకాంక్షల గురించి ఓ నామమాత్ర ప్రస్తావన చేస్తున్నాయి. ఈ ఆకాంక్షలకు హమాస్‌ ప్రతినిధి కాదని,ఈ చర్యలు పాలస్తీనియన్ల సంక్షేమానికి ఉపకరించవని వ్యాఖ్యానించాయి. కానీ, పాలస్తీనియన్ల సంక్షేమం, ఆకాంక్షల విషయంలో ఈ అగ్రరాజ్యాలన్నీ ఏడున్నర దశాబ్దాలుగా ఏం చేశాయి? అవి అనుసరిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరే హమాస్‌ వంటి మిలిటెంట్‌ సంస్థ ఇంతగా బలపడటానికి దోహదం చేసింది అనే చారిత్రక సత్యాన్ని మరచిపోతే ఎలా? హమాస్‌ స్వయంగా సముద్ర, వాయు, భూతల మార్గాల్లో దాడిచేయడమే కాదు, దానికి తోడుగా, వేలాది మంది యువకులు ప్రాణత్యాగానికి సిద్ధపడి అడ్డుగోడలు ఛేదించి మరీ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన సాహసం గమనించాలి. నాలుగు తరాలుగా సొంత భూభాగంలో పరాయివారుగా ఉంటూ, ఆంక్షలు, నిర్బంధాల మధ్య కనీసం జీవించే హక్కుకు కూడా నోచుకోని స్థితిలో సామాన్యులు సైతం ఇటువంటి మిలిటెంట్‌ సంస్థలవైపు ఆకర్షితులు కావడం సహజమే కదా! చారిత్రకంగా, ఇజ్రాయెల్‌ ఏర్పాటే ఓ వివాదాస్పదమైన ప్రక్రియ. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో కనీసం అరడజను భద్రతామండలి తీర్మానాలు, ఓస్లో ఒప్పందాలను అది యథేచ్ఛగా ఉల్లంఘించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టిన అగ్రరాజ్యాలే ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటూ, ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ నిరంకుశ వైఖరిని సమర్థిస్తుంటే, పాలస్తీనియన్లకు శాంతి ఒప్పందాలమీద, మిగతా ప్రపంచం మీద నమ్మకం సడలిపోకుండా ఎలా ఉంటుంది?

నెతన్యాహూ దుశ్చర్యల వల్లనే..

బెంజమిన్‌ నెతన్యాహూ తన పదవీకాలంలో ఎన్నడూ పాలస్తీనీయన్లతో న్యాయబద్ధంగా వ్యవహరించలేదనే విషయం ప్రపంచానికి తెలియదా? ఉన్మాదుల సలహాదారులతో నిండిన ఆయన ప్రభుత్వం ఆక్రమిత ప్రాంతాల్లో చేసే దుశ్చర్యలకు న్యాయస్థానాలు కొద్దో, గొప్పో అడ్డుతగులుతున్నందున జడ్జీల నియామక ప్రక్రియనే తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. లక్షలాదిమంది ఇజ్రాయెల్‌ పౌరులు ఆయన న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా రోడ్లమీదకు వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ఇజ్రయెల్ లోని వేలాది రిజర్వుసైనికులు కూడా బెంజమిన్‌ నెతన్యాహూ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. దేశంలోని అందరూ ఆయన పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆయన ఇజ్రాయెలీల రక్షకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన, బలమైన దాడికి 'హమాస్‌' సిద్ధపడుతున్నదనే సమాచారం పదిరోజులక్రితమే ఆయనకు ఇంటెలిజెన్స్ తెలిపినా... ఉద్దేశపూర్వకంగానే అజాగ్రత్తగా ఉన్నట్లు కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ నిర్ణయం గాజాతో పాటు మొత్తం పాలస్తీనానే తుడిచిపెట్టే దిశగా సాగుతోంది. ఈ దాడులతో విజయం సాధించి స్వదేశంలో అసమ్మతి లేకుండా చేయడానికి ఇది నెతన్యాహూకు ఉపకరిస్తుంది. హమాస్‌ మీద ఉన్న ప్రతీకార కక్షనంతా ఆయన అమాయకులైన గాజా ప్రజల పైన మీద తీస్తున్నాడు.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News