గుజరాత్ వర్సెస్ తెలంగాణ! సరికొత్త ప్రచారంతో నాయకులు

తెలంగాణ మోడల్' ఇప్పుడు రాష్ట్రంలో కొత్త నినాదంగా తెరపైకి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో 'గుజరాత్ మోడల్'ను బీజేపీ పాపులర్ స్లోగన్‌గా వాడుకున్నది.

Update: 2022-09-14 19:00 GMT

ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో బిచ్చగాళ్లను ఆశ్రమానికి తరలించి వాస్తవానికి ముసుగు కప్పింది తెలంగాణ ప్రభుత్వం. ట్రంప్ టూర్‌ సందర్భంగా పేదరికం, బస్తీ బతుకులు, మురికివాడలలోని జీవితాలు కనిపించకుండా గుజరాత్‌లో పరదాలు వేసింది మోడీ సర్కార్. ఇవి దాచేస్తే దాగని సత్యాలు. 'మోడల్‌'ను మార్కెటింగ్ చేసుకుని తిరిగి అధికారంలోకి రావడమే వారి పరమావధి. 'ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ' తరహాలో రెండు ప్రభుత్వాలూ అందమైన నినాదాలు ఇస్తూ నాణానికి రెండో వైపు కనిపించకుండా చేస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది జీవిత సత్యం. దర్పం కోసం పత్రికలలో యాడ్‌ల కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల కనీస సౌకర్యాలను తీర్చడంపై దృష్టి సారించాలి.

తెలంగాణ మోడల్' ఇప్పుడు రాష్ట్రంలో కొత్త నినాదంగా తెరపైకి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో 'గుజరాత్ మోడల్'ను బీజేపీ పాపులర్ స్లోగన్‌గా వాడుకున్నది. ఇప్పుడు జాతీయ రాజకీయాలలోకి ఎంటర్ కావాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే బాట ఎంచుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, దళితబంధు లాంటి స్కీమ్‌లను 'తెలంగాణ మోడల్'గా చెప్తున్నారు. నిజమే. ఈ పథకాలన్నీ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. ఈ పథకాలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటున్నది.

వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్‌ల గురించి ఇతర రాష్ట్రాల రైతులకు స్వయంగా కేసీఆరే విడమర్చి చెప్పారు. వారిని ప్రగతిభవన్‌కు పిలిపించుకుని రెండు రోజులపాటు సదస్సు పెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వ్యవసాయాధారిత సమాజంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే వీటిని దేశమంతటా అమలుచేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో వీటి గురించి రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో రైతు కేంద్రంగా ఇతర రాష్ట్రాలలో ప్రభావం కలిగించేలా ఆలోచనలు చేస్తున్నారు. త్వరలో వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి భారీ స్థాయి బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

గుజరాత్ వర్సెస్ తెలంగాణ

'గుజరాత్ మోడల్'ను సీఎం కేసీఆర్ 'గోల్‌మాల్'గా అభివర్ణించారు. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథకు గుజరాత్‌లోని డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌నే అప్పటి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదర్శంగా తీసుకున్నారు. అక్కడ అమలవుతున్న తీరును 2014 అక్టోబరు 18న స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆ రాష్ట్ర వాటర్ బోర్డు చైర్మన్ రాజీవ్ కే గుప్తతో చర్చించారు. ప్రాజెక్టు డిజైన్, వాడుతున్న టెక్నాలజీ, క్వాలిటీ, స్టాండర్డ్స్, గ్రిడ్‌లో భాగంగా వాడుతున్న పైప్‌ల నాణ్యత, నర్మదా డ్యామ్ నుంచి వాటర్ డ్రా చేసి వేర్వేరు ప్రాంతాలకు పంపిణీ చేసే మెకానిజం తదితరాలన్నింటినీ అధ్యయనం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటు సందర్భంగా కూడా గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనితీరును కేటీఆర్ అధ్యయనం చేశారు. 2017 జూలై 1 నుంచి రెండు రోజుల పాటు అక్కడ సందర్శించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సుందరీకరణ, ఒడ్డున నివసిస్తున్న ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడం, పార్కుల అభివృద్ధి, ఎదుర్కొన్న సవాళ్ళు, పూర్తి చేయడానికి పట్టిన సమయం తదితరాలన్నింటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు గుజరాత్ మోడల్‌పై కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.

'తెలంగాణ మోడల్' వెనుక

తెలంగాణలోని రైతుబంధును ఆదర్శంగా తీసుకుని ఒడిశా ప్రభుత్వం 'కలియా' ( కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్‌లీహుడ్ అండ్ ఇన్‌కమ్ ఆగ్‌మెంటేషన్) పేరుతో అమలు చేస్తున్నది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 'కృషక్ బంధు' పేరుతో అమలుచేస్తున్నది. ఈ రెండు రాష్ట్రాలూ తెలంగాణను స్ఫూర్తిగా తీసుకున్నట్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. ఒక రాష్ట్రంలోని పథకాలను మరో రాష్ట్ర అనుసరించడంలో తప్పులేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్ స్కీమ్ తరహా పథకం తమిళనాడులో 1987 నుంచీ 'డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి మెటర్నెటీ బెనిఫిట్ స్కీమ్' పేరుతో అమలవుతున్నది. గర్భిణులకు తొలి రెండు కాన్పుల వరకు రూ. 18 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. తెలంగాణలోని 'బస్తీ దవాఖాన' స్కీమ్ సైతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 'మొహల్లా క్లినిక్'ను ఆదర్శంగా తీసుకున్నదే.

రైతుబంధు, రైతుబీమా, దళితబంధులాంటి పలు పథకాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. స్కీమ్ డిజైన్‌ ఎలా ఉన్నా అమలులో అనేక లోపాలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడుతున్న రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లు సుమారు 40 లక్షల మంది కౌలు రైతులకు వర్తించడం లేదు. తెలంగాణ మోడల్ వెనుక చీకట్ల గురించీ చెప్పుకోవాలి. ఆచరణకు నోచుకోలేకపోయిన హామీలనూ ప్రస్తావించుకోవాలి. రైతుల ఆత్మహత్యలు, సక్రమంగా అమలుకాని రుణమాఫీ, అలంకారప్రాయంగా మిగిలిపోయిన రైతుబంధు సమన్వయ సమితులు, అటకెక్కిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, భూమిలేని పేద దళిత కుటుంబాలకు తలా మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి.. ఇలాంటివన్నీ తెలంగాణ ప్రజలకు మాత్రమే స్వీయానుభవం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులకు ఇది కనిపించని సత్యం.

అనేక లోపాలు

మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకుంటున్నా ఇప్పటికీ గ్రామాలలో నీటి కోసం మహిళలు రాస్తారోకో చేయాల్సి వస్తున్నది. అనేక ప్రభుత్వ పాఠశాలలకు తాగునీటి వసతి లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో విధిగా భగీరథ నీటిని తాగాలంటూ సీఎంఓ అధికారులు చెప్తున్నా ఇప్పటికీ ప్యాకేజ్డ్ వాటర్‌నే ప్రభుత్వ ఆఫీసులు, మీటింగులలో వాడక తప్పడం లేదు. బంజారాహిల్స్ లాంటి సంపన్న ప్రాంతాలలో తాగే నీటినే ఇప్పుడు గిరిజన గూడేలలో సైతం వాడుతున్నారనేది మాటలకే పరిమితమైంది. మరోవైపు ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నా సకాలంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయుల జీతాలకు దిక్కులేదు. గురుకుల విద్యా సంస్థలను ఆదర్శంగా చెప్పుకుంటున్నా ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో నిత్యం చిన్నారులు ఆస్పత్రులపాలవుతున్నారు. రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నిరసనలు చేయాల్సి వచ్చింది.

ఇక ఉపాధ్యాయులలో 317 జీఓ చిచ్చు కంటిన్యూ అవుతూనే ఉన్నది. వీఆర్ఏల సమస్యలకు హామీ ఇచ్చినా గాలికొదిలేయడంతో వారాల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. అసెంబ్లీని ముట్టడించిన తర్వాత ప్రభుత్వానికి వేడి తగిలింది. ప్రజారోగ్య వ్యవస్థలోనూ సమస్యలు పేరుకుపోయాయి. సర్కారు ఆస్పత్రులు గర్భిణులకు డెలివరీ సమయంలో పనికిరాకుండా పోతున్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనం లేకపోవడం, పర్యవేక్షణా లోపం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు చనిపోతున్నారు. ఉద్యోగాలలో కాంట్రాక్టు నియామకాలు ఉండవని చెబుతున్న సర్కారు ఆ పద్ధతిలోనే నియమించుకుంటున్నది. జిల్లాకో మెడికల్ ఆస్పత్రి అంటూ ఘనంగా చెప్పుకుంటున్నా టీచింగ్ ఫ్యాకల్టీ అంతంతమాత్రమే. 'విశ్వనగరం'లో గంటసేపు వర్షం కురిస్తే ప్రజలకు నరకం కనిపిస్తుంది.

సమస్యలు దాచేసి

ఇవన్నీ 'తెలంగాణ మోడల్'లో భాగమే. ఇతర రాష్ట్రాలకు కనిపించని సత్యాలు. తెలంగాణ స్కీమ్‌లు దేశమంతటా అమలుకావాలని భావిస్తున్న తరుణంలో వీటిని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడం సర్కారు బాధ్యత. దేశంలో ఎక్కడా లేని తీరులో తెలంగాణలో ఈ స్కీమ్‌లు ఉండడం గొప్పే. కానీ దాని వెనక చీకట్లపైనా ఆలోచన చేయాలి. వెలుగుతో నింపాలి. ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా' హైదరాబాద్‌లో బిచ్చగాళ్లను ఆశ్రమానికి తరలించి వాస్తవానికి ముసుగు కప్పింది తెలంగాణ ప్రభుత్వం. ట్రంప్ టూర్‌ సందర్భంగా పేదరికం, బస్తీ బతుకులు, మురికివాడలలోని జీవితాలు కనిపించకుండా గుజరాత్‌లో పరదాలు వేసింది మోడీ సర్కార్. ఇవి దాచేస్తే దాగని సత్యాలు. 'మోడల్‌'ను మార్కెటింగ్ చేసుకుని తిరిగి అధికారంలోకి రావడమే వారి పరమావధి. 'ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ' తరహాలో రెండు ప్రభుత్వాలూ అందమైన నినాదాలు ఇస్తూ నాణానికి రెండో వైపు కనిపించకుండా చేస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది జీవిత సత్యం. దర్పం కోసం పత్రికలలో యాడ్‌ల కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల కనీస సౌకర్యాలను తీర్చడంపై దృష్టి సారించాలి.అర్జీలతో పరిష్కారం కావాల్సిన సమస్యలు అసెంబ్లీ, ప్రగతి‌భవన్ ముట్టడి వరకూ వెళ్లకుండా చూసుకోవడం పాలకుల కనీస బాధ్యత.

 ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News