ఆయుష్షును పెంచే గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ఆయుష్షును పెంచే గ్రీన్ ఇండియా ఛాలెంజ్... green India Challenge has grown and how by sampath

Update: 2023-03-21 06:30 GMT

తెలంగాణ మునుపెన్నడూ లేని విధంగా పచ్చతోరణంతో.. పల్లెలన్నీ దర్శనం ఇస్తున్నాయి. పండగకో, పబ్బానికో ఆకుపచ్చ తోరణం తొడిగే ఊరు వాడ నేడు... గ్రామ ముఖ ద్వారంతోనే పచ్చటి ఆహ్లదంతో స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో పడావు బడ్డ భూములు, ఎండిన చెరువులు అటువంటిది నేడు ఏ మూలన చూసిన పచ్చని పైర్లే కాదు... పచ్చని అడవిలాంటి అందాన్ని పల్లె ధరించింది. దీంతో పల్లెలు నేడు ఆహ్లదకరమైన వాతావరణమే కాదు.. అంతులేని అప్యాయతను పంచుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే.. స్వచ్ఛమైన వాయువును ప్రసాదిస్తూ..‌. ఆయుష్షు పెంచేలా చేస్తుందనడంలోనూ సందేహం లేదు. అభివృద్ధి, ఆధునికత పేరుతో అడవులు తగ్గుతూ వస్తున్నాయి. అడవులను రక్షించడానికి ప్రతి ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ రక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వాస్తవానికి అడవులు అనేవి జీవకోటికి ప్రధానమైనది. అడవులు లేకుంటే మానవ మనుగడ, గొడ్డు గోదకు కష్టమైతుంది. అలాగే వర్షాలు సంవృద్దిగా కురియక తిప్పలు తప్పవు. అటువంటి అడవుల సంరక్షణ కోసం ఒక రోజును కేటాయించి.. అడవుల ప్రాధాన్యతపై అవగాహన తెలియజేయడానికి మై ఫారెస్ట్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు.

ప్రస్తుతం తెలంగాణలో ఓ రకంగా అటవీ సంపద పెరుగుతుందనే చెప్పవచ్చు. నేడు తెలంగాణలో చెట్ల పెంపకానికి ఓ కొత్త ట్రెండ్ రూపుదిద్దుకొని ఐదు సంవత్సరాలు కావస్తుంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మంచి ఫలితాలను ఇస్తుంది. వాస్తవానికి చెట్ల పెంపకం వల్ల వాయుకాలుష్యం తగ్గి.. స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుంది. అటువంటి మహత్తర కార్యక్రమం తెలంగాణలో ఉద్యమంలా సాగుతుంది. దీనిని 2018లో ప్రారంభించారు. ఆయన మేడ్చల్ జిల్లాలో 2042 ఎకరాలలో కీసర రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకొని దట్టమైన అడవిని సృష్టించడానికి పచ్చదనాన్ని పెంచడానికి .. తను ఆచరిస్తూ... నలుగురిని ఆచరించేలా విశేష కృషి చేస్తున్నారు. అది ఇప్పుడు తెలంగాణలో మామూలు పౌరుని నుంచి పెద్ద సెలబ్రిటీల వరకూ ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాగుతోంది. రోజు రోజుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటూ... తెలంగాణలో ఫారెస్ట్ అందాలను విస్తరించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది.

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రోడ్లు అనుకుని మురిసే సమాజానికి పచ్చదనం, అడవుల ప్రాధాన్యత తెలిసేలా నేటి తరానికి సంతోష్ కుమార్ ఓ ఆదర్శం. వేల ఎకరాలను దత్తత తీసుకోవడమే కాకుండా.. నేడు తెలంగాణలో మొక్కలు నాటడం జనజీవనంలో సంప్రదాయంగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్‌లు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకులను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయడం వల్ల తెలంగాణలో పచ్చదనం పరుగులు పెడుతుంది. పుట్టిన రోజు వేడుకైనా.. మరేదైనా శుభకార్యమైనా నాలుగు మొక్కలు నాటి తాము ఈ పచ్చదనం ఉద్యమంలో భాగస్వాములం అవుతామన్నట్లు పాల్గొంటున్నారు. కేవలం ఐదేళ్లలోనే తెలంగాణలో అటవీ సంపద పెరిగిందని చెప్పవచ్చు‌. అడవులు ఉంటే సమస్త జీవకోటితో పాటు మానవ మనుగడ బాగుంటుంది.

అటవీ దినోత్సవం నాడు మొక్కలు నాటుతూ మై ఫారెస్టు అంటూ సెల్ఫీ ఫోటోలు దిగడం.. అడవుల రక్షణ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ తెలంగాణలో సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనతి కాలంలో అవార్డులు అందుకునేలా చేసింది. దానికి ప్రజలు స్వచ్ఛందంగా నిరంతరంగా మొక్కలు పెంచేలా చేసిన కృషి అని చెప్పవచ్చు. వాస్తవానికి అడవి అమ్మ లాంటిది.. కాటకలిసి చేరినోళ్లను తను దగ్గరికి తీసుకొని కాపాడతది. జీవకోటికి అవసరమయ్యే సకల సంపదను తన పొత్తిళ్లలో దాచుకొని ఈ లోకానికి అందిస్తుంది. చెడు వాయువునంతా.. తను నింపుకొని స్వచ్ఛమైన వాయువును అందించి మన ఆయుష్షును పెంచుతుంది. అటువంటి అడవులు కనుమరుగవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా పేరుతో .. అడవుల సృష్టికి పదునైన పునాదిని వేశారు. దీంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యువత పాల్గొంటున్నారు. నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి చేసుకునే సంబరాలకు బదులు నాలుగు తరాలకు ప్రాణవాయువు అందించే మొక్కలు నాటడానికి తమ తమ పుట్టిన రోజు వేడుకలు, ఇతర అనేక సందర్భాలలో మొక్కలు నాటుతూ పచ్చదనానికి అండగా నిలుస్తున్నారు.

ఈ ఛాలెంజ్ ..నేడు దేశానికి ఆదర్శంగా మారింది. అనేక రాష్ట్రాల ప్రతినిధులు, విదేశి ప్రతినిధులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెచ్చుకుంటున్నారు. అడవులు సృష్టించడం అంటే ఓ మహా యజ్ఞం అది ఇన్ని రోజుల్లో ఏర్పడుతుందని చెప్పలేం.. అయినప్పటికీ తెలంగాణలో అడవుల అభివృద్ధికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ఆదర్శంగా మారింది. అడవులను కాపాడటం ఎంత ముఖ్యమో.. సృష్టించడం అంతే ముఖ్యం. అడవులు అంతరించిపోతున్న వేళ ఒక్కొక్కరిగా లక్షలాది మందిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో కదిలించి నేడు.. తెలంగాణలో దట్టమైన అడవి సృష్టికర్తగా.. ఆయన ఓ మహాయజ్ఞాన్ని మొదలు పెట్టారు. అడవులు అంతరించిపోకుండా చూడడంతో పాటు... దట్టమైన అడవులు పెంపకం జరిగేలా నిరంతరం ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సాగినప్పుడే.. అడవులు, వృక్ష సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి గొప్ప నిరంతర కార్యక్రమంతో.. భూమాత మురిసిపోయేలా ... పచ్చదనం అడవులు రూపుదిద్దుకునేలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ.. తెలంగాణను పచ్చదనంలో దేశంలోనే కిరీటంలా కృషి చేస్తూ ‌‌.. అటవీ సంపదకు..పరిరక్షణను తెలంగాణ వేదికగా మారిందని చెప్పవచ్చు..

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News